
'నమ్మించి చేసిన ద్రోహమే నయం'
ఆజమ్‌ఖాన్, నేనూ.. ఇద్దరమే ఉన్నాం! ఇద్దరు బద్ధ విరోధులకు కొవ్వొత్తుల కాంతిలో సమాజ్‌వాదీ పార్టీ ఏర్పాటు చేసిన స్నేహపూర్వకమైన డిన్నర్ మీట్ అది. ఒక్క డిష్ కూడా కదలడం లేదు. తనకు మింగుడు పడని ఒక విషయాన్ని నాతో చర్చించడానికి ఆజమ్ ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఆయనతో నాకు మితిమీరిన శత్రుత్వమేమీ లేదని ఆయనకూ తెలుసు. అలాగని నాతో స్నేహానికి ఆయనేం ఉవ్విళ్లూరడం లేదన్న సంగతి ఆయన ముఖంలో అస్థిమితంగా కదులుతున్న నీడలను బట్టి నాకూ తెలుస్తూనే ఉంది.
‘‘పెద్దాయన నిన్ను రాజ్యసభకు అడుగుతున్నారు’’ అన్నారు ఆజమ్. ‘‘మరి.. మీకు ఇష్టమేనా ఆజమ్‌జీ.. నేను మళ్లీ పార్టీలోకి రావడం?’’ అన్నాను నవ్వుతూ. ఆజమ్ ఇంకా పెద్దగా నవ్వారు. అది రాని నవ్వు. ‘‘నీ విషయంలో ఒక కేబినెట్ మినిస్టర్‌గా నేను గానీ, పార్టీ జనరల్ సెక్రెటరీగా రామ్ గోపాల్ యాదవ్ గానీ సర్దుకుపోవలసిన అవసరం ఎంతైనా ఉందని ములాయంజీ గట్టిగా నమ్ముతున్నట్లున్నారు’’ అన్నారు ఆజమ్.
‘‘ఎంతైనా అంటే?’’ అన్నాను. ఆజమ్ చికాగ్గా ముక్కు విరిచారు. ‘‘ఎన్నికలొస్తున్నాయి. పార్టీకి ఫండ్స్ కావాలి. క్రౌడ్ పుల్లర్స్ కావాలి. అన్నిటికన్నా ముఖ్యం.. రాజ్‌నాథ్ సింగ్ లాంటి ఒక బలిష్టుడైన ఠాకూర్‌కి చెక్ పెట్టడం ఇంకో ఠాకూర్ వల్లనే అవుతుంది. ఇవన్నీ నువ్వు మాత్రమే చెయ్యగలవని నా చేత చెప్పించడానికి ఎందుకింత ఉత్సాహపడుతున్నావు అమర్’’ అన్నారు. ఆయనకు నా ప్రశ్న అర్థమైనట్టు లేదు! అవసరాలకు అతీతమైన స్నేహం పెద్దాయనలో గానీ, పార్టీ పెద్దల్లో గానీ ఏ కాస్తయినా మిగిలి ఉందా అన్నది తెలుసుకోవాలని నా ఆరాటం.
పార్టీ నుంచి బయటకి వచ్చిన ఈ ఆరేళ్లలో నన్నొక్కరూ.. ‘స్నేహితుడా’ అని హత్తుకోలేదు. నాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన సంగతి, నా పేగుల్లోని కొంత భాగానికి డాక్టర్లు అనవసరంగా కోత పెట్టిన సంగతి, నేను అతి కొద్దిగా మాత్రమే తినగలనన్న సంగతి, ఆ కొద్దిగానైనా ఒంటికి పట్టడానికి బలమైన మందులు వాడుతున్నానన్న సంగతి తెలుసుకోలేనంత సమీపానికి మాత్రమే ఇప్పటికీ నా పూర్వపు సన్నిహితులు రాగలుగుతున్నారు! దుబాయ్ ప్రయాణంలో ఓసారి నా షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా డౌన్ అయి, ఫ్లైట్‌లోనే కోమాలోకి వెళ్లిపోయాను. ‘ఇక బయటికి రాడు’ అన్నారట డాక్టర్లు. కానీ వచ్చాను. దేవుడికి కూడా నేను తనకి దగ్గరవడం ఇష్టం లేనట్లుంది! ములాయంజీని దేవుడికంటే గొప్పవాడు అనుకోవాలి. వద్దనుకున్న మనిషిని.. మళ్లీ వస్తే బాగుండని అనుకుంటున్నాడు కదా! అందుకు.
ఏమైనా.. పెద్ద పెద్ద స్నేహాలు, పెద్ద పెద్ద పొజిషన్‌లు అశాంతికి లోను చేస్తాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నమ్మకస్నేహాలను తట్టుకోలేక ఎప్పుడో కుప్పకూలిపోతాం. నమ్మించి చేసిన స్నేహం కన్నా, నమ్మించి చేసిన ద్రోహమే నయం అనిపిస్తుంది. అమితాబ్‌లు, ఆజమ్‌ఖాన్‌ల కన్నా... దాదర్‌లో పాన్‌వాలాతోనో, చౌపాటీలో భేల్‌వాలాతోనో స్నేహం ఆహ్లాదాన్నిస్తుంది. ఆరోగ్యానిస్తుంది.
- మాధవ్ శింగరాజు