నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ రాయని డైరీ
ప్రమాణ స్వీకారం చేసి రెండ్రోజులైంది. రెండు రోజులే అయింది. ఏ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానో గుర్తుకు రావడం లేదు! డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యలేదని మాత్రం గుర్తుంది. అమరీందర్ సింగ్‌కి ఫోన్ చేశాను. ఎత్తలేదు. మళ్లీ చేశాను. మళ్లీ ఎత్తలేదు. మళ్లీ చేయబోయాను. ఆయనే చేశారు! ‘అప్పుడే బిజీ అయిపోయారా సీఎంగారూ!’ అనబోయాను. ఆయన అననివ్వలేదు.
‘‘ఓపిక ఉండాలయ్యా సిద్ధూ. డెబ్బై ఐదేళ్ల వయసులో మళ్లీ సీఎంని అయ్యానంటే ఓట్లు పడే అయ్యానంటావా? ఓపిక పట్టి అయ్యాను’’ అన్నారు.
‘‘అది కాదు కేప్టెన్.. ’’ అన్నాను.
‘‘ఏది కాదయ్యా! కళ్లున్నవాడు పుట్టుగుడ్డినని చెప్పుకుంటే లోకం నమ్ముతుందా? పుట్టినప్పటి నుంచి నువ్వు బీజేపీలో ఉండి, ఇప్పుడు పుట్టు కాంగ్రెస్‌నని చెప్పుకుంటే.. నిన్ను నడిపించుకుంటూ వెళ్లి డిప్యూటీ సీఎం సీట్లో ఎలా కూర్చోబెట్టమంటావ్?’’ అన్నారు.
‘‘పుట్టు కాంగ్రెస్ అని ఊరికే సరదాకి అన్నాను కేప్టెన్. ఓటర్లను నవ్విద్దామని’’ అన్నాను.
‘‘కొంచెం సీరియస్‌గా ఉండవయ్యా. కాంగ్రెస్ లోకి వచ్చావు కదా. కామెడీ షోలు మానేయ్’’ అన్నారు అమరీందర్‌సింగ్.
‘‘కానీ కేప్టెన్.. మీకు తెలుసు కదా.. నవ్వ కుండా, నవ్వించకుండా నేను ఉండలేను’ అని పెద్దగా నవ్వాను.
కేప్టెన్ మాట్లాడలేదు! ఫోనూ కట్ కాలేదు. చూసి చూసి చివరికి నేనే కట్ చేసుకున్నాను.
నాకిచ్చిన పోర్ట్‌ఫోలియో ఏంటో ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు! టీవీ చూసి తెలుసుకుందామంటే.. రెండు రోజులుగా.. నన్నెందుకు డిప్యూటీ సీఎంని చెయ్యలేదనే విషయం మీద డిబేట్లు నడుస్తున్నాయి కానీ, నాకిచ్చిన శాఖేమిటో ఒక్కరి నోటి నుంచీ రావడం లేదు!
కేప్టెన్ నుంచి ఫోను! ‘‘కట్ చేశావేంటయ్యా’’ అని విసుక్కున్నారు. ‘‘మీరు లైన్‌లో లేరనుకున్నాను కేప్టెన్’’ అన్నాను. ‘‘బీజేపీని కట్ చేశావ్. ఆమ్ ఆద్మీని కట్ చేశావ్. ఆవాజె పంజాబ్‌ని కట్ చేశావ్. ఇప్పుడు నా లైన్ కట్ చేశావ్. చెప్పు.. ఇందాక మనం ఎక్కడ కట్ అయ్యాం’’ అన్నారు.
‘‘మీరు నాకు ఇచ్చిన శాఖ ఏమిటో గుర్తుకు రావడం లేదు కేప్టెన్. అది తెలుసుకుందామనే మీకు ఫోన్ చేశాను’’ అన్నాను.
‘‘ప్రమాణ స్వీకారం అయినా గుర్తుందా?’’ అన్నారు మళ్లీ విసుగ్గా.
‘‘గుర్తుంది కేప్టెన్. ముందు మీరు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేశాను. తర్వాత మీ కాళ్లకు నమస్కారం చేశాను. అంతవరకే గుర్తుంది’’ అన్నాను.
అమరీందర్ సింగ్ నవ్వారు.
‘‘నువ్వే నయమయ్యా సిద్ధూ. నా కాళ్లకు నువ్వు వంగి నమస్కారం చెయ్యడమొక్కటే నాకు గుర్తుంది. నువ్వెప్పుడు ప్రమాణ స్వీకారం చేశావో, నువ్వెందుకు ప్రమాణ స్వీకారం చేశావో నాకు గుర్తు లేదు’’ అన్నారు కేప్టెన్!
- మాధవ్ శింగరాజు