
నాకింకా జైల్లోనే ఉన్నట్లుంది! జైల్లో నా గది పక్కనే పెద్దాయన గది.
‘‘ఎలా ఉన్నారు బాపూజీ’’ అన్నాను.. ఆయన దాల్–సబ్జీ తింటుంటే.. వెళ్లి పక్కనే కూర్చొని.
‘‘చల్లగా ఉండు సల్మాన్’’ అన్నారు బాపూజీ.
‘‘నాకీ జోథ్‌పూర్ ఎండలొక లెక్క కాదు బాపూజీ. ముందు మీరెలా ఉన్నారో చెప్పండి’’ అన్నాను.
‘‘నేనెలా ఉన్నా, నువ్వు చల్లగా ఉండాలి సల్మాన్’’ అన్నారు ఆయన. ఎందుకంత ఎమోషనల్ అయ్యారో అర్థం కాలేదు.
‘‘ఇన్నేళ్లుగా జైల్లో ఉంటున్నానా.. ఒక్కరూ నన్ను బాపూజీ అని పిలవలేదు సల్మాన్. చిన్నాపెద్దా లేకుండా అంతా ఆశారాం అన్నవాళ్లే’’ అన్నారు పెద్దాయన కళ్లు తుడుచుకుంటూ.
శుక్రవారం ప్రీతి, అల్విర, అర్పిత నన్ను చూడ్డానికి వచ్చారు. ‘‘ఎందుకు అంత దూరం నుంచి! ఈ అన్నయ్యను చూద్దామనేనా!’’ అన్నాను. అల్విర, అర్పిత దుఃఖం ఆపుకుంటున్నారు.
ప్రీతి అంది, ‘‘ఓయ్.. వర్కవుట్‌లు మానకు’’ అని! నవ్వాను. ఈ స్నేహితురాళ్లలో ఏదో ఉంటుంది మాయ! కొట్టి మాట్లాడతారు. దెబ్బలు నయమైపోతాయి. ఒంటికి తగిలినవీ, మనసుకు తగిలినవీ!
ముగ్గురూ వెళ్లిపోయాక జైల్ సూపరింటెండెంట్ వచ్చాడు.. ‘‘భాయ్.. ఏమైనా కావాలా?’’ అన్నాడు.
‘‘ఖైదీని భాయ్ అంటే మీ ఉద్యోగానికి ఏమీ ముప్పు కాదా మిస్టర్ విక్రమ్ సింగ్?’’ అని అడిగాను.. ఆయన యూనిఫారమ్ మీద ఉన్న విక్రమ్ సింగ్ అనే పేరును చూస్తూ.
‘‘అవుతుంది. అయితే నా ఉద్దేశంలో మీరిప్పుడు ఖైదీ పాత్రను పోషిస్తున్నారు. మిమ్మల్ని ఖైదీ పాత్రలో చూస్తున్న ప్రేక్షకుడిని నేను’’ అన్నాడు!
‘‘అయితే మీరిప్పుడు మీ సూపరింటెండెంట్ పాత్రను పోషించడం లేదా?’’ అని పెద్దగా నవ్వాను.
‘‘ప్రతి మనిషికీ పైకి ఒక పాత్ర ఉంటుంది, లోపల ఒక పాత్ర ఉంటుంది భాయ్. లోపలి పాత్ర అతడు ఇష్టపడి చేసే పాత్ర. పై పాత్ర ఎవరో ఇస్తే చేసే పాత్ర’’ అన్నాడు.
‘‘మీరు ఫిలాసఫీ చదువుకున్నారా విక్రమ్ సింగ్?’’ అన్నాను.
‘‘అంతకన్నా గొప్పవి.. మీ సినిమాలు.. వాటిని చూశాను భాయ్’’ అన్నాడు.
బులెట్ దింపాడు గుండెల్లో! కన్నీళ్లకు చెప్పాను బయటికొస్తే చంపేస్తానని.
మా ఇద్దరి మధ్యా ఊచలు అడ్డుగా లేవు. కానీ ఊచలు అడ్డుగా లేవని ౖజైలు అధికారిని హత్తుకోనిస్తుందా చట్టం?
లాయర్ రాగానే విక్రమ్ సింగ్ వెళ్లిపోయాడు.
‘‘సల్మాన్‌జీ మనకు బెయిల్ వచ్చింది!’’ అన్నాడు లాయర్.
‘‘వచ్చిన బెయిల్‌ని తిరస్కరించే హక్కు ఖైదీకి ఉంటుందా మహేశ్‌జీ?’’ అని అడిగాను.
‘అదేంటి సల్మాన్‌జీ!!’ అన్నట్లు చూశాడు.
‘‘ఊరికే.. అలా అనిపించింది’’ అన్నాను.
మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment