
ఓం పురి (బాలీవుడ్ నటుడు) రాయని డైరీ
మనాలిలో దిగాం. ‘దిగాం’ కాదు, ‘ఎక్కాం’! గొప్ప ఔన్నత్యంతో ఉంటుంది మనాలి ఎప్పుడూ. ఫ్లయిట్‌లోంచి కిందికి దిగినా, మనాలిలో అది పైకి ఎక్కడమే. ఫ్లైట్‌లు, హైట్‌లు అన్నీ మనాలి పాదాల దగ్గర ఒత్తిగిలాల్సిందే. మనిషి చేసే ఈ స్కీయింగ్, ట్రెక్కింగ్, గ్లైడింగ్, రాఫ్టింగ్.. అన్నీ పిల్లాటల్లా కనిపిస్తాయేమో మనాలికి!
‘ట్యూబ్‌లైట్’ షూటింగ్‌కి వచ్చాం. దేశభక్తి చిత్రం. ఇండో చైనా వార్ అండ్ లవ్ మూవీ. పూర్తవొచ్చింది. కబీర్‌ఖాన్, సల్మాన్, మిగతా ఆర్టిస్టులు చాయ్ తాగుతూ డిబేట్‌లో పడిపోయారు. కశ్మీర్... క్రికెట్.. కరణ్‌జోహార్. ఏ దిల్ హై ముష్కిల్! ఏ టాపిక్ మీదైనా డిబేట్ జరగొచ్చు. డిబేట్ మాత్రం టాపిక్ కాకూడదు.
డిబేట్‌ను వదిలేసి చాయ్ గ్లాసు పట్టుకుని కూర్చున్నాను. డిబేట్‌లలో కూర్చున్నప్పుడు చాయ్ తాగుతున్నంత సుఖంగా ఏమీ ఉండదు. మనది కాని మాట మన నోట్లోంచి వచ్చేస్తుంది! దేవుడా. అది మనం అనుకున్న మాట అయుండదు. మనం అనాలనుకున్న మాట కూడా అయుండదు. అయినా అనేస్తాం. ఎవరి కడుపులోనిదో మన నోట్లోంచి రావడం ఎంత దరిద్రం!!
మొన్న నా బర్త్‌డేకి ఎటావా వెళ్లినప్పుడు బల్బీర్ యాదవ్‌తో ఇదేమాట అన్నాను. ‘దరిద్రం నా నెత్తికెక్కింది. మీ పాదాల దగ్గర నాకు నేను చితిపేర్చుకుని దగ్ధమై పోవడానికి వచ్చాను’ అన్నాను. ‘పుట్టిన రోజు అదేం మాట’ అన్నారు బల్బీర్ పెద్ద మనసుతో నన్ను దగ్గరకు తీసుకుంటూ! దూరంగా జరిగాను. ఆయన నన్ను హత్తుకోబోయారు. ఆ చేతుల్లో ఒత్తిగిలే అర్హతే నాకు లేదు. మనాలి కన్నా ఉన్నతుడిలా ఉన్నాడాయన. చేతులు జోడించాను.
ఆయన కొడుకు సైనికుడు. అమర వీరుడు. సరిహద్దు కాల్పుల్లో అతడు చనిపోయినప్పుడు, టీవీలో నేను అన్న మాటకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆ కుటుంబాన్ని వెతుక్కుంటూ ఎటావా వెళ్లాను. ఎంత అశుద్ధం నా నోట్లోంచి! ‘ఆర్మీలో చేరమని వారినెవరు బలవంతం చేశారు?’ అన్నాను. నిజానికి నా ఉద్దేశం అది కాదు. ఇంకొకటేదో! ఆ ఇంకొకటి సైనికులను తక్కువ చేసేది కాదని మాత్రం చెప్పగలను. నా మనసులో ప్రతి సైనికుడి మీద గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఒక గౌరవ వందనంలా డిబేట్‌లో వినిపించలేక పోయాను.
మా నాన్న సైనికుడు. నేనూ ఒకప్పుడు సైన్యంలో చేరాలని తపించినవాడినే. కానీ నా మాట మిస్‌ఫైర్ అయింది. అది మా నాన్నను అవమానించినట్టు. నా దేశాన్ని అవమానించినట్టు. ఇంకో దేశం అయితే నన్ను ఉరితీసి ఉండేది. ఆ అమర వీరుడి ఫొటో ముందు తలబద్దలు కొట్టుకుంటున్నాను.
‘జీ ఆప్ ఠీక్ హో’ అన్నారు సల్మాన్ నా దగ్గరికొచ్చి. ‘ఏక్ దమ్ ఠీక్ హు సల్మాన్‌జీ’ అన్నాను. ‘ఎక్కడికో వెళ్లిపోయారు’ అంటున్నాడు నవ్వుతూ. వెళ్లిపోలేదు. ఉండిపోయాను.. ఎటావాలో. నా కొత్త బర్త్ ప్లేస్ అది.
-మాధవ్ శింగరాజు