
మార్క్ జుకర్‌బర్గ్ రాయని డైరీ
‘మాక్స్’ కళ్లు తెరిచి చూస్తోంది! ‘సిల్లా’ కళ్లు మూసుకుని ఉన్నా, ముఖం మీది అలసట నవ్వుతో మాక్స్‌నే చూస్తున్నట్లుగా ఉంది..
‘మాక్స్’ కళ్లు తెరిచి చూస్తోంది! ‘సిల్లా’ కళ్లు మూసుకుని ఉన్నా, ముఖం మీది అలసట నవ్వుతో మాక్స్‌నే చూస్తున్నట్లుగా ఉంది. గత ఐదు రోజులుగా ఈ తల్లీబిడ్డల మధ్య ఎడతెరిపి లేకుండా ‘మాటలు’ సాగుతున్నాయి. మధ్యలోకి వెళ్లి ముద్దాడేందుకు ఇద్దరిలో ఒక్కరూ నాకు అవకాశం ఇవ్వడం లేదు. ఏం మాట్లాడుకుంటున్నారు? వట్టి చూపులతో! చప్పుడు కాని చిన్నపాటి నవ్వుతో మాటల్ని షేర్ చేసుకోవడంలో సిల్లా ఎక్స్‌పర్ట్. ఆ విద్యనే నేర్పుతోందా.. అప్పుడే తన కూతురికి!
‘బీస్ట్’ దూరం నుండి చూస్తోంది. ‘దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ జెంటిల్మన్’ అన్నట్లు చూస్తోంది! దగ్గరికి రావడం లేదు. ఈ హంగేరియన్ షీప్‌డాగ్‌కి మాక్స్ పుట్టినప్పటి నుంచీ క్షణంసేపైనా కాలు నిలవడం లేదు. మాక్స్‌తో స్నేహం కోసం తొందరపడుతోంది. ‘అప్పుడే కాదు’ అని తల నిమిరితే అలిగి వెళ్లి, నేలకు గొంతు ఆన్చి కూర్చుంటుంది. కూర్చుని, అలా కళ్లలోకి చూస్తూ ఉంటుంది.
మాక్స్ కంటే ముందు నా జీవితంలోకి వచ్చిన అపురూపం.. సిల్లా. పన్నెండేళ్ల క్రితం.. పార్టీలో డిన్నర్ అయ్యాక వాష్ రూమ్‌కి వెళ్లే క్యూలో తనని తొలిసారి చూశాను. ఇంకా ఇంకా చూస్తూనే ఉన్నాను. ‘ఏంటి?’ అన్నట్లు చూసింది సడెన్‌గా! నేనూ అలాగే చూశాను.. ‘ఏంటి?’ అని భుజాలు ఎగరేస్తూ! అబ్బాయిలను అర్థం చేసుకోడానికి అమ్మాయిలకు డిక్షనరీలు కావాలా? నవ్వుకుంది నా ఏంజెల్.
‘జ్యూక్.. ఏమిటాలోచిస్తున్నావ్..’ అంటోంది సిల్లా. ‘మాక్స్‌కి డాడీని ఎప్పుడు పరిచయం చేస్తావ్’ అని అడిగాను సిల్లా బుగ్గ పట్టి లాగుతూ. ‘నాకంటే ముందు నువ్వే కదా తనకు పరిచయం అయ్యావు జ్యూక్’ అంది సిల్లా నవ్వుతూ. ఆ స్మైల్‌లో యాభై శాతానికి పైగా షేర్లు జెలసీవే! నవ్వొచ్చింది. ‘లవ్యూ సిల్లా’ అన్నాను. ‘మొత్తం నాకేనా?’ అంటూ మళ్లీ నవ్వింది. ‘ఈక్వల్ ఈక్వల్.. మామ్‌కీ, బేబీకి’ అన్నాను. ‘మొత్తం తనకే ఇచ్చేయ్.. నాకేం అక్కర్లేదు’ అంది సిల్లా.. మూతి విరుపు ఎమోజితో. మాక్స్ ఏదో ధ్యాసలో ఉంది.
అల్ట్రాసౌండ్ స్క్రీన్‌లో మాక్స్ తన బొటనవేలు ఎత్తి నాకు ‘లైక్’ కొట్టినప్పుడే మా ఇద్దరి పరిచయం జరిగింది. క్లినిక్ నుంచి బయటికి వస్తూ ఆ సంగతి చెప్పినప్పుడు సిల్లా ఎమోషనల్‌గా బర్ట్స్ అయింది. మిస్‌క్యారేజ్ అయిన తొలి మూడు పరిచయాల గురించి తను ఆలోచిస్తోంది! ‘సిల్లా ప్లీజ్.. ఇది మామూలే’ అన్నాను. వినడం లేదు. చిన్న పిల్లలా ఏడుస్తోంది. ఎలా చెప్పడం?
‘నువ్వెంత బిజీగా ఉన్నా రోజులో కనీసం వంద నిమిషాలైనా నాతో ఉండాలి’.. పెళ్లికి ముందు సిల్లా పెట్టిన కండిషన్. ‘నువ్వొక్కదానివే ఎప్పుడూ బాధను దాచుకోవద్దు’.. పెళ్లయ్యాక నేను పెట్టిన కండిషన్. మాట్లాడుకోడానికి, మనసులో ఉన్నది చెప్పుకోడానికి ఈ కండిషన్లు. మాటలు లేకపోతే ప్రేమ వాడిపోతుంది. వాడిపోతున్న ప్రేమైనా మాటలు చిలకరిస్తూ ఉంటే వికసిస్తుంది.
- మాధవ్ శింగరాజు