
బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ రాయని డైరీ
ప్రతి మనిషీ జీవితంలో ఒక్కసారైనా తెలిసో తెలియకో జైల్లో పడేంత నేరం ఏదైనా చెయ్యాలి. అప్పుడు సరిగ్గా చెప్పగలడు మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిందని! జైల్లో ఇంకో రెండ్రోజులు ఎక్కువుంటే.. స్వాతంత్య్రం మనకు మిడ్‌నైట్ వచ్చిందని కూడా చెప్పగలడు. చెప్పకపోయినంత మాత్రాన దేశం మళ్లీ వెనక్కి పోయేదేం లేదు బ్రిటన్‌లోకి. మన దేశ చరిత్రలో ఆగస్టు పదిహేను అనేది ఒకటుందని, లేదా ఆగస్టు పదిహేనుతో మన దేశ భవిష్యత్తు మొదలైందనీ తెలిసి ఉండడం దేశభక్తితో సమానం. దేశభక్తి లేకుండా దేశంలో తిరుగుతుండడం తోటి పౌరులకు అసౌకర్యం కనుక.. అస్తమానం అసౌకర్యానికి చింతించడం కన్నా, ఒకసారి జైలుకు వెళ్లి రావడం సుఖం.
జైల్లో స్వాతంత్య్రం ఉండదు కాబట్టి, స్వాతంత్య్రం అంటే ఏమిటో తెలుస్తుంది. స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. స్వాతంత్య్రాన్ని ఎవరు తెచ్చారో తెలుస్తుంది. ఎవరు ఇచ్చి వెళ్లారో తెలుస్తుంది. ఇవికాక.. జైల్లో ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. రోజూ ఉదయాన్నే టైమ్‌కి లేవడం, టైమ్‌కి స్నానం చెయ్యడం, టైమ్‌కి తినడం, టైమ్‌కి పనిలో పడడం, టైమ్‌కి పనిలోంచి లేవడం, మళ్లీ టైమ్‌కి తినడం, టైమ్‌కి లైట్లు ఆపి పడుకోవడం.. అంతా టైమ్ ప్రకారమే నడుస్తుంది. టైమ్‌సెన్స్ అంటే ఏంటో తెలుస్తుంది. బయట స్వాతంత్య్రం ఉన్నప్పుడు ఇవేవీ టైమ్‌కి చెయ్యలేదని తెలుస్తుంది. టైమ్‌సెన్సే కాదు.. కనీసం కామన్‌సెన్సు, సివిక్‌సెన్సు కూడా లేకుండా గడిపామని తెలుస్తుంది.
ఇంకా.. ఆ జైలు ఏకాంతంలో, ఆ ధ్యాన మందిరంలో మన ఊపిరి మనం తీసుకోవడం వినిపిస్తుంది. మన మౌనం మనకు ప్రతిధ్వనిస్తుంది. లంచ్‌బ్రేక్‌లో ప్లేటు పట్టుకుని లైన్‌లో నిలబడ్డప్పుడు మనుషుల్ని మనుషులుగా గుర్తుపడతాం. మనుషుల్లో మనుషుల్లా కలసిపోతాం. సెల్‌లోకి వెళ్లి పడుకున్నాక సడెన్‌గా ఏ నడిరేయి నక్షత్రంలోనో మానవజన్మ ఎత్తుతాం. మనల్ని మనం వెతుక్కుని, మనల్ని మనం ఉతుక్కుని, మనల్ని మనం జాడించుకుని, మనల్ని మనం ఆరేసుకుని.. ఆరేంతవరకు దేహాన్ని జాముల గంటకు తగిలించుకుని, ఆ తర్వాత పొడి ఆత్మని తొడుక్కుంటాం. ఫ్రెష్ ఎయిర్. ఫ్రెష్ బ్రీత్. ఫ్రెష్ సోల్. మర్నాటికి మళ్లీ ఫ్రెష్ బాత్. ఫ్రెష్ బర్త్.
ఎరవాడ నుంచి వచ్చి మూడు రోజులైంది. వచ్చానా? విడుదలై వచ్చానా తెలియడం లేదు. బందిఖానా నుంచి వచ్చానా? బందిఖానాలోకి వచ్చానా తెలియడం లేదు. బాల్కనీలోంచి చూసినా, బయటికొచ్చి చూసినా ముంబై ఒకేలా ఉంది. ఉక్కిరిబిక్కిరి ఊపిరితిత్తిలా ఉంది. ఎరవాడ ఉన్నంత ఓపెన్‌గా లేదు! ఇరుకిరుగ్గా మనుషులు వస్తున్నారు, వె ళుతున్నారు, తోసుకుంటున్నారు, తొక్కుకుంటున్నారు. ఎక్కడా క్షణం నిలబడడం లేదు. ఎక్కడికీ చేరుతున్నట్లూ లేదు. పరుగులు మాత్రం అలలై పడుతూ లేస్తున్నాయి. బతుకుల జాతీయ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. ఒక్క మనిషినైనా ఆపి, సెల్యూట్ కొట్టి, గుండెల నిండా గాలి పీల్చుకుందామంటే ఛాతీ సరౌండింగ్స్‌లో అంగుళమైనా ఉప్పొంగేందుకు స్పేస్ లేదు!
- మాధవ్ శింగరాజు