నారా లోకేశ్‌ (మంత్రి) రాయని డైరీ | nara lokesh unwritten diary by madhav singaraju | Sakshi
Sakshi News home page

నారా లోకేశ్‌ (మంత్రి) రాయని డైరీ

Published Sun, May 7 2017 1:39 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

నారా లోకేశ్‌ (మంత్రి) రాయని డైరీ - Sakshi

నారా లోకేశ్‌ (మంత్రి) రాయని డైరీ

ఏదీ అడక్కుండానే నాకు అన్నీ ఇచ్చేస్తున్నారు నాన్నగారు! యూఎస్‌ వెళ్లే ముందు కూడా నన్ను అమరావతి ల్యాండ్స్‌ బోర్డ్‌లో మెంబర్‌ని చేసి మరీ వెళ్లారు. ‘‘ఇవన్నీ ఎందుకు నాన్నగారు.. రోజుకింత పాకెట్‌ మనీ ఇవ్వండి చాలు’’ అన్నాను. నాన్నగారు పెద్దగా నవ్వారు. ‘‘లోకేశ్‌లా ఉంటే నీకు ఒకటే పాకెట్‌. లోకేశ్‌బాబులా ఉంటే లోకంలోని పాకెట్‌లన్నీ నీవే’’ అన్నారు.
‘‘అర్థం కాలేదు నాన్నగారూ’’ అన్నాను.
‘‘అమరావతిని కట్టడానికి నీ ఒక్కడి పాకెట్‌ మనీ సరిపోతుందా?’’ అన్నారు నాన్నగారు.
‘‘అర్థం కాలేదు నాన్నగారూ’’ అన్నాను.
‘‘ఇప్పుడూ.. అమరావతిని ఎవరు కడుతున్నారూ?’’ అని అడిగారు నాన్నగారు.
‘‘ఇంకెవరు నాన్నగారూ.. మీరే కదా’’ అన్నాను.

‘‘గుడ్‌.. నా తర్వాత అమరావతిని కట్టాల్సింది ఎవరూ?’’ అని అడిగారు నాన్నగారు.
‘‘ఒకసారి కట్టిందాన్ని మళ్లీ ఎందుకు కట్టాలి నాన్నగారూ?’’ అని అడిగాను.
నాన్నగారు మళ్లీ పెద్దగా నవ్వారు.
‘‘నిజమే. ఒకేసారి కట్టేస్తే మళ్లీ కట్టే పనిలేదు. కొంచెం కట్టి వదిలేస్తే.. అప్పుడు?’’ అన్నారు.
‘‘కట్టకుండా వదిలేసింది మీరే కాబట్టి.. ఆ వదిలేసింది కూడా మీరే కట్టాలి కదా నాన్నగారూ’’ అన్నాను.
‘‘అంతా నేనే కట్టేస్తే... అమరావతిలో నువ్వు కట్టడానికి ఏం మిగిలి ఉంటుంది లోకేశ్‌బాబూ’’ అన్నారు నాన్నగారు!
‘‘అర్థం కాలేదు నాన్నగారూ’’ అన్నాను.

నాన్నగారు నవ్వారు. కానీ ఈసారి నాన్నగారు నవ్వినట్లు లేదు. ఇంకెవరి నాన్నగారో బాగా కోపం వచ్చి నవ్వినట్లుగా ఉంది.
‘‘అమరావతిని చంద్రబాబు, ఆయన కొడుకు కట్టించారని చెప్పుకుంటే గొప్ప కానీ, చంద్రబాబు ఒక్కడే అమరావతిని కట్టించాడని చెప్పుకుంటే ఏం గొప్ప లోకేశ్‌బాబూ?’’ అన్నారు నాన్నగారు.
‘‘భలే భలే.. నాన్నగారూ. అర్థమైంది! మీరు కట్టప్ప.. నేను కట్టప్ప’’ అన్నాను.
‘‘బాహుబలి 2 నచ్చిందా’’ అన్నారు నాన్నగారు.
‘‘భలే ఉంది నాన్నగారూ... సినిమా చూస్తున్నంతసేపూ నన్ను మహేంద్ర బాహుబలిలా, జగన్‌ని భల్లాలదేవలా ఊహించుకున్నా’’ అన్నాను. నాన్నగారు మురిసిపోయారు.

‘‘నాన్నగారూ ఒక డైలాగ్‌ చెప్పేదా.. నా సొంత కల్పితం’’ అన్నాను.  ‘‘త్వరగా చెప్పు  ఫ్లయిట్‌కి టైమ్‌ అవుతోంది’’ అన్నారు నాన్నగారు.
‘‘నారా లోకేష్‌ అను నేను.. అశేషమైన అమరావతి ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షకుడిగా.. ఎవరి పదవీ త్యాగానికైనా వెనుకాడబోనని, నా తండ్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను..’’ 
నాన్నగారు నా భుజం తట్టారు.
‘‘డైలాగ్‌లో చిన్న కరక్షన్‌ ఉంది. యూఎస్‌ నుంచి వచ్చాక చెబుతాను’’ అని వెళ్లిపోయారు.
మాధవ్‌ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement