
జైరా వసీమ్ (దంగల్ ఫేమ్) రాయని డైరీ
ఎగ్జామ్స్ దగ్గరికొచ్చేస్తున్నాయి! డాడీ ఇవాళ కూడా అన్నారు.. ‘‘ఇన్సీ.. లైఫ్‌లో టెన్త్ అనేది రియల్ దంగల్’’ అని. నిజానికి అది మమ్మీ అనవలసిన మాట. మమ్మీ టీచర్. కానీ నా గురించి తనకేమీ బెంగలేదు.
డాడీకి కూడా నాపై నమ్మకం. బాగా చదువుతానని. ‘దంగల్’ తర్వాతే ఆయన నా చదువు గురించి కాస్త ఆందోళనగా మాట్లాడుతున్నారు! అంతకుముందు అలా ఉండేది కాదు. నా చదువు గురించి తప్ప, లోకంలోని అన్ని విషయాలూ ఆయన నాతో మాట్లాడేవారు. నేను సినిమాల్లోకి వెళ్లడం కూడా డాడీకి ఇష్టమే. ‘ఇన్సీ’ అనేది నెక్స్ట్ మూవీలో నా పేరు. ఆ పేరుతోనే డాడీ నన్నిప్పుడు పిలుస్తున్నారు!
సాయంత్రం డాడీ బ్యాంకు నుంచి వచ్చారు. మమ్మీ కూడా అదే టైమ్‌కి వచ్చింది. వచ్చీ రావడంతోనే ‘‘హౌయూ బేబీ’’ అంటూ నా రూమ్‌లోకి వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టి, కిచెన్‌లోకి వెళ్లిపోయింది మమ్మీ. బ్యాంకు నుండి రాగానే డాడీకి మమ్మీ గ్రీన్ టీ ఇవ్వాలి. టీ తాగుతూ డాడీ నాతో మాట్లాడ్డానికి వచ్చేస్తారు. టీ ఇచ్చేది మమ్మీ. మాట్లాడేది నాతో. ఇక చూడాలి మమ్మీ ఫీలింగ్స్.
‘‘మీ డాడీకి నాతో మాట్లాడ్డానికి టైమ్ దొర కడం లేదు పాపం’’ అంది మమ్మీ. డాడీ నవ్వారు. ‘‘మార్చి తర్వాత మాట్లాడుకుందాం’’ అన్నారు. మమ్మీ.. డాడీ వైపు వింతగా చూసింది. ‘‘మీ కూతురు టెన్త్ మాత్రమే రాయబోతోంది. అంతరిక్షంలోకి వెళ్లడం లేదు. అలా కౌంట్ డౌన్ ఫేస్ పెట్టేయకండి’’ అంది.
డాడీ నా వైపు చూశారు. ‘‘అంతరిక్షం నా కూతురికి లెక్క కాదు. అయినా తనిప్పుడు ఉన్నది అంతరిక్షంలోనే కదా. అంతా కలసి దంగల్ స్పేస్‌షిప్‌లో పైకి పంపించేశారు. అక్కడి నుంచి భద్రంగా కిందికి ఎలా దిగిరావాలో చెబుతున్నాను’’ అన్నారు. డాడీ భయం అర్థమైంది.
ఎగ్జామ్స్ అంటే నాకేం భయం లేదు. మమ్మీకి, డాడీకి అసలే లేదు. డాడీ భయం వేరే ఉంది. లేని పోని కాంట్రవర్సీల్లోకి నన్ను లాగేస్తారని, నా మనసు పాడవుతుందనీ.
‘‘బరి లోపల కుస్తీకి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి ఇన్సీ. బరి బయట లోకంలో అవేవీ ఉండవు. నువ్వసలు పోటీలోనే ఉండవు. కానీ నిన్ను బరిలోకి లాగేస్తారు. నువ్వు గెలిచావనో, ఓడావనో తీర్పు కూడా ఇచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి’’ అని చెప్పారు డాడీ.
డాడీ చెప్పింది నిజమే. సెంట్రల్ మినిస్టర్ గోయెల్‌జీ నన్ను ఇలాగే బరిలోకి నెట్టేశారు! ముఖానికి ముసుగు వేసుకుని ఉన్న ఓ యువతి ఫొటోను ట్వీటర్‌లో షేర్ చేసి, ‘మన అమ్మాయిలంతా ఆంక్షల సంకెళ్లను తెంచుకుని జైరా వసీమ్‌లా స్వేచ్ఛా విహంగమై బయటికి వచ్చేయాలి’ అని కామెంట్ పెట్టారు!! నాకూ, ఆ ఫొటోలో ముసుగు వేసుకుని ఉన్న యువతికీ పోలిక ఏమిటో నాకు అర్థం కాలేదు. ‘‘అమ్మాయిలకు ఆ ముసుగే అందమూ స్వేచ్ఛా.. సర్ జీ’’ అని రిప్లయ్ పెట్టాను.
మాధవ్ శింగరాజు