
అమిత్‌షా ఫోన్ ఎత్తడం లేదు! ఎందుకు ఫోన్ ఎత్తడం లేదో చెప్పడానికైనా ఒకసారి ఫోన్ ఎత్తమని అడగడానికి మళ్లీ ఫోన్ చేశాను. ఎత్తాడు!! ‘‘అమిత్‌జీ నేను ఉద్ధవ్ ఠాక్రే . ఫాదర్ ఆఫ్ ఆదిత్యా ఠాక్రే . వయసు ఇరవై తొమ్మిది. వర్లీ నుంచి భారీ మెజారిటీతో గెలిచాడు’’ అని చెప్పాను. ‘‘ఇదంతా నాకెందుకు చెబుతున్నారు ఉద్ధవ్! దీపావళి పనుల్లో ఉన్నాను. వేరే ఇంకే సమయంలోనైనా మీరు నాకు ఫోన్ చేయగలరా?’’ అన్నాడు విసుగ్గా! ఉలిక్కి పడ్డాను. పిల్లలెవరో బాంబు పేల్చినట్లున్నారు! ఫోన్‌ని అలా చెవికి ఆన్చుకునే వెళ్లి బాల్కనీలోంచి కిందికి చూశాను. ఆదిత్యను ముఖ్యమంత్రిని చెయ్యాలని ఆ ఈడు కుర్రాళ్లంతా ఇంటి ముందు ఔట్లు పేలుస్తున్నారు. సంతోషంగా అనిపించింది.
‘‘ఏమైంది ఉద్ధవ్! వేరే ఇంకే సమయంలోనైనా మీరు నాకు ఫోన్ చేయగలరా అని మిమ్మల్ని అడిగాను కదా! సమాధానం చెప్పరేమిటి?’’ అంటున్నాడు అమిత్‌షా. ‘‘అమిత్‌జీ.. ఆ బాంబుల చప్పుడేమిటని మీరు అడుగుతారని ఆశించాను. కానీ మీరు అడగలేదు. నిజానికి ఆ చప్పుళ్లు మీకు వినిపించడం కోసమే నేను మీకు సమాధానం చెప్పకుండా ఆగాను. ఆదిత్యను సీఎంను చేయాలని డిమాండ్ చేస్తూ కిందంతా ఔట్లు పేలుస్తున్నారు’’ అని చెప్పాను.
‘‘విన్నాను ఉద్ధవ్. మీ అబ్బాయిని సీఎంను చెయ్యాలన్న డిమాండ్‌తో పేలుస్తున్న ఔట్‌ల చప్పుడులా లేదది. మీ అబ్బాయి సీఎం అయ్యాక పేలుతున్న ఔట్‌ల చప్పుడులా ఉంది’’ అన్నాడు. మండిపోయింది నాకు! ‘‘ఏంటి ఉద్ధవ్.. మండిపడుతున్నారు!?’’ అన్నాడు!! ‘‘నేను మండిపడటం కాదు అమిత్‌జీ. ఇక్కడ టెన్ థౌంజండ్‌వాలా అంటించారు. పిల్లలు కదా. పెద్దా చిన్నా చూస్కోరు. మంట పెట్టేస్తారు. అవొచ్చి మనకు తగులుతాయ్’’ అన్నాను.
‘‘ముందా పిల్లాటలు మానేయమనండి ఆదిత్యని. రాజకీయాల్లోకి రావలసినవాడు’’ అన్నాడు! రాజకీయాల్లో ఉన్నవాడిని పట్టుకుని రాజకీయాల్లోకి రావలసినవాడు అంటున్నాడంటే.. ఆదిత్యను సీఎంని చెయ్యకూడదని అమిత్‌షా గట్టిగానే డిసైడ్ అయినట్లున్నాడు. ‘‘మావాడు ఇప్పుడు రాజకీయాల్లోకి రావడమేంటి అమిత్‌జీ! పదేళ్లుగా రాజకీయాల్లోనే కదా ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఎన్నికల ముందు మీరు మా ఇంటికి వచ్చి.. ‘మనం పవర్‌లోకి వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ’ అన్లేదా?! ఎన్నికలయ్యాక ఇప్పుడు.. దీపావళి పనులున్నాయి అంటున్నారేమిటి!’’ అని అడిగాను.
పెద్దగా నవ్వాడు అమిత్‌షా. ‘‘దీపావళి పనులంటే మీకు, మీ వాడికి ఔట్‌లు పేల్చడం. నాకు మాత్రం మహారాష్ట్రకు ఒక కొత్త సీఎంని వెదకి తేవడం’’ అన్నాడు! ‘‘అర్థం కాలేదు అమిత్‌జీ’’ అన్నాను. ‘‘ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మీకు యాభై ఆరు సీట్లు, మాకు నూట ఐదు సీట్లు కాదు ఉద్ధవ్. మాకొచ్చిన సీట్లలో సగం మాత్రమే మీకు వచ్చినప్పుడు మనం సగం సగం అవుతామని మీరు ఎలా అనుకున్నారు?’’ అన్నాడు! నేనిక మొహమాట పడదలచుకోలేదు.
‘‘అమిత్‌జీ.. ఎన్ని సీట్లు వచ్చాయని కాదు, ఎన్ని సీట్లు తగ్గాయో చూడండి. మాకు తగ్గిన సీట్లు ఏడైతే, మీకు తగ్గిన సీట్లు పదిహేడు. మాకు తగ్గిన వాటి కన్నా రెట్టింపుగా మీకు తగ్గినప్పుడు మనం సగం సగం కాబోమని మీరెలా అనుకుంటారు?’’ అన్నాను. ‘‘దీపావళి పనుల్లో ఉన్నాను. మళ్లీ చెయ్యండి ఉద్ధవ్’’ అన్నాడు! ‘‘మీ దీపావళి పనుల్లో మీరు ఉండండి. మా దీపావళి పనుల్లో మేము ఉంటాము’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాను.