ఇవాంకా ట్రంప్ రాయని డైరీ
ఆడవాళ్ల ఒంటి మీద ఫ్యాషన్ ఉంటుంది. మగాళ్ల మాటల్లో ఫ్యాషన్ ఉంటుంది. ఈ సంగతి నేను వైట్‌హౌస్ మీటింగ్ హాల్లో కనిపెట్టాను.
మగాళ్ల మాటల్లో.. అమ్మాయిలు ముతకతనాన్ని ఇష్టపడతారా లేక మెతకతనాన్ని ఇష్టపడతారా అన్నది ఆ అమ్మాయిల టేస్ట్. ఎవరికి ఏ స్టిచింగ్ నచ్చితే దాన్నే కదా చేతుల్లోకి తీసుకుని మునివేళ్లతో ఆ అల్లికల్లోని ఎగుడుదిగుళ్లను ఆపేక్షగా తాకి చూస్తారు. నేనూ అలాగే జస్టిన్ ట్రూడోని తాకి చూశాను. అయితే వేళ్లతో కాదు. కళ్లతో తాకి చూశాను. జస్టిన్ ట్రూడో కెనడా దేశ ప్రధాని!
ట్రూడో మాట బాగుంది. ఇంగ్లిష్ భాష బాగుంది. మీటింగ్ హాల్లోకి వస్తూనే ‘ఈజ్ దిస్ సీట్ టేకెన్’ అని స్టయిల్‌గా అన్నాడు. కాదు కాదు.. అతడు స్టయిల్‌గా అనలేదు. ఆ అనడం స్టయిల్‌గా ఉంది. ట్రూడో అడిగింది నా పక్క సీటు గురించే. అయితే అది నా పక్క సీటు అని గ్రహించి మాత్రం అతడు అడిగి ఉండడు. నేను అనుకోవడం ఏంటంటే.. అతని దృష్టిలో అది కేవలం ఏదో ఒక సీటు.
ట్రూడో.. ‘ఈజ్ దిస్ సీట్ టేకెన్’ అనగానే,
‘ఎస్, బై యు’ అన్నాను. మా అమ్మాయిలంతా ‘ఓ..’ అని లేచారు. ‘ఊ..’ అని కొందరు! ట్రూడో నవ్వాడు. అతడు నాకన్నా పదేళ్లు పెద్ద. ఒక దేశానికి పెద్ద. అయితే ఆ పెద్దరికాన్ని నేను మా ఇద్దరి మధ్యలోకి ఏ మాత్రం రానివ్వదలచుకోలేదు. చెయిర్ హ్యాండిల్‌పై చేత్తో తట్టి అతడిని నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను. అతడినే కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాను.
నాకేదైనా ఫ్యాషనబుల్‌గా అనిపిస్తే వెంటనే దాన్ని తొడుక్కుంటాను. తొడుక్కుని తీసి, తగిలించాక కూడా దాన్నే కొద్దిసేపు చూస్తూ కూర్చుంటాను. ట్రూడో ఒకవేళ తన నడుముకు ఆకులు తప్ప వేరే బట్టలేమీ లేని ఆదిమానవుడిలా వైట్‌హౌస్‌లోకి ప్రవేశించినా కూడా అదేం నాకు పట్టింపు కాదు. అతడి మాటల్లో డిజైనింగ్ ఉంటే చాలు.. అది నన్ను పట్టేస్తుంది. అప్పుడు కూడా నేనిలాగే బిడియం లేకుండా అతడినే చూస్తూ కూర్చొని ఉండేదాన్ని. బిడియపడితే ఫ్యాషన్‌ని మిస్సవుతాం. ఆడపిల్లలు దేన్ని మిస్సయినా ఫ్యాషన్‌ని మిస్ కాకూడదు.
‘ఉమెన్ ఇన్ వర్క్‌ఫోర్స్’.. మా రౌండ్ టేబుల్ డిస్కషన్ పాయింట్. అందరం అమ్మాయిలం. ట్రూడో ఒక్కడే మగాడు! నవ్వొస్తోంది నాకు. టేబుల్ మీద వాటర్ గ్లాస్‌లు ఉన్నాయి. ‘మంచినీళ్లు తాగుతారా?’ అని అడిగితే, ‘మంచినీళ్లు తాగొచ్చా?’ అని అడిగేలా ఉన్నాడు!
మీటింగ్ అయ్యాక డాడీ వచ్చి నన్ను మురిపెంగా తన ‘ప్రెసిడెంట్ సీట్’లో కూర్చోబెట్టారు. నాకు ఈ వైపు డాడీ, ఆ వైపు ట్రూడో నిలుచున్నారు. ట్రూడో నన్ను తాకకుండా ఎడంగా నిలుచున్నాడు. అది నా హార్ట్‌ని టచ్ చేసింది!
- మాధవ్ శింగరాజు