కర్ణన్ (కోల్‌కతా హైకోర్టు జడ్జి) రాయని డైరీ
‘‘ఎటువైపు వెళ్దాం జస్టిస్ కర్ణన్’’ అంటు న్నాడు మా డ్రైవర్. కారులో నేను, మా డ్రైవర్.. ఇద్దరమే ఉన్నాం. మూడు రోజులుగా ‘రన్ అవే’లో ఉన్నాం. చట్టానికి దొరక్కుండా!
‘‘జస్టిస్ కర్ణన్.. చెప్పండి. ఎటువైపు వెళ్దాం’’ అని మళ్లీ అడిగాడు మా డ్రైవర్.
అతడినెప్పుడూ నేను డ్రైవర్‌లా చూడలేదు. అందుకే నన్ను ‘జస్టిస్ కర్ణన్’ అని స్వేచ్ఛగా సంబోధించగలుగుతున్నాడు. ఇద్దరం కలిసి ఎన్నో పెళ్లిళ్లకు వెళ్లి ఉంటాం. ఎన్నో పెళ్లిళ్లలో పక్కపక్కనే కూర్చొని ఉంటాం. అతడెప్పుడూ నా కాలుకి తన కాలుని తగిలించలేదు. ‘‘పర్లేదు తగిలించు’’ అన్నాను ఓ పెళ్లిలో. ‘‘తగిలించినంత మాత్రాన మీ పట్టా నాకు వచ్చేయదు కదా జస్టిస్ కర్ణన్’’ అన్నాడు! నాకు ముచ్చటేసింది! మా డ్రైవర్‌కి ఉన్న జ్ఞానం నా బ్రదర్ జడ్జిలకు ఉంటే బాగుండేది!
నేను జడ్జి అయిన కొత్తలో నా కాలికి కాలు తగిలించిన జడ్జి గుర్తుకొచ్చాడు. అప్పట్లో నాకు కాలు తగిలించినందుకు ఇప్పుడతడేమైనా గొప్పవాడు అయిపోయి, గొప్పగొప్ప తీర్పులు చెబుతున్నాడేమో తెలీదు.
చీమ.. పుట్టని మర్చిపోకూడదు. ప్లీడర్‌గా పైకొచ్చిన వాడు చెట్టును మర్చిపోకూడదు. చెట్టును గుర్తు పెట్టుకున్న జడ్జి ఎవరూ ఇంకో జడ్జికి జైలు శిక్ష విధించడు. కానీ నాకు విధించాడు! ఎక్కడున్నా పట్టుకొచ్చి నన్ను జైల్లో పడేయమని డీజీపికి ఆదేశాలు ఇచ్చేశాడు. మీడియాక్కూడా చెప్పేశాడు.. కర్ణన్‌ని కవర్ చెయ్యొద్దని!! ‘నాకు వండిపెట్టొద్దని మీక్కూడా ఏమైనా ఉత్తర్వులు జారీ అయ్యాయా అని మా ఇంట్లోవాళ్లని అడిగాను. లేదన్నారు! మంచితనమో, అతి మంచితనమో.. కొంచెమింకా మిగిలే ఉన్నట్లుంది కోర్టు తీర్పుల్లో.
‘‘ఎటువైపు వెళ్దాం జస్టిస్ కర్ణన్’ అని మళ్లీ అడిగాడు డ్రైవర్.
‘‘ఏ రాష్ట్రంలో ఉన్నాం?’’ అని అడిగాను.
‘‘ఆంధ్రా నుంచి తెలంగాణా వచ్చాం’’ అన్నాడు.
‘‘ఇక్కడి నుంచి ఎటువైపు వెళ్లొచ్చు’’ అని అడిగాను. మ్యాప్ తీశాడు.
‘‘డౌన్‌కెళితే కర్నాటక, అప్ ఎక్కితే మహారాష్ట్ర, సైడ్‌కి కొడితే చత్తీస్‌గడ్’’ అని చెప్పాడు.
‘‘అవన్నీ కాదు కానీ.. చెట్టు ఎక్కడ కనిపిస్తే అక్కడ కారు ఆపమని చెప్పాను.
‘‘చెట్టు కింద ఆపమంటారా? చెట్టు పక్కన ఆపమంటారా? చెట్టుకు దూరంగా ఆపమంటారా? చెట్టుకు సమీపంలో ఆపమంటారా?’’ అని అడిగాడు.
భయంగా చూశాను.
‘‘చెట్టు కిందా కాదు, చెట్టు పక్కనా కాదు, చెట్టుకు దూరంగా కాదు, చెట్టుకు దగ్గరగా కాదు. చెట్టు నీడకు ఆపు కాసేపు’’ అని చెప్పాను.
చెట్టు మీద నాకు నమ్మకం.
న్యాయం ఇవ్వని జడ్జి ఉంటాడేమో కానీ, నీడను ఇవ్వని చెట్టు ఉండదని నా నమ్మకం.
మాధవ్ శింగరాజు