
నా నవ్వును మోదీ పట్టించు కోలేదు!
గోవాలో క్లైమేట్ బాగుంది. ఇండియాలోనే.. చైనాకు ఏమంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేదు. మోదీ తీరు కూడా అన్‌ఫ్రెండ్లీగా ఉంది. గోవాలో ల్యాండ్ అయినప్పటి నుంచీ చూస్తున్నాను. ఆయన నన్ను చైనా ప్రెసిడెంట్‌లా కాకుండా పాకిస్తాన్ ప్రధానిలా ట్రీట్ చేస్తున్నారు! సమ్మిట్‌కి వచ్చి తప్పు చేశానా?!
మధ్యాహ్నం ఒకటీ పదికి ఇండియాకు వస్తే, ఐదూ నలభై దాకా మోదీ బిగదీసుకునే కూర్చున్నారు! తిన్నారా అని అడగలేదు. కాసేపు బీచ్‌లో అలా తిరుగుతారా అని అడగలేదు. నేనే వెళ్లి తిందామా అని అడిగాను. కాసేపు బీచ్‌లో అలా తిరుగుదామా అని కూడా అడిగాను. ‘‘సారీ మిస్టర్ షరీఫ్.. మీటింగ్‌కి ప్రిపేర్ అవ్వాలి కదా. మీరు కానిచ్చేయండి’’ అన్నారు మోదీ! పక్కనే ఉన్నాయన మోదీ చెవిలో ఏదో చెప్పాడు. ‘‘సారీ మిస్టర్ జిన్‌పింగ్.. పాకిస్తాన్ గురించి ఆలోచిస్తూ, మిమ్మల్ని మర్యాద లేకుండా షరీఫ్ అనేశాను’’ అన్నారు మోదీ. ‘ఇట్సాల్ రైట్’ అని నవ్వాను. నా నవ్వును మోదీ పట్టించు కోలేదు! లాప్‌టాప్‌లో ఏదో కొట్టుకుంటున్నారు.
పాక్ మీద మోదీ ఎంత కసిగా ఉన్నారో ప్రతి మూవ్‌మెంట్‌లోనూ కనిపిస్తోంది. ఆయన ప్రతి మూవ్‌మెంట్‌లో కాదు. నా ప్రతి మూవ్‌మెంట్‌లో. నేను ఎలా కదిలినా మోదీకి నచ్చడం లేదు. మీటింగ్ హాల్ ఎంట్రెన్స్‌లో సెక్యూరిటీకి కూడా నేను నచ్చినట్టు లేదు. పైనుంచి కిందికి నన్నొకసారి చూసి వదిలేశాడు! ఇండియాలో నాకంతా మోదీల్లానే కనిపిస్తున్నారు.
మోదీ నేనూ ఎనిమిదిసార్లు కలుసుకుని ఉంటాం. ఎప్పుడూ ఆయన ఇలా లేరు! బీజింగ్‌లో ఫ్లయిట్ ఎక్కేముందు మోదీ నుంచి ట్వీట్స్ ఏమైనా ఉన్నాయేమోనని చూశాను. లేవు! పుతిన్‌కి మాత్రం పెట్టారు. ‘విషింగ్ యు ఎ ఫ్రూట్‌ఫుల్ ఇండియా విజిట్’ అని! హర్ట్ అయ్యాను. చైనా పండ్లూ ఫలాలూ మోదీకి అక్కర్లేదు, చైనా ప్రాడక్ట్స్ ఇండియాకు అక్కర్లేదు!
మీటింగ్ మొదలైంది. నేను, మోదీ ఇద్దరమే ఉన్నాం. జేబులో ఉన్న స్లిప్ తీశాను. మోదీతో నేను డిస్కస్ చెయ్యాల్సిన పాయింట్లు అందులో ఉన్నాయి. ఇండియాలోని చైనా అంబాసిడర్ తన జేబులోంచి తీసి నా జేబులో పెట్టిన స్లిప్ అది. ఇండియాలోని పాకిస్తాన్ హైకమిషనర్ తీసుకొచ్చి ఆ స్లిప్పును మా అంబాసిడర్ జేబులో పెట్టాడట!
మోదీ నవ్వారు. హమ్మయ్య! దేశాలు ఎలా ఉన్నా, మనుషులు సంతోషంగా ఉండాలి. అదే అన్నాను మోదీతో. మోదీ మళ్లీ నవ్వారు. ‘మనుషులు ఎలా ఉన్నా దేశాలు సంతోషంగా ఉండాలని మీ కారిడార్ మిత్రుడు అనుకుంటున్నాడు కదా.. మిస్టర్ జిన్‌పింగ్’ అన్నారు!
గాటిట్! మోదీ పీస్ మోడ్‌లో లేరు. స్లిప్‌ని మడతపెట్టి జేబులో పెట్టేసుకున్నాను. ‘ఆ స్లిప్ ఏమిటి మిస్టర్ జిన్‌పింగ్’ అని అడిగారు మోదీ నవ్వుతూ. ఏం లేదు అన్నాను. అందులో... భారత్‌కి పాక్ పంపిన శాంతి రాయబారం ఉంది.
..మాధవ్ శింగరాజు