మీరా కుమార్ రాయని డైరీ
రేపే ఎన్నికలు! ఇంకా కొన్నాళ్లు ప్రచారం చేసుకునే టైమ్ ఉంటే ఎంత బాగుండేది! ‘మీ అమూల్యమైన ఓటు నాకే వేసి గెలిపించండి’ అని.. ఈ డెబ్బై రెండేళ్ల వయసులోనూ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరుగుతూ అడగడంలో.. తెలియని ఉత్సాహం ఏదో ఉంది. అప్పటికీ అంతా రామ్‌నాథ్ కోవింద్ గెలుస్తాడనే అంటున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలంతా ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తే ఆయన ఎలా గెలుస్తాడో నాకైతే అర్థం కావడం లేదు!
ఓటు వేసేవాళ్లందరికీ విడివిడిగా ఒక ఆత్మ ఉన్నట్లే, ‘మన క్యాండిడేట్‌కే ఓటేయాలి’ అని చెప్పే పార్టీపెద్దకి ఉమ్మడిగా ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మ ప్రబోధానుసారం కాకుండా, ఆ ఉమ్మడి ఆత్మ ప్రబోధానుసారం ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటేస్తే తప్ప రామ్‌నాథ్ కోవింద్ గెలిచే అవకాశాల్లేవు.
‘‘కానీ మీరాజీ.. ఆత్మలు, ఉమ్మడి ఆత్మలు రూలింగ్ పార్టీకేనా? మన అపోజిషన్ పార్టీకి ఉండవా?’’ అని బిహార్‌లో నాతో పాటు క్యాంపెయిన్‌కి వచ్చిన అశోక్ చౌదరికి సందేహం వచ్చింది. ఆశ్చర్యపోయాను. ఒక స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కి రావలసిన సందేహమేనా అది!
‘‘పవర్‌లో లేనివాళ్లకు విడివిడి ఆత్మలు ఉండడం ఎక్కడైనా చూశావా అశోక్. జీవాత్మలన్నీ వెళ్లి పరమాత్మలో కలిసినట్లు.. పవర్ పోగానే పార్టీలోని ఆత్మలన్నీ వెళ్లి పార్టీపెద్ద ఆత్మలో కలిసిపోతాయి. అప్పుడు ఉమ్మడి ఆత్మ ఒక్కటే ఉంటుంది’’ అని నవ్వాను.
‘‘మీ నవ్వు బాగుంటుంది మీరాజీ..’’ అన్నాడు అశోక్. అవునా అన్నట్లు చూశాను.
‘‘అవును మీరాజీ.. లోక్‌సభ స్పీకర్ ఎవరూ నవ్వుతుండగా నేను చూడలేదు. కానీ మీరు నవ్వడం చూశాను. మీ ముఖంలో నవ్వు కనిపించదు మీరాజీ.. మీ నవ్వులో ముఖం కనిపిస్తుంది. అదీ మీ స్పెషాలిటీ’’ అన్నాడు అశోక్.
మొన్న మాయావతి ఇంటికెళ్లినప్పుడు తను కూడా ఇలాగే అంది.. ‘మీరాజీ.. మీకన్నా ముందు మీ నవ్వే మా ఇంట్లోకి ప్రవేశించింది’’ అని!
‘‘అయితే బెహెన్‌జీ.. రాష్ట్రపతి భవన్‌లోకి కూడా నా నవ్వు ప్రవేశించాలని మీరు కోరుకుంటున్నట్లేగా’’ అన్నాను నవ్వుతూ.
అక్కడి నుంచి అఖిలేశ్ పార్టీ ఆఫీస్‌కి వెళ్లాను.
‘‘మేడమ్‌జీ రండి’’ అన్నారు అబ్బాయ్ అఖిలేశ్, బాబాయ్ శివపాల్.
సంతోషం వేసింది.
‘‘మేడమ్‌జీ.. క్రాస్ ఓటింగ్ జరిగేలా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండాలి’’ అన్నాడు అఖిలేశ్. ‘అవును మేడమ్‌జీ’ అన్నట్లు చూశాడు శివపాల్.
నవ్వాను.
బిహార్‌లో పుట్టానని చెప్పి బిహార్ ముఖ్యమంత్రి నాకేమైనా ఓటు వేస్తున్నాడా? ఇదీ అంతే. కాంగ్రెస్ క్యాండిడేట్‌నని చెప్పి క్రాస్ ఓటింగ్ జరక్కుండా ఉంటుందా?!
ఆత్మలు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో చెప్పలేం!
- మాధవ్ శింగరాజు