
రాఖీ సావంత్ (బాలీవుడ్ నటి) రాయని డైరీ
మాధవ్ శింగరాజు
చెడులో ఎట్రాక్షన్ ఉంటుంది. మంచిలో మహాత్ముడు ఉంటాడు. మంచీచెడు కలసిన ఎట్రాక్షన్.. మోదీ మహాత్ముడు!
కానీ ఈ మాటను బీజేపీవాళ్లు ఒప్పుకోరు. ఎట్రాక్షన్‌ని మోదీలోంచి లాగేసి, మహాత్ముడి నొక్కడినే ఆయనలో చూడమని ఉపదేశిస్తారు! ఇదేం న్యాయం? మోదీ ఈ దేశ ప్రధాని. నేను ఈ దేశ పౌరురాలిని. ఆయన్ని ఎలా చూడాలని అనుకుంటానో అలా చూడడం నా హక్కు.
దేశం వెలిగిపోవాలంటే బ్యాగ్రౌండ్ బ్లాక్ కలర్‌లో ఉండాలి. మోదీ వెలిగిపోవాలంటే ఆయనకు బ్యాగ్రౌండ్‌గా బ్లాక్ డ్రెస్ ఏదైనా ఉండాలి. ప్రధాని ప్రజల్ని వెలిగించడం, ప్రజలు ప్రధానిని వెలిగించడం ఒక్క డెమోక్రసీలోనే సాధ్యం. దేశాన్ని వెలిగించడం కోసం మోదీ దేశాలు పట్టుకుని తిరుగుతున్నప్పుడు, మోదీని వెలిగించడం కోసం ఆయన ఫొటోలు అంటించుకున్న బ్లాక్ డ్రెస్ వేసుకుని నేనెందుకు తిరగకూడదు? ఆ మాత్రం దేశభక్తి నాకు ఉండదా? ఉండకూడదా?
ఎవరో నా మీద కేసు పెట్టారు.. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద నన్ను కఠినంగా శిక్షించాలట! ఇంతకన్నా ఎట్రాసిటీ ఆన్ ఉమెన్ ఉంటుందా? నచ్చిన డ్రస్‌ను వేసుకునే స్వేచ్ఛ, నచ్చిన డిజైన్‌ను ఎంపిక చేసుకునే స్వాతంత్య్రం భారతీయ స్త్రీకి లేదా? నేను భారతీయ స్త్రీని కాదా? ఇండియాలోనే కదా ఉన్నాం. అదీ మోదీ ఇండియాలో! ఎంత బ్రాడ్ లుక్ ఆయనది! ఆయన పేరు చెడగొట్టడానికి కాకపోతే నాపై ఏంటీ కేసులు ఇండీసెంట్‌గా!
డ్రస్ డిజైన్‌లంటే ఎప్పుడూ ఆ పూలు, పిందెలేనా? మోదీ ఎందుకు కాకూడదు? మోదీ ముఖచిత్రాలను ఇన్‌స్పైరింగ్‌గా నా బట్టల మీద నేనెందుకు ఉంచుకోకూడదు? ఈ దేశాన్నే ఆయన డిజైన్ చేస్తున్నప్పుడు, ఆయననే ఒక డిజైన్‌గా నేనెందుకు స్వీకరించకూడదు?!
మోదీకి తెలియకుండా నా మీద కేసు పెట్టి ఉంటారు. తెలిస్తే ఆయన ఊరుకోరు. తెలిసీ ఆయన ఊరుకున్నారంటే ఊరెళ్లో, టూరెళ్లో ఉండాలి. ఈమధ్యెక్కడో కెమెరాతో కనిపించారు... పులిని ఫొటో తీస్తూ! ఆయన్ని అలా చూస్తుంటే .. మనిషి పులిని ఫొటో తీస్తున్నట్టుగా లేదు. సింహం.. పులిని ఫొటో తీస్తున్నట్లుగా ఉంది. గ్రేట్ మ్యాన్. ఆ రాజసం ఎన్డీయేలో ఎవరికుంది?
మోదీ పులిలా ఉంటారు. సింహంలానూ ఉంటారు. అదే ఆయన ప్రత్యేకత. పులిలా ఉన్నప్పుడు సింహంలా గర్జిస్తారు. సింహంలా ఉన్నప్పుడు పులిలా గాండ్రిస్తారు. అది ఇంకో ప్రత్యేకత. ఈ రెండు ప్రత్యేకతలు లేకపోతే కాంగ్రెస్, కశ్మీర్ కలిసి ఏనాడో ఆయన ముందు తోకాడించేవి! అందుకే ఆయన నా డ్రీమ్ మ్యాన్.
మోదీజీ మళ్లీ చికాగో వచ్చినప్పుడో, నేను ఢిల్లీ వెళ్లినప్పుడో ఈసారి మోదీ ఫొటోలతో పాటు కొన్ని సింహాలు, కొన్ని పులులు ఉన్న డ్రెస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని ఆయనతో సెల్ఫీ దిగాలి.