కేజ్రీవాల్‌ (ఢిల్లీ సీఎం) రాయని డైరీ | Rayani Dairy On Kejriwal By Madhav Singaraju | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 17 2018 12:42 AM | Last Updated on Sun, Jun 17 2018 12:43 AM

Rayani Dairy On Kejriwal By Madhav Singaraju - Sakshi

లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలోని ‘వేచివుండు గది’లో వారం రోజులుగా కూర్చొని ఉన్నాం.. నేను, ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, కార్మిక మంత్రీ. ‘వేచివుండు గది’ని  ‘నిరీక్షించు గది’గా మార్చేసి బయటికి వెళ్లిపోయాడు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌! 
‘‘మళ్లెప్పుడొస్తారు?’’ అని సెక్యూరిటీ వాళ్లను అడిగాను. ‘‘మీరెప్పుడెళతారు?’’ అని సెక్యూరిటీ వాళ్లు అడిగారు. సెక్యూరిటీకి చెప్పే వెళ్లినట్లున్నాడు లెఫ్ట్‌నెంట్‌! 
‘‘సార్, వేచివుండే గదిని మీరు ఖాళీ చేస్తే, బయట వేచివున్నవారొచ్చి కూర్చోడానికి వీలౌతుంది’’ అన్నాడు సెక్యూరిటీ గార్డు వచ్చి.
‘‘వాళ్లెవరు?’’ అన్నాను. 
‘‘మీవాళ్లే సార్‌’’ అన్నాడు గార్డు.
బయటికెళ్లి చూశాను. మా మంత్రులే!
‘‘మీతో పాటు కూర్చుంటాం కేజ్రీ’’ అన్నారు. వద్దన్నాను. వెళ్లిపోయారు. 
కూర్చోడానికి సరిపోయేలా ఉన్నాయి కానీ, పడుకోడానికి పట్టేలా లేవు.. లోపలి సోఫాలు. పాపం మావాళ్లు నేను కాళ్లు చాపుకోవడం కోసం నాకొక్కడికే ఫుల్‌ సోఫా ఇచ్చేసి, మిగతావాటిల్లో వాళ్లు్ల ముగ్గురూ అడ్జెస్ట్‌ అవుతున్నారు. 
‘‘దీక్షలో ఉన్నది మీరు. మీరే ఫుల్‌ సోఫాలు తీసుకుని, కూర్చోడానికి నాకింత చోటు మిగిల్చండి చాలు’’ అన్నాను. ఉప ముఖ్యమంత్రీ, ఆరోగ్య మంత్రీ వినలేదు. ‘‘మీరు కంఫర్ట్‌గా ఉండండి కేజ్రీ’’ అన్నారు. కార్మిక మంత్రి దీక్షకు కూర్చోలేదు. ‘‘వేచి చూద్దాం’’ అన్నాడు. 
‘‘దేనికి గోపాల్‌.. వేచి చూడ్డం?’’ అని అడిగాను. 
‘‘వాళ్లిద్దరూ పడిపోతే, అప్పుడు మనమే కదా కేజ్రీ.. దీక్షలో కూర్చోవాలి. అప్పటి వరకు వేచి చూద్దాం’’ అన్నాడు!  
‘‘ఒకేసారి నలుగురం పడిపోతే నష్టం ఏంటి గోపాల్‌?’’ అని అడిగాను. 
‘‘తొందరపడి అందరం పడిపోవడం ఎందుకని నా ఉద్దేశం కేజ్రీ. లక్కీగా గవర్నర్‌ తిరిగొస్తే..!’’ అన్నాడు.
ఉప ముఖ్యమంత్రి వైపు చూశాను. ఉపవాసం చేసినట్లు అయిపోతున్నాడు. ఆరోగ్య మంత్రి వైపు చూశాను. అనారోగ్యంతో కుప్పకూలేలా ఉన్నాడు. 
మోదీ స్పందించడం లేదు. రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పందించడం లేదు. రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించడం లేదు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ స్పందించడం లేదు. అంబులెన్సులు మాత్రం స్పందించడానికి  సిద్ధంగా ఉన్నాయి. 
నాలుగు నెలలుగా ఐయ్యేఎస్‌లు పనికి రావడం లేదు. ఆ విషయమే మాట్లాడదామని వస్తే గవర్నర్‌ మాట్లాడకుండా వెళ్లిపోయాడు. 
విధి వింతలా ఉంది! 
సీఎం ఆఫీస్‌లో ఉండవలసినవాళ్లం రాజ్‌ నివాస్‌లో ఉన్నాం. రాజ్‌ నివాస్‌లో ఉండవలసిన గవర్నర్‌.. సెక్రెటేరియట్‌ వెనుక క్యాంప్‌ ఆఫీస్‌లో ఉన్నాడు. మంత్రుల దగ్గర ఉండాల్సిన ఐయ్యేఎస్‌లు మోదీ పక్కన ఉన్నారు! 
మాధవ్‌ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement