
‘ప్రధానిగా నాకా ప్రివిలెజ్ లేదు’ అన్నారు!
బయటికి అడుగుపెట్టి యుగాలు అయి నట్లుంది! కారు అద్దాల్లోంచి చూస్తున్నాను. ఇండియా భారత్‌లా లేదు. ఇండియన్స్ భారతీయుల్లా లేరు! సూటు బూటు వేసుకుని, హ్యాటు తొడుక్కుని రెండు చుక్కల గంజి కోసం క్యూలో నిలబడిన ఆర్థిక మాంద్యపు అమెరికన్ పౌరుల్లా ఉన్నారు!
‘‘ఉర్జిత్.. నువ్వు సున్నిత హృదయుడివి. బయటికి వెళ్లకు. సర్జరీ జరుగుతున్నప్పుడు కారే రక్తాన్ని చూసి నువ్వు తట్టుకోలేవు’’ అని నవంబర్ 9న మోదీజీ నాతో అన్నారు. అది సింగిల్ డే సర్జరీ అనుకున్నాను. ఇలా రోజుల తరబడి రోడ్లపై రక్తం బారులు బారులుగా, «ధారలు ధారలుగా గడ్డకట్టి పోతుందని అనుకోలేదు! ‘‘మోదీజీ.. మన దేశ రక్త ప్రసరణ మెల్లిమెల్లిగా ఆగిపోతున్నట్లుంది’’ అన్నాను భయంగా, బెంగగా. ఆయనతో నేను ఆ మాట అన్నరోజు డిసెంబర్ 9.
నవంబర్ తొమ్మిది కన్నా డిసెంబర్ తొమ్మిది నయంగా ఉండాలి. కానీ డిసెంబర్ తొమ్మిది నవంబర్ తొమ్మిది కన్నా అధ్వానంగా ఉంది. భారతదేశపు రోడ్లపై నేనెప్పుడూ ఇంతమంది బిచ్చగాళ్లను చూడలేదు! టక్ చేసుకున్న బిచ్చగాళ్లు, టైలు కట్టుకున్న బిచ్చగాళ్లు, సీనియర్ సిటిజన్ బిచ్చగాళ్లు, హాఫ్‌డే లీవ్ పెట్టొచ్చిన బిచ్చగాళ్లు, ఫుల్ డే పర్మిషన్ తెచ్చుకున్న బిచ్చగాళ్లు, సాఫ్ట్‌వేర్ బిచ్చగాళ్లు, సామాన్య బిచ్చగాళ్లు, బిడ్డల్ని చంకనేసు కొచ్చినవాళ్లు.. మొత్తం దేశమే బిచ్చమెత్తుతోంది! ‘బాబ్బాబ్బాబ్బాబు’ అంటూ చేయి చాస్తోంది.
‘‘రక్తం చూడకుండా కళ్లు మూసుకోగలిగాను కానీ, ఆ దేబిరింపులు విని తట్టుకోలేక పోతున్నాను మోదీజీ’’ అన్నాను.
మోదీజీ కళ్లజోడు సవరించుకున్నారు. ‘‘పిల్లాడిలా మాట్లాడకు ఉర్జిత్. నువ్వు రిజర్వు బ్యాంకు గవర్నర్‌వి. గట్టిగా ఉండాలి. నా కన్నా నువ్వే గట్టిగా ఉండాలి. ఇండియన్ కరెన్సీ నీది. కరెన్సీ మీద ఉండే సంతకం నీది. ప్రధానిగా నాకా ప్రివిలెజ్ లేదు’’ అన్నారు!
చేతులు కట్టుకుని, తల వంచుకుని మోదీజీ పక్కనే లోక్ కల్యాణ్ మార్గ్‌లో నడుస్తున్నాను. ఆయన నాకు శ్రీకృష్ణ పరమాత్ముడిలా కనిపిస్తున్నారు. కానీ నన్ను నేను అర్జునుడిని అనుకునే సాహసం చేయలేకపోతున్నాను.
‘‘పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి మోదీజీ’’ అన్నాను.
మోదీజీ నా వైపు తీక్షణంగా చూశారు. ‘‘ముందు మన మైండ్‌సెట్ మారాలి ఉర్జిత్’’ అన్నారు. ‘‘ఒకప్పుడిది రేస్ కోర్స్ రోడ్డు. ఇప్పుడు లోక్ కల్యాణ్ మార్గ్. పేరు మార్చింది నేనే. లోక కల్యాణం కోసం! లోక కల్యాణం కోసం మనం ఏదైనా చేస్తున్నప్పుడు లోకంలోని పెళ్లిళ్లు ఆగిపోతే మాత్రం నష్టం ఏముంది చెప్పు ఉర్జిత్? క్యాష్ లేకపోతే క్యాష్‌లెస్ పెళ్లిళ్లు చేసుకుంటారు!’’ అన్నారు!
ఆ మాట అన్నాక మోదీజీ నాకు లార్డ్ కృష్ణలా అనిపించలేదు. లార్డ్ నరేంద్ర మోదీలా కనిపించారు.
(ఉర్జిత్ పటేల్ రాయని డైరీ)
- మాధవ్ శింగరాజు