
పుస్తకం ఫస్ట్ కాపీ కనిమొళికేనా!
నవంబర్‌లో బుక్ రిలీజ్ పెట్టుకున్నాను. ‘ఇన్ మై డిఫెన్స్’. మొదటి కాపీ ఎవరికి ఇవ్వాలో ఇంకా నిర్ణయించుకోలేదు. నాతో పాటు తీహార్ జైల్లో ఉండి వచ్చిన వాళ్లలో పొలిటీషియన్లు, బ్యూరోక్రాట్లు, ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. వాళ్లలో ఎవరైనా ఒకరికి ఇవ్వాలా? నేను జైల్లో పడడానికి కారణమైన గౌరవనీయులు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ గారికి ఇవ్వాలా? లేక కనిమొళి.. పాపం ఎంతైనా ఆడపిల్ల.. పిల్లల్ని చూడకుండా ఉండలేకపోతున్నానని బెయిల్ కోసం ఎంతగా ఏడ్చిందో... తనకు తొలి కాపీ ఇవ్వాలా?
‘ఇన్ మై డిఫెన్స్’.. నా జ్ఞాపకాల పుస్తకం. జైలు జ్ఞాపకాల పుస్తకం కాదు. నన్ను జైల్లో తోసినవాళ్లను నేను గుర్తుంచుకుంటాను కదా, అలా గుర్తుంచుకున్న వాళ్ల జ్ఞాపకాల పుస్తకం.
‘‘ఏంటయ్యా రాజా.. కొంప ముంచేలా ఉన్నావే..’’ అన్నారు మాజీ గౌరవనీయులు పి.చిదంబరం ఫోన్ చేసి. నేను జైల్లో పడక ముందు, పడ్డాక కూడా ఆయనే హోమ్ మినిస్టర్. ఆయన్దీ తమిళనాడే. నాదీ తమిళనాడే. ఆ విషయం ఆయనకు గుర్తులేనట్టుంది. నాకు గుర్తుంది.
మునగని కొంపలేవో ఇంకా మిగిలే ఉన్నాయని పి.చిదంబరం భావిస్తున్నట్లుగా ఉంది! ‘‘ముంచకుండా... కాంగ్రెస్ ఏ కొంపనైనా మిగిల్చే ఉంచుతుందని ఈ డెబ్బయ్ ఏళ్ల వయసులోనూ మీరు విశ్వసిస్తున్నారా తిరు ఆనరబుల్ చిదంబరం సార్’’ అన్నాను.
‘‘ఎందుకయ్యా ఈ పుస్తకాలు! మొదలుపెట్టి నప్పటి నుంచీ ఎవరో ఒకరి మీద రాయాలని నాలుక పీకుతుంటుంది. వదిలెయ్ ఈ పాడు లోకాన్ని.. దాని కర్మకు దాన్ని’’ అన్నారు చిదంబరం.
‘‘వదలడానికి నేనేం ఈ లోకాన్ని పట్టుకుని కూర్చోలేదు తిరు ఆనరబుల్ చిదంబరం సార్. ఈ లోకమే నన్ను పట్టుకుని జైల్లో పడేసింది’’ అన్నాను. ‘‘బాగా కోపంగా ఉన్నట్లున్నావ్ ఈ లోకం మీద’’ అన్నారు చిదంబరం. ఆయన అంటున్న లోకం, ఆయన ఉంటున్న లోకం రెండూ ఒకటే. కాంగ్రెస్ పార్టీ. అందులో డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఒక్కరే లేరు. పి.చిదంబరం ఒక్కరే లేరు. చిదంబరం కొడుకు కార్తీ కూడా ఉన్నాడు. అందుకే ఈ పాడు లోకం మీద ఆయనకంత ప్రేమ!
‘‘అది కాదయ్యా రాజా... మా వాడి పేరు లేకుండా నీ పుస్తకం కంప్లీట్ కాదా’’ అన్నారు పి.చిదంబరం. ‘‘ఏం చెయ్యమంటారు? మీ వాడు నా జ్ఞాపకాల్లో ఉన్నాడు మరి!’’ అన్నాను. తండ్రి హృదయం తల్లడిల్లి ఉంటుంది.
‘‘సునీల్ మిట్టల్‌ని మొదట మావాడే మీ ఇంటికి తీసుకొచ్చాడని రాశావట! అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌కి మా వాడి అవసరం ఉంటుందా చెప్పు.. నిన్ను కలవడానికి..’’ అంటున్నారు పి.చిదంబరం.
కొడుక్కి ఉన్న సైడ్ ఇండస్ట్రీల గురించి తిరు ఆనరబుల్ చిదంబరం సార్‌కి తెలియనట్లుంది! నా పుస్తకం ఫస్ట్ కాపీని ఆయనకే ఇవ్వాలి.
- మాధవ్ శింగరాజు