
నితిన్ గడ్కారీ రాయని డైరీ
గార్డెన్‌లో వాకింగ్ చేస్తున్నాను. చల్లటి ఉదయపు గాలి ఒంటికి హాయిగా తాకుతోంది. ఎకరం స్థలంలో రంగురంగుల పూల మొక్కలు, పరిమళాలు! అసలు నేనొచ్చాకే లుట్యన్స్ జోన్ బంగ్లాలోని ఈ పూలతోట కళకళలాడుతోంది. నాకన్నా ముందు ఇక్కడ సోనియాజీ ఉండేవారు. దేశాన్ని నిర్లక్ష్యం చేసినట్లే, ఈ పూలతోటనూ ఆవిడగారు ఆలన, లాలన లేకుండా వదిలేశారు. కాషాయవర్ణంలోని పూల మొక్కలనైతే అసలే పట్టించుకున్నట్టు లేదు!
రాలి, కుళ్లిన ఆకుల చెత్తను ఏరి మొక్కల పాదుల్లో వేస్తున్నాను. మోదీజీ నుంచి ఫోన్.‘‘ ఏం చేస్తున్నావ్ గడ్కారీ’’ అని. ఆయన గొంతులో విసుగు.
‘‘చెత్త ఎత్తిపారేస్తున్నా మోదీజీ’’ అని చెప్పాను.
‘‘ఎత్తిపారేస్తున్నావా? నెత్తికి ఎత్తుకుంటున్నావా?’’ అన్నారు! పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని పెద్దాయన ఆవేదన. ప్రతిపక్షాల మీద చల్లాల్సిన బురదను మా మంత్రులు, ఎంపీలమంతా సొంత పార్టీ మీద చల్లుతున్నామట!
‘‘నేనెప్పుడు బురద చల్లాను మోదీజీ’’ అన్నాను. ‘‘బురద చల్లినా బాగుండేది. కానీ తమరు యూరియా, నత్రజని చల్లుతున్నారు’’ అన్నారు.
ఆయన మాట్లాడుతున్నది నాగపూర్‌లో నేను చేసి వచ్చిన ప్రసంగం గురించి. ‘‘కరువు ప్రాంతానికి వెళ్లినవాడివి నీళ్ల గురించి మాట్లాడాలి గానీ, ఎరువుల గురించి మాట్లాడ్డం ఏమిటి? నీ ఇంట్లో మొక్కలకి నీళ్లకు బదులుగా నువ్వేం పోసి పెంచుతున్నావన్నది జనానికెందుకు?’’ అన్నది మోదీజీ పాయింట్. ‘‘పరువు తీస్తున్నారయ్యా, ట్వీటర్ చూళ్లేదా? ‘మోదీజీ టాయ్‌లెట్‌లో పోయమంటారు. గడ్కారీ గార్డెన్‌లో పోయమంటారు. ఇంతకీ ఈ దేశం ఎక్కడ పోసుకోవాలి’ అని అడుగుతున్నారు’’ అన్నారు మోదీజీ.
‘‘కానీ నా ఉద్దేశం వేరు మోదీజీ’’ అని చెప్పబోయాను. అటువైపు ఫోన్ కట్ అయింది.
చల్లటి గాలి వడగాల్పులా మారిపోయింది. గార్డెన్‌లో ప్రహరీ గోడకు లోపలి వైపు ఓ చోట పూలబొకేలు కుప్పగా పడి ఉన్నాయి. ‘‘గులాబ్‌సింగ్’’ అని గట్టిగా కేకేశాను. గార్డు పరుగున వచ్చాడు. ‘‘ఏమిటిది’’ అని అడిగాను. కుప్పవైపు చూశాడు గులాబ్ సింగ్. ‘‘జీ.. మన బంగ్లా నుంచి వెళ్లిన బొకేలే ఇవన్నీ. మళ్లీ మన బంగ్లాలోకే ఎలా వచ్చి పడుతున్నాయో తెలియడం లేదు!’’ అన్నాడు.
మోదీజీ నుంచి మళ్లీ ఫోను. ‘‘అచ్ఛా... గడ్కారీ, మనం గవర్నమెంట్‌ని ఫామ్ చేసి మే 26కి ఏడాది అవుతోంది. గుర్తుందా?’’ అన్నారు మోదీజీ. ‘‘ ఉంది ఉంది మోదీజీ. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాను’’ అని చెప్పాను.
‘‘గుడ్... నీ ఏర్పాట్లు నువ్వు చేస్కో. నాకు మాత్రం బొకే పంపకు’’ అని టప్పున ఫోన్ కట్ చేసేశారు మోదీజీ.
- మాధవ్ శింగరాజు