
అజిత్ పవార్ నుంచి ఫోన్! టైమ్ చూసుకుని ఫోన్ చేయలేదా ఏంటీ మనిషి అని నేనే టైమ్ చూసుకున్నాను. ఉదయానికీ, మధ్యాహ్నానికి మధ్యలో ఎక్కడో ఉంది టైమ్. అతడెప్పుడూ ‘మధ్యల్లో’ ఫోన్ చేయడు. చేస్తే ఉదయం. చేస్తే మధ్యాహ్నం. చేస్తే సాయంత్రం. చేస్తే రాత్రి. ఏ రెండు సమయాలకూ మధ్య సమయంలో అతడి ఫోన్ రాదు. వచ్చిందంటే ముఖ్యమైన సంగతో, ముఖ్యం కాని సంగతో తేల్చుకోలేని సంగతి అయి ఉంటుంది!
‘‘చెప్పు అజిత్’’ అన్నాను.
‘‘చెప్పాను కదా..’’ అంటున్నట్లున్నాడు. సరిగా వినిపించడం లేదు.
‘‘అజిత్.. ఒకవేళ నీ ముఖానికి మాస్క్ ఉన్నట్లయితే దానిని తీసి మాట్లాడటానికి వీలవుతుందా?’’ అన్నాను.
‘‘మనం కూడా కొంతమంది పెద్ద మనుషులకు ఫోన్ చేస్తే బాగుంటుంది ఉద్ధవ్..’’ అన్నాడు. వాయిస్ క్లియర్ అయింది. మాస్క్ తొలగించినట్లున్నాడు.
అజిత్ ఏం చెప్పదలచుకున్నాడో నాకు అర్థమైంది. మోదీజీ రోజుకు ఇంతమందని.. దేశంలోని సీనియర్ లీడర్‌లకు ఫోన్‌లు చేసి ‘బాగున్నారా? ఆరోగ్యం జాగ్రత్త’ అని పరామర్శిస్తున్నారు.
‘‘మోదీజీలా మరీ ఎనభై నిండిన వాళ్లకు కాకున్నా.. కనీసం డెబ్భై నిండిన వాళ్లకైనామనం ఫోన్ చేస్తే బాగుంటుందని నీకు ఫోన్ చేశాను’’ అన్నాడు.
అజిత్ నన్ను ‘నువ్వు’ అంటాడు. నేనూ అతడిని ‘నువ్వు’ అంటాను. అజిత్ నాకంటే ఏడాది పెద్ద. ‘పర్లేదు. ఏడాది పెద్ద అయినా నువ్వు నన్ను ‘నువ్వు’ అనొచ్చు’ అన్నాడీమధ్య! ‘ఎందుకు అలా ‘నువ్వు’ అనడం? ఏడాది గ్యాప్‌ని గ్యాప్‌లాగే ఉంచేస్తే మంచిది కదా’ అన్నాను. ‘గ్యాప్‌ని గ్యాప్‌లా ఉంచాలంటే నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండి, నన్ను సీఎంగా ఉంచాలి. ఉంచుతావా?’ అన్నాడు పెద్దగా నవ్వుతూ. అజిత్‌ని సీఎంని చెయ్యడం కన్నా, ‘నువ్వు’ అనడమే తేలిక.
‘‘చెప్పు ఉద్ధవ్.. అలా చేద్దామా.. సీనియర్‌లు అందరికీ ఫోన్‌లు చేసి..’’ అంటున్నాడు అజిత్.
‘‘అజిత్.. మోదీజీ ఫోన్ చేస్తే కరోనా సెవన్ పాయింట్ ప్రోగ్రామ్‌లో భాగంగా చేశాడని అంటారు. మనం ఫోన్ చేస్తే దేశం మొత్తం మీద మహారాష్ట్రలోనే కరోనా ఎక్కువగా ఉంది కాబట్టి.. ఉన్నారో లేరో కనుక్కోడానికి ఫోన్ చేస్తున్నామని అంటారు’’ అన్నాను.
‘‘అవును కదా.. పోనీ శాంపిల్‌గా ఎవరికైనా చేసి చూద్దామా? వాళ్లేం అనుకుంటారో తెలుస్తుంది..’’ అన్నాడు.
‘‘చాలా పనులున్నాయ్ అజిత్.. లాక్‌డౌన్‌ని జూన్ వరకు ఎలా పొడిగించాలో ఆలోచించాలి. అంతకన్నా ముఖ్యం.. మే ఇరవై ఎనిమిది లోపు నేను ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో అవ్వాలి. ఎమ్మెల్యే సీట్లు ఖాళీల్లేవు. ఎమ్మెల్సీని అవ్వాలి. ఎమ్మెల్సీని అవలేకపోతే అప్పుడు నా చేత ‘నువ్వు’ అని కాకుండా, ‘సీఎం గారూ..’ అనిపించుకోవడం బాగుంటుందా నీకు? ఫోన్‌లొద్దు, పరామర్శలొద్దు మనకు’’ అన్నాను.
‘‘అంతేనా’’ అన్నాడు నిరుత్సాహంగా.
‘‘కావాలంటే నువ్వన్నట్లు శాంపిల్‌గా ఓ కాల్ చేసి చూడు’’ అని ఫోన్ పెట్టేశాను.
గంట తర్వాత మళ్లీ ఫోన్.. అజిత్ నుంచి.
‘‘గంట నుంచి చేస్తున్నా. తియ్యట్లేదు’’ అన్నాడు.
‘‘నాకెప్పుడు చేశావ్!’’ అన్నాను.
‘‘నీక్కాదు. గవర్నర్‌కి. డెబ్బై ఏడేళ్లు ఉన్నాయి కదా అని ఫోన్ చేశాను. తియ్యలేదు. చేస్తూనే ఉన్నాను తియ్యట్లేదు. ఏమైనా అయి ఉంటుందా!’’ అన్నాడు కంగారుగా.
‘‘అయుండదు. అవుతుందని తీసుండడు’’ అన్నాను.
రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. ఒకదానికి నన్ను నామినేట్ చెయ్యమని లెటర్ పెట్టి రెండు వారాలైంది. అందుకోసమే ఫోన్ చేస్తున్నారని అనుకుని ఉంటాడు.
-మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment