రాయని డైరీ జితిన్ ప్రసాద (కాంగ్రెస్) | madhav singaraju unwritten diary | Sakshi
Sakshi News home page

రాయని డైరీ జితిన్ ప్రసాద (కాంగ్రెస్)

Published Sun, Sep 4 2016 8:40 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

రాయని డైరీ  జితిన్ ప్రసాద (కాంగ్రెస్)

రాయని డైరీ జితిన్ ప్రసాద (కాంగ్రెస్)

దేవుడి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. తీన్ మూర్తి లేన్స్‌లో ఇంకా సూర్యుడు ఉదయించలేదు. దేవుడి కన్నా ముందు దేవుడి గురించిన ఆలోచన మనుషుల్లో ఉదయించడం అందమైన విషయం. అప్పుడిక మనుషుల గురించి ఆలోచించడానికి దేవుడు ఉదయాన్నే పనిగట్టుకుని లేవనక్కర్లేదు. ఆయనక్కొంత రెస్ట్. స్థిమితం!

దేవుడు చాలా ఇచ్చాడు మనిషికి. చూడమని పక్షుల్ని. తిరగమని అడవుల్ని. వినమని మ్యూజిక్‌ని. చదవమని పుస్తకాల్ని. టేస్ట్ చెయ్యమని మంచి మంచి రెసిపీలని, మాట్లాడుకొమ్మని ఫ్రెండ్స్‌ని. ఆట్లాడుకొమ్మని రాఫ్టింగ్‌నీ, రోయింగ్‌నీ, యాటింగ్‌నీ, సాకర్‌నీ ఇచ్చాడు. ఇప్పుడివన్నీ వదిలి యూపీ వెళ్లిపోవాలి! అదే ఆలోచిస్తున్నాను. ఢిల్లీలో తెల్లవారుజామునే ఒళ్లు విరుచుకునే ఒక్క పక్షిని వదిలి వెళ్లినా, దేవుణ్ణి వదిలి వెళ్లినట్టే నేను.


‘‘ఎక్కడా?’’... గులామ్ నబీ ఆజాద్ ఫోను. ‘‘ధ్యానంలో’’ అన్నాను. ‘‘ధ్యానం సరే... ఎక్కడా అని’’ అన్నారు ఆజాద్. చెప్పాను. ‘‘ఢిల్లీలో మనం ఇప్పటికిప్పుడు చెయ్యవలసిన ధ్యానసాధనలు ఏమీ లేదు కానీ, వెంటనే ఫ్లయిటెక్కి యూపీ వచ్చేయ్’’ అన్నారు ఆజాద్.

ఎన్నికలు పూర్తయ్యే వరకు వీళ్లు నా దగ్గరికి దేవుణ్ణి, దేవుడి దగ్గరికి నన్నూ రానిచ్చేలా లేరు, పోనిచ్చేలా లేరు. యూపీలో దిగాక, ఎట్లీస్ట్ షాజహాన్‌పూర్‌లో మా ఇంటికెళ్లి దేవుడి పటానికి దండం పెట్టుకొని వస్తానన్నా ఆజాద్‌కి కోపం వచ్చేలా ఉంది! ఆ కోపం నా మీద కాదు. దేవుడి మీద. ఎన్నికల ప్రచారానికి రానివ్వకుండా దేవుడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని.

కాంగ్రెస్‌కి ఓటేసే వారు, కాంగ్రెస్‌కి ఓటు వేయించేవారు ఇప్పుడు దేవుడి కంటే ఎక్కువ ఆజాద్‌కీ, రాజ్‌బబ్బర్‌కీ! ఇద్దరూ మా కాంపెయిన్ లీడర్స్. షీలాదీక్షిత్‌ను సీయెంను చేసే బాధ్యతను వాళ్లిద్దరి మీదా పెట్టించాడు ప్రశాంత్ కిశోర్. ది గ్రేట్  పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అతడిని మించిన స్ట్రాటజిస్టులు ఆజాద్, బబ్బర్. వాళ్ల బరువును కొంత తీసి నా మీద పెట్టారు. ఇప్పుడు ‘బరువు, భారం, బాధ్యత పూర్తిగా నీదే.. యంగ్ లీడర్’ అంటున్నారు!
 దేవుడు నాకు జన్మనిచ్చాడు. మా నాన్న నాకు కాంగ్రెస్‌ను ఇచ్చి దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. అందుకని దేవుడు, కాంగ్రెస్ ఒకటే నాకు. ఒకటే కానీ, దేవుడి ముందు అబద్ధాలాడకూడదు. కాంగ్రెస్ దగ్గర నిజాలు మాట్లాడకూడదు. యూపీలో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. యూపీ సమస్యలపై ప్రియాంక మాట్లాడుతున్నారు. యూపీని షీలాదీక్షిత్ నడిపించబోతున్నారు. అంతా క్లియర్‌గా ఉంది. యూపీలో కాంగ్రెస్ వస్తుందా లేదా అన్నదొక్కటే అన్‌క్లియర్.
 
మళ్లీ ధ్యానంలోకి వెళ్లిపోయాను. దేవుణ్ణి నేనేమీ కోరుకోలేదు. ఎన్నికల్ని మాత్రమే ఆయన ప్రసాదిస్తాడు. గెలిచే ప్రయత్నం మాత్రం మానవులే చెయ్యాలి.

-మాధవ్ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement