
హిల్లరీ క్లింటన్ (అధ్యక్ష అభ్యర్థి) రాయని డైరీ
మాధవ్ శింగరాజు
‘‘చూస్తున్నాను’’ అన్నారు డొనాల్డ్ ట్రంప్ ఉదయాన్నే ఫోన్ చేసి. ఎంబారసింగ్! ‘అప్పుడే ఏం చూశారూ...’ అనబోయి, ‘‘గుడ్‌మాణింగ్ మిస్టర్ ట్రంప్.. ఏమిటి ఇంత పొద్దున్నే!’’ అన్నాను. ‘‘యా.. యా.. గుడ్‌మాణింగ్ మిసెస్ క్లింటన్. యాక్సెప్టెన్స్ స్పీచ్‌లో మీ మాటలు విన్నప్పటి నుంచీ నేను అమెరికాను ప్రేమించడం మొదలుపెట్టేశాను తెలుసా’’ అన్నారు ట్రంప్. డిజ్‌గస్టింగ్! ఆహ్లాదకరమైన నా న్యూయార్క్ ఉదయాన్ని పాడు చేయడానికి ఇదే న్యూయార్క్‌లో మరోవైపున పనిగట్టుకుని నిద్రలేచాడా ఏంటి.. ఈ ట్రంప్ మహాశయుడు!
‘‘కమ్ అగైన్’’ అన్నాను విసుగ్గా. పెద్దగా నవ్వాడు ట్రంప్. ‘‘మీ డ్రీమ్ బాగుంది’’ అన్నాడు! ‘‘ఇప్పుడేగా తెల్లారింది. అప్పుడే నాకొచ్చిన కల ఏమిటో మీకు తెలిసిపోయిందా మిస్టర్ ట్రంప్. లేక... నా కలనే మీరు కూడా నాతో పాటు ప్యారలల్‌గా కంటూ ఉన్నారా?’’ అన్నాను. మళ్లీ పెద్దగా నవ్వాడు ట్రంప్. ‘‘నిద్రలో మీరు కంటున్న కలల గురించి కాదు మిసెస్ క్లింటన్... నేను మాట్లాడుతున్నది. అమెరికన్ ప్రజల్ని నిద్రపుచ్చడానికి రోజూ కాంపెయిన్‌లలో మీరు వినిపిస్తున్న మీ పగటి కలల గురించి’’ అన్నాడు.
‘‘మిస్టర్ ట్రంప్.. నాకివాళ చాలా పనులున్నాయి’’ అన్నాను. ‘‘చాలా పనులు అనకండి మిసెస్ క్లింటన్. చాలా కలలు అనండి’’ అని మళ్లీ పెద్దగా నవ్వాడు ట్రంప్. ‘‘ఫోన్ మీరు పెట్టేస్తారా? నన్ను పెట్టేయమంటారా?’’ అని అడిగాను. ‘‘అర్థం కాలేదు మిసెస్ క్లింటన్’’ అన్నాడు! ‘‘క్లింటన్స్ హోమ్‌లో మాణింగ్ అన్నది కొన్ని కనీస మర్యాదలతో మొదలవుతుంది మిస్టర్ ట్రంప్. అందుకే అడుగుతున్నాను.. ఫోన్ మీరు పెట్టేస్తారా? నేను పెట్టేయనా?’’.
మళ్లీ పెద్దగా నవ్వాడు ట్రంప్!
‘‘ఈ ఉషోదయ క్షణాలలో మీ అర్థవంతమైన నవ్వును ఆస్వాదించే స్థితిలోకి నేను సిద్ధం కాలేకపోతున్నందుకు గొప్ప సహృదయంతో మీరు నన్ను క్షమించగలరా మిస్టర్ ట్రంప్’’ అని వేడుకున్నాను. ట్రంప్ వదలడం లేదు!
‘‘క్లింటన్స్‌కి ఒక రకంగా, ఒబామాలకు ఒక రకంగా; డెమోక్రాట్‌లకు ఒక రకంగా, రిపబ్లికన్‌లకు ఒక రకంగా; వైట్‌హౌస్‌కి ఒక రకంగా, బాల్టిమోర్, చికాగోలకు ఒక రకంగా... రోజు మొదలవకూడదు మిసెస్ క్లింటన్. అమెరికా మొత్తానికీ ఒకే విధమైన మాణింగ్ ఉండాలి’’ అంటున్నాడు ట్రంప్.
‘‘తప్పకుండా ఉంటుంది మిస్టర్ ట్రంప్.. మీరిలా ఉదయాన్నే ఫోన్‌లు చేసి... అమెరికన్‌లకున్న ‘ఆవలిస్తూ లేచే స్వేచ్ఛ’ను హరించకుండా ఉంటే గనుక... అందరికీ ఒకే విధమైన మాణింగ్ ఉంటుంది’’ అని అన్నాను. మళ్లీ పెద్దగా నవ్వాడు ట్రంప్.
జీసెస్! ఇంతకీ ఈ మనిషి ఎందుకు ఫోన్ చేసినట్టు? పెద్దగా నవ్వడానికా! నేనూ నవ్వగలనని చెప్పడానికా!! చిన్న ట్వీట్‌కే కోపం తెచ్చుకునే ట్రంప్.. నవ్వడం బాగానే ప్రాక్టీస్ చేస్తున్నట్లున్నాడు!