పొమ్మనక ముందే వచ్చేయాలి. రమ్మనక ముందే వెళ్లిపోవాలి. అదే గౌరవం.
గౌరవనీయులు మనల్ని గౌరవించేందుకు ఇబ్బంది పడుతున్నప్పుడు మన మెడలోని కండువా తీసి మడతపెట్టి ఇచ్చేసి, మనం వచ్చేయాలి.
గౌరవాన్ని కోరుకున్న చోటనైనా, గౌరవాన్ని కండువాలా లాగేసుకుని మెడ చుట్టూ వేసుకో కూడదు. గౌరవాన్ని మెడ చుట్టూ వేసే అవకాశాన్ని గౌరవనీయులకు మనమే కల్పించాలి.
ఇరవై ఏళ్లు కలిసి పని చేశాం నేను, మమతాజీ. జనవరి 1 వస్తే సరిగ్గా ఇరవై ఏళ్లవుతాయి తృణమూల్ పార్టీకి. మమతాజీ.. తట్టలో ఇటుకలు పేర్చి పెడితే, ఆ ఇటుకల తట్టను తలపై మోశాను నేను. ఇటుకలు మోసినప్పటి గౌరవం, ఇప్పుడు స్కాములు మోస్తున్నప్పుడు లేదు. ‘‘స్కాములు లేకపోతే ప్రజలకు స్కీములెలా పెడతాం మమతాజీ’’ అన్నాను. ఆమె మౌనంగా ఉండిపోయారు. సీబీఐ వాళ్లొచ్చి నా గురించి అడిగినా అదే మౌనం. నాపై ఎఫ్.ఐ.ఆర్. రాసినా అదే మౌనం!
పొమ్మనకుండానే పార్టీ నుంచి బయటికి వచ్చేసి నన్ను నేను గౌరవించుకున్నానని బీజేపీ వాళ్లు అంటున్నారు కానీ, అది నన్ను నేను గౌరవించు కోవడం కాదు. మమతాజీని గౌరవించడం.
‘‘బీజేపీలో చేరాక కూడా మీరు మీ మమతాజీని ఇలాగే గౌరవిస్తూ ఉంటారా ఏంటీ?’’ అని అమిత్‌షా అడిగారు నన్ను, నేనింకా బీజేపీలో చేరకముందే! నాకు అర్థమైంది. నన్ను గౌరవించడానికి అమిత్‌షా త్వరపడుతున్నారని! ఎవరైనా తొందరపడుతున్న ప్పుడు మనం ఆలస్యం చెయ్యడం గౌరవం కాదు.
వెంటనే ఢిల్లీ వెళ్లాను. బాగా చలిగా ఉంది. ‘‘కప్పుకోడానికి ఏమైనా ఉందా?’’ అని బీజేపీ ఆఫీస్‌లో అడిగాను. ‘‘తయారౌతోంది’’ అన్నారు! ‘‘ఏం తయారౌతోంది?’’ అన్నాను. ‘‘మీకోసం గొర్రె ఊలుతో స్పెషల్‌గా కండువా చేస్తున్నారు. మెడలో వేసుకుని చెవులు కప్పుకుంటే చాలు, చలిలో కూడా చెమటలు పోసేస్తాయి’’ అన్నారు!
వార్మ్ వెల్‌కమ్ అన్నమాట!
తెల్లారగానే.. లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్, బీజేపీ జనరల్ సెక్రెటరీ కైలాష్ విజయ్‌వర్గీయ.. ఇద్దరూ కలిసి నా భుజాల చుట్టూ కండువా వేశారు. ‘‘అమిత్‌షా రాలేదా?’’ అని అడిగాను. ‘‘ఈ కండువా ఆయన పంపిందే’’ అన్నారు.
‘‘ఆయన ఎక్కడికి వెళ్లారు?’’ అని అడిగాను.
‘‘ఎవరికైనా, పార్టీలో చేరేముందు మాత్రమే అమిత్‌షా కనిపిస్తారు. చేరుతున్నప్పుడు, చేరిపోయాక కనిపించరు’’ అన్నారు.
‘‘మరి ఎవరికి కనిపిస్తారు?’’ అని అడిగాను.
‘‘బీజేపీ ఏ స్టేట్‌లో అయితే పవర్‌లో లేదో ఆ స్టేట్‌లో రూలింగ్ పార్టీల లీడర్‌లకు కనిపించే పనిలో ఉంటారు’’ అన్నారు స్వపన్‌దాస్ గుప్తా! సీనియర్ జర్నలిస్టు ఆయన.
బీజేపీ వింతగా ఉంటుంది. పార్టీలో లేని స్వపన్‌దాస్ లాంటివాళ్లు పార్టీ లోపల కనిపిస్తుంటారు. పార్టీలో ఉన్న అమిత్‌షాలు పార్టీ బయట తిరుగుతుంటారు!
వ్యాసకర్త
---- మాధవ్ శింగరాజు
ముకుల్ రాయ్ (బీజేపీ) రాయని డైరీ
Published Sun, Nov 5 2017 1:59 AM | Last Updated on Sun, Nov 5 2017 1:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment