
మమతా బెనర్జీ రాయని డైరీ
రాజకీయాల్లో సంకేతాలు వెళ్లడం తేలిక. నవ్వు, పువ్వు కూడా ఇక్కడ రాజకీయ సంకేతాలు అయిపోతాయి. నవ్వని మనిషి నవ్వడం ఒక సంకేతం. నచ్చని మనిషి పక్కన నడవడం ఒక సంకేతం. ఈ నవ్వులు, నడకలు నిజంగా మనవే కానక్కర్లేదు. మన పక్కవాళ్లవి కూడా అయి ఉండొచ్చు. ఎవరివి అన్న దానితో నిమిత్తం లేదు. ఎవరు అనుకున్నారు అనే దాన్ని బట్టి మన గురించి ఒక సంకేతం వెళ్లిపోతుంది. మార్క్సిస్టులు అనుకుంటే ఒకలా వెళుతుంది. పొలిటికల్ ఎగ్జార్సిస్ట్‌లమని చెప్పుకునేవారు అనుకుంటే ఒకలా వెళుతుంది. రాజకీయ సంకేతానికి ఉన్న గుణమే అది. దాన్ని ఎవరూ ఇవ్వనవసరం లేదు. దానంతట అదే వెళ్లిపోతుంది!
పుష్పగుచ్ఛంతో మొన్న సోనియాజీ ఇంటికి వెళ్లి వచ్చాను. బద్ధశత్రువుకు బర్త్‌డే విషెస్ ఏంటని మార్క్సిస్టులు! ఇది దేనికి సంకేతమోనని అంతా రోడిన్ మ్యూజియంలో ‘థింకర్’ విగ్రహంలా కూర్చుండిపోయారు. దీర్ఘకాలం పదవిలో ఉన్న మార్క్సిస్టు యోధులు ఇంత దీర్ఘంగా ప్రజలకోసం ఒక్కరోజైనా కూర్చొని ఆలోచించి ఉంటారా?! మార్క్సిస్టులకు అమెరికా నచ్చదని చెప్పి నాకూ నచ్చకుండా పోతుందా? మార్క్సిస్టులకు అప్పుడప్పుడూ కాంగ్రెస్ కూడా నచ్చకుండా పోవచ్చని ఊహించి, నేను టెన్ జన్‌పథ్‌కు వెళ్లడం మానుకుంటానా?! కాంగ్రెస్ నాకేమీ బద్ధ శత్రువు కాదు. అది నా బర్త్ ప్లేస్. తృణమూల్ కాంగ్రెస్‌కి తాతగారిల్లు.
‘మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే మీ ఇంటికి రావడం సోనియాజీ’ అన్నాను బొకేని చేతికి అందిస్తూ. ‘అవునా?’ అన్నారు మేడమ్ నన్ను ఆప్యాయంగా స్పృశిస్తూ. ‘బాగా చిక్కిపోయారు’ అన్నాను. ‘కాంగ్రెస్ పార్టీ కన్నానా’ అన్నట్లు నవ్వారు. ఆ నవ్వులో నాకు బెంగ కనిపించింది. అంత బెంగలోనూ ‘బెంగాల్ ఎలా ఉంది మమతా’ అన్నారు. ‘మా మాటీ మనుష్’ అని నవ్వాను. అంతవరకే మేం మాట్లాడుకుంది. వెంటనే సోమ్‌నాథ్ చటర్జీ నా గురించి కాంపెయిన్ మొదలుపెట్టేశారు! వచ్చే ఎలక్షన్స్‌లో కాంగ్రెస్, సీపీఎం కలవకుండా ఉండేందుకు బొకేలు పట్టుకుని నేను ఆ గడపా ఈ గడపా తిరుగుతున్నానట!
అక్టోబర్‌లో సోనియాజీకి దీపావళి శుభాకాంక్షలు పంపిందీ, ఆగస్టులో పార్లమెంటు సెంట్రల్ హాల్లో మేడమ్‌ని హగ్ చేసుకుందీ, నిన్న నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాజీకి నేను సపోర్ట్ చేసిందీ ఇందుకేనట! బయటికి గెంటేసినా తానింకా సీపీఎంకి విధేయుడిగానే ఉన్నాననే సంకేతాన్ని పంపుకోడానికి చటర్జీ నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు. కేజ్రీవాల్‌ని కూడా రెండు రోజుల క్రితం పార్లమెంటు హౌస్‌లో పలకరించాను. ఇద్దరం కలిసి కాసేపు వరండాలో తిరిగాం. 294 సీట్లలో అతడికి నేను ఇచ్చేది ఒక్కటీ లేదు. అతడు తీసుకునేదీ ఒక్కటీ లేదు. ఇవ్వని, తీసుకోని సీట్లతో కూడా సర్దుబాటు సంకేతాలు ఇవ్వగల సమర్థులు బెంగాల్ మార్క్సిస్టులు!
- మాధవ్ శింగరాజు