రామ్‌నాథ్ కోవింద్ రాయని డైరీ
నాకేం తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి! ‘రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడతావా కోవిందా?’ అని కూడా నన్నెవరూ అడగలేదు. ‘కోవిందా నువ్వు రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడుతున్నావు’ అని మాత్రమే ఢిల్లీ నుంచి బిహార్‌కు ఎవరో ఫోన్ చేసి చెప్పారు! ‘నాకెవరూ ఫోన్ చేసిందీ’ అని ఢిల్లీ వచ్చినప్పుడు అడిగితే, ‘అవును ఎవరు చేశారూ?’ అని అంతా నన్ను అడిగినవాళ్లే!
గవర్నర్‌గా రాజీనామా చెయ్యడానికి ప్రణబ్ ముఖర్జీ దగ్గరకు వెళ్లినప్పుడు ఆయనా సర్‌ప్రైజ్ అయ్యారు. ‘భలే వచ్చింది ఫోన్ మీకు కోవింద్‌జీ. నాకు వస్తుందనుకున్నది మీకు వచ్చిందా?’ అన్నారు.
నేను సర్‌ప్రైజ్ అయ్యాను!
‘‘అవును కోవింద్‌జీ.. ‘ఇంకో ఐదేళ్లు మీరే రాష్ట్రపతిగా ఉండబోతున్నారు ప్రణబ్‌జీ’ అని మోదీజీ నుంచి నాకు ఫోన్ వస్తుందనుకున్నాను’’ అన్నారు ప్రణబ్.
‘‘అలా ఎందుకు అనుకున్నారు ప్రణబ్‌జీ. మీరు సోనియా మనిషి కదా. ఆ విషయం మోదీజీకి తెలియకుండా ఉంటుందా?’’ అని అడిగాను.
‘‘కానీ కోవింద్‌జీ.. ఈ ఐదేళ్లలో సోనియాజీ కన్నా, మోదీజీనే నాకు ఎక్కువసార్లు ఫోన్ చేశారు. అందుకే అలా అనుకున్నా’’ అన్నారు ప్రణబ్.
నా రాజీనామా మీద సంతకం పెడుతూ ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు.
‘‘గవర్నర్‌గా మిమ్మల్ని అపాయింట్ చేసిందీ నేనే, గవర్నర్‌గా మీ రాజీనామా పత్రం మీద సంతకం చేస్తున్నదీ నేనే. జీవితం చాలా చిత్రంగా అనిపిస్తుంటుంది కోవింద్‌జీ’’ అన్నారు ప్రణబ్.
‘‘ఇందులో చిత్రం ఏముంది ప్రణబ్‌జీ.. గవర్నర్‌ని అపాయింట్ చేయవలసిందీ, గవర్నర్ రాజీనామా మీద సంతకం చేయవలసిందీ రాష్ట్రపతే కదా’’ అన్నాను.
‘‘దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నది. నా పదవిని మీ కివ్వడం కోసం, మీ పదవీ విరమణపై నేను సంతకం చేయడం!! లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కోవింద్‌జీ’’ అన్నారు ప్రణబ్.
నేను మళ్లీ సర్‌ప్రైజ్ అయ్యాను.
‘‘ప్రణబ్‌జీ.. మీరు రెండు విధాలుగా మాట్లాడుతున్నారు. జీవితం చాలా చిత్రంగా ఉంటుంది అంటున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనీ అంటున్నారు!!’’ అని అడిగాను.
‘‘చిత్రంగా ఉండడమే జీవితంలోని బ్యూటీ కోవింద్‌జీ’’ అని ప్రణబ్ చిత్రంగానో, బ్యూటిఫుల్‌గానో నవ్వారు. ఆ నవ్వులో ప్రణబ్ లేడు. రాష్ట్రపతీ లేడు. ఎవరివో పోలికలు కనిపిస్తున్నాయి. బహుశా ఐదేళ్ల తర్వాత నేనూ అలాంటి నవ్వే నవ్వుతానేమో.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనుకుంటూ.
జూలై 17నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. అదే రోజు రాష్ట్రపతి ఎన్నిక. పెద్ద కిక్కేం లేదు. ముందే గెలిపించుకుని, తర్వాత ఎన్నికలు జరిపించుకుంటున్నట్లు ఉంటుంది రాష్ట్రపతిని ఎన్నుకోవడం. నాక్కావలసిన కిక్కు వేరే ఉంది. ఆ రోజు ఢిల్లీ నుంచి బిహార్‌కు ఫోన్ చేసిందెవరు?!
అది తెలుసుకోవాలి.
- మాధవ్ శింగరాజు