
హరీశ్ రావత్, ముఖ్యమంత్రి రాయని డైరీ
నెల రోజులుగా పని లేదు. మొత్తం రాష్ట్రపతే చూసుకుంటున్నారు ఢిల్లీ నుంచి. పైనున్న బృహస్పతిలా!
ఉత్తరాఖండ్ దేవభూమి. దేవుళ్లు, దేవతలు ఉండే భూమి. రాష్ర్టపతి పాలన అన్నప్పుడు.. తప్పదు, ప్రజలతో పాటు దేవుళ్లూ ప్రణబ్ ముఖర్జీ పాలన కిందికి వెళ్లవలసిందే. రాష్ర్టం కన్నా, రాష్ట్ర ప్రజల కన్నా, రాష్ట్రంలోని దేవుళ్ల కన్నా ముఖ్యమంత్రి గొప్పవాడేం కాదు కనుక అతడూ.. అధికరణాల ముందు నిలబడవలసిందే.
‘కూర్చోండి సార్, మీరు నిలబడడం ఏమిటి?’ అంటున్నారు నా ఎమ్మెల్యేలు. కూర్చుని ఏం చెయ్యాలి? పని లేనప్పుడు కూర్చున్నా ఒకటే, సచివాలయం లాన్‌లో నడుచుకుంటూ వెళ్లినా ఒకటే.
‘బల నిరూపణలో ఎప్పటికైనా మనమే గెలుస్తాం సార్’ అంటున్నాడు కిశోర్ ఉపాధ్యాయ్. ఆయన మా పార్టీ ప్రెసిడెంటు. పక్కకు రమ్మన్నాను. ఆయనతో పాటు యూత్ కాంగ్రెస్ లీడర్లు కొందరు పక్కకు వచ్చారు. సెంటర్‌లో బీజేపీ ఉన్నంత కాలం ఎవల్యూషన్ థియరీలు, రివల్యూషన్ థియరీలు పనిచెయ్యవని వీళ్లకెలా అర్థమయ్యేలా చెప్పాలి? చెప్పలేదు. వాళ్లూ చెప్పమని అడగలేదు. దటీజ్ కాంగ్రెస్. పార్టీనుంచి వెళ్లిపోయిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలదీ సేమ్‌టుసేమ్. డి.ఎన్.ఎ. వెళ్లేముందు ఎందుకు వెళ్లిపోతున్నదీ చెప్పలేదు. వెళ్లాకైనా ఎందుకు వెళ్లిపోయిందీ చెప్పలేదు.
‘బల నిరూపణకు తొందరేముంది? ముందసలు మీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టారో తేలనివ్వండి’ అంది కోర్టు! మా లాయర్ ఏదో చెప్పబోయాడు. కోర్టు ‘ ష్..’ మంది. నోటి మీద వేలేసుకుని వెనక్కి వచ్చేశాడు. మా చీఫ్ సెక్రెటరీ ఏదో అడగబోయాడు. నీకిక్కడ పనేమిటంది కోర్టు. ఆయనా హర్ట్ అయ్యాడు.
కోర్టులు వినేది వింటాయి. చెప్పేది చెప్తాయి. విన్నదీ, చెప్పిందీ మ్యాచ్ అవ్వాలని ఆశించడం కోర్టువారి ధర్మాన్ని, కోర్టువారి న్యాయాన్ని శంకించడమే. శంకల్లేకుండా మా వాళ్లు కోర్టు మెట్లు దిగి వచ్చేశారు. కేసు తెగే లోపు కోర్టు సెలవులు వచ్చేశాయంటే.. మళ్లీ ఇంకో నెల రోజులు రాష్ట్రపతి పాలన. చార్‌ధామ్ యాత్ర కోసమని ఈ అరవై తొమ్మిదేళ్ల వయసులో కోర్టువారు నాకు సెలవులు ప్రసాదించబోతున్నట్టే ఉంది చూస్తుంటే.
‘ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు సార్’ అన్నాడు కిషోర్ ఉపాధ్యాయ్ మళ్లీ వచ్చి. మోదీ పేరో, అమిత్‌షా పేరో, వాళ్లిద్దరూ కాకపోతే ఉత్తరాఖండ్ బీజేపీ ప్రెసిడెంట్ అజయ్ భట్ పేరో చెప్తాడనుకున్నాను. అవేవీ చెప్పకుండా, ‘రాష్ట్రపతి ఆత్మ ప్రబోధానుసారం పని చెయ్యడం లేదు సార్’ అన్నాడు. నాకైతే అలా అనిపించలేదు. ఆత్మలు లేవు, అంతరాత్మలు లేవు. ఒకవేళ ఉన్నా 2014 నుంచి ఎవరి ఆత్మలు, అంతరాత్మలు వారి దగ్గర ఉండడం లేదు. ఎవర్నని తప్పు పడతాం?
ఉత్తరాఖండ్ నిండా గుళ్లున్నాయి. గుళ్లల్లో దేవుళ్లున్నారు. ఊళ్లున్నాయి. ఊళ్లలో ప్రజలున్నారు. ఒక దండం పెట్టి వాళ్లకు వదిలేస్తే సరి.. బలాబలాలు వాళ్లే తేల్చేస్తారు. బల నిరూపణలతో పని లేకుండా.
మాధవ్ శింగరాజు