చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రేపు రిటైర్ అయిపోతున్నారు. ఆయన చేతుల్లో ఏదైనా పెట్టి, ఆయన భుజాలపై ఏదైనా కప్పి పంపిస్తే బాగుంటుంది.
మా ఎమ్మెల్యేలు ఇరవైమందికి సైడ్ బిజినెస్‌లో బాగా ప్రాఫిట్స్ వచ్చాయట! వీళ్లంతా అన్‌ఫిట్ అని రాష్ట్రపతికి రిపోర్ట్ ఇచ్చిమరీ వెళ్తున్నాడు. ఇస్తే ఇచ్చాడు. మేలు చేశాడు. ఢిల్లీకి కేజ్రీవాల్ అనే సీఎం ఉన్నాడని మళ్లీ ఇన్నాళ్లకి కాంగ్రెస్‌కి, బీజేపీకి గుర్తొచ్చుంటుంది. అపోజిషన్‌కి గుర్తుంటేనే పబ్లిక్‌కి గుర్తుంటాం. చీపురు పట్టుకుని శుభ్రంగా ఎంత ఊడ్చినా ఎవరూ చూడరు. ‘ఇదా శుభ్రంగా ఊడ్వడం?’ అని ఎవరైనా అంటే అప్పుడు చూస్తారు.
ఉదయం పనమ్మాయి గది చిమ్ముతూ చెప్పింది, ‘‘మిమ్మల్ని కూడా రాజీనామా చెయ్యమంటున్నా రండీ’’ అని! ‘‘ఎవరు?’’ అని అడిగాను.
‘‘బీజేపీ స్పోక్స్‌పర్సన్ అటండీ’’ అంది, చీపుర్ని వెనుక నుంచి అరిచేత్తో తట్టి సరిచేసుకుంటూ.
ఆఫీస్‌కి వెళితే అక్కడా పనమ్మాయి గది చిమ్ముతూ చెప్పింది, ‘‘మిమ్మల్ని కూడా రాజీనామా చెయ్యమంటున్నారండీ’’ అని!
‘‘ఎవరు?’’ అని అడిగాను.
‘‘ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అటండీ’’ అంది,
ఇంటర్‌కమ్‌లో సౌరభ్‌ని పిలిచాను. వచ్చాడు.
‘‘ఏకే జ్యోతిని ఎప్పుడైనా చూశావా?’’ అన్నాను.
‘‘ఎవరు కేజ్రీ... ఆవిడ’’ అని అడిగాడు.
‘‘నేను చెప్పనా సర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్’’ అంది పనమ్మాయి.
‘‘ఓ! ఆయనా.. జ్యోతి అంటే లేడీనేమో అనుకున్నా’’ అన్నాడు సౌరభ్.
‘‘ఎలా ఉంటారాయన? పిలిస్తే వస్తారా?’’ అడిగాను సౌరభ్‌ని.
‘‘నవ్వుతూ ఉంటారు. అయితే మనల్ని చూస్తే నవ్వుతారా అని డౌటు’’ అన్నాడు.
‘‘నవ్వక పోయినా ఫర్వాలేదు. పిలిస్తే వస్తారా?’’ అని అడిగాను.
‘‘గుజరాత్ వాళ్లు పిలిస్తే వెళుతుంటారు. అయితే మనం పిలిస్తే వస్తారా అని డౌటు’’ అన్నాడు.
‘‘వెళ్తూ వెళ్తూ ఎవరైనా పుల్లలు పెట్టి వెళ్తారు. ఈయనెవరో వెరైటీగా పుల్లలు పట్టుకెళుతున్నాడు’’ అన్నాను.
‘‘పుల్లలు పట్టుకెళ్లడంలో వెరైటీ ఏముంది కేజ్రీ’’ అన్నాడు సౌరభ్.
‘‘పుల్లలు పెట్టడానికి పుల్లలు పట్టుకెళ్లడం వెరైటీనే కదా. ఆ క్రియేటివిటీ నాకు నచ్చింది’’ అన్నాను.
‘‘క్రియేటివిటీ ఆయనది కాదు కే జ్రీ. మీది. మీరు క్రియేటివ్‌గా ఆలోచిస్తూ, వెరైటీగా ఆయనకు ఏదైనా చేయాలనుకుంటున్నారు. ఇరవై పుల్లలతో సరిపెట్టుకున్నాడు. కొత్త ఫిటింగ్ ఏదైనా పెట్టి, ఆ ఇరవైకి ఇంకో ఇరవై పుల్లలు లాగేస్తే మన గవర్నమెంటు ఊడ్చుకుపోయేది..’’ అన్నాడు సౌరభ్.
నిజమే! చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కి ఏదైనా చేద్దామని నేను అనుకున్నట్లే, మోదీజీకి ఏమైనా చేసి వెళదామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనుకుని ఉంటే.. పార్టీకి పుల్లలే మిగిలి ఉండేవి.
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment