
ట్రంప్ ట్వీట్ పెట్టాడు. ‘యు ఆర్ లుకింగ్ సో గుడ్’ అన్నట్లుంది ఆ ట్వీట్. అన్నట్లుందే కానీ, అతడు అన్నదైతే అది కాదు. ‘సెలబ్రేట్ బోరిస్’ అంటాడు.
గెలిచిన వాళ్లెవరిలోనైనా అందాన్నే చూస్తాడు ట్రంప్. గెలుపంటేనే అందం ట్రంప్‌కి. దగ్గర్లేను. ఉంటే ఒక్కటిచ్చేవాడు. మగాడు మగాడికి ఇవ్వకూడనిది ఏదైతే ఉంటుందో సరిగ్గా దాన్నే ఇచ్చి ఉండేవాడు. ఇచ్చి నవ్వేవాడు. ‘యు ఆర్ లుకింగ్ సో గుడ్’ అనేవాడు మళ్లీ. లోపల ఇంకో ట్రంపేం ఉండడు పాపం నాన్–మేల్ రూపంలో. అదొక ధోరణి అంతే. దాన్ని అర్థం చేసుకున్నవాళ్లు మూడేళ్ల క్రితం ట్రంప్‌కి ఓటేశారు. మూడేళ్లు ట్రంప్‌ని చూశాక కూడా అర్థం చేసుకోనివాళ్లు అతడి ఇంపీచ్‌మెంట్‌కి నిన్న ఓటేశారు. నవ్వుకుని ఉంటాడు.
ట్వీట్‌లో ‘సెలబ్రేట్ బోరిస్’ అనడానికి ముందు.. నువ్వూ నేను కలిస్తే ఇక నీకెవరి డీల్సూ అక్కర్లేదని కూడా అన్నాడు ట్రంప్! ‘జనవరిలో యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు యూనియన్‌తో నువ్వు కుదుర్చుకునే డీల్స్ అన్నిటికన్నా, అందులోంచి బయట పడినందుకు జనవరి తర్వాత నేనిచ్చే డీల్ నీ ముఖాన్ని వెలిగించేంత మనోహరంగా ఉంటుంది’ అంటాడు!
ప్రధానిగా గెలిచినందుకు కాకుండా, ప్రధానిగా గెలిచినందుకు ట్రంప్ నాకేదో ఇస్తానని అన్నందుకూ కాకుండా.. నన్ను నేను సెలబ్రేట్ చేసుకోవలసిన గెలుపు ఇది. నేనేమిటో బ్రిటన్‌కి తెలుసు. తెలిసీ బ్రిటన్ ప్రజలు నాకు ఓటు వేశారంటే.. బ్రిటన్‌కి ఒక ప్రధానిగా వాళ్లు నన్నెన్నుకోలేదు. బ్రిటన్‌కి అవసరమైన ఒక ప్రధానిగా నన్ను ఎన్నుకున్నారు! అదీ నేను చేసుకోవలసిన సెలబ్రేషన్.
ఎన్నికల ప్రచారంలో లేబర్‌పార్టీ నా మీద చేసిన పెద్ద దుష్ప్రచారం.. నేను ట్రంప్‌లా ఉంటానని. ఇద్దరి ఫేస్‌లు ఒకేలా ఉంటాయని. ఇద్దరి జోక్‌లు ఒకేలా ఉంటాయని. ఇద్దరికీ ‘గే’ లంటే పరిహాసం అని. ఇద్దరికీ ముస్లింలంటే పడదని!
స్కాటిష్ నేషనల్ పార్టీ ఆ దుష్ప్రచారాన్ని ఫొటోషాప్‌లో ఇంకొంచెం పై లెవల్‌కి తీసుకెళ్లింది. యాభై ఐదేళ్ల వయసులో ట్రంప్ ఎలా ఉన్నాడో ఆ ఫొటోను సంపాదించి, ‘చూడండి ప్రజలారా.. అచ్చు బోరిస్‌లా ఉన్నాడు కదా’ అంది. డెబ్భై మూడేళ్ల వయసులో బోరిస్ ఎలా ఉంటాడో ఫేస్‌యాప్‌లోంచి తీసి, ‘చూశారా ప్రజలారా.. అచ్చు ట్రంప్‌లా ఉన్నాడు కదా’ అంది. ప్రజలు చప్పట్లు కొట్టారు. బోరిస్, ట్రంప్ ఒకలా ఉంటారు అన్నందుకు చప్పట్లు కొట్టారో.. బోరిస్, ట్రంప్ ఒకలా ఉన్నందుకు చప్పట్లు కొట్టారో ఇప్పుడా రెండు పార్టీలకు అర్థమయ్యే ఉంటుంది.
యూరోపియన్ యూనియన్ నుంచి మనస్ఫూర్తిగా ఒక్క శుభాభినందనా అందలేదు. ఇంట్లోంచి ఒకరు వెళ్లిపోయి స్వతంత్రంగా ఉండాలనుకోవడం ఆ వెళ్లేవాళ్లకు సంతోషాన్నిస్తుంది కానీ, వాళ్లు ఉంటే బాగుంటుందని కోరుకునే ఇంటికి సంతోషాన్నివ్వదు.
జనవరి లోపు ఇల్లు వెకేట్ చేస్తామని చెప్పిన వాళ్లనే బ్రిటన్ గెలిపించింది. బోరిస్ ముఖం, ట్రంప్ ముఖం సేమ్ టు సేమ్ అన్నవాళ్లను పట్టించుకోలేదు. ఎవరి ముఖం ఎలా ఉంటే ఏమిటీ, ఒక ముఖమైతే ఉండటం ముఖ్యం కానీ అనుకుని ఉండాలి.
స్కాట్లాండ్ ఎప్పట్నుంచో బ్రిటన్‌నుంచి వెళ్లిపోతానని అంటోంది.
ఈయూ నుంచి బ్రిటన్ బయటికి వచ్చాక.. బ్రిటన్ నుంచి బయటికి వెళ్లిపోతానని స్కాట్లాండ్ ఈసారి పట్టుపట్టొచ్చు. ‘నువ్వు బయటికి రావచ్చు కానీ నేను బయటికి వెళ్లిపోకూడదా..’ అని కూడా అంటుంది. ట్రంప్ ఇస్తానన్న మనోరంజకమైన డీల్‌కి ముడిపెట్టి ఎలాగైనా స్కాట్లాండ్‌ను బయటికి వెళ్లకుండా ఆపాలి.
మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment