లండన్‌లో ఊరికే తిరగడం బాగుంది కానీ, మరీ అదే పనిగా బాగుండబట్టో ఏమో.. ఎప్పుడైనా అలా ఇండియా వెళ్లి, ఎక్కడికీ తిరక్కుండా కొన్నాళ్లు అక్కడే ఉండి రావాలని మనసుకు అనిపిస్తూ ఉంటుంది.
చట్ట ప్రకారం నడుచుకునే వ్యక్తిని కనుక నాక్కొన్ని తప్పవు. ఇండియా రమ్మంటే వెళ్లకపోయినా నష్టం లేదు. ఇంగ్లండ్ వెళ్లమనకుండా వెళితేనే.. వీళ్ల చట్టాన్ని అగౌరవపరిచినట్లవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించినా ఇంగ్లండ్ ‘సర్లే’ అంటుంది కానీ, అగౌరవపరిస్తే మాత్రం.. ‘ఇదేనా నీ దేశం నీకు నేర్పిన సంస్కారం?’ అని ప్రశ్నిస్తుంది.
‘‘ఇండియాలో ఇలాక్కాదు’’ అన్నాను మా ఇంగ్లండ్ లాయర్‌తో.. కోర్టు మెట్లు ఎక్కుతూ.
‘‘ఎలాక్కాదూ?’’ అన్నాడు ఇంగ్లండ్ లాయర్.
‘‘ఇండియాలో చట్టాన్ని గౌరవించక పోయినా ఏం కాదు. ఉల్లంఘిస్తేనే అవుతుంది’’ అన్నాను.
‘‘ఏమౌతుంది?’’ అన్నాడు.
‘‘చాలానే అవుతుంది. మనమేదో తప్పుచేసినట్లు అంతా మనల్ని చూసి తప్పుకుని పోతారు. ఆర్థికమంత్రి తప్పుకుని పోతాడు. అపోజిషన్ లీడర్ తప్పుకుని పోతాడు. సీబీఐ డైరెక్టర్ తప్పుకుని పోతాడు. అప్పులిచ్చిన బ్యాంకు చైర్మన్‌లు కూడా తప్పుకుని పోతారు’’ అని చెప్పాను.
‘‘అంత స్ట్రిక్టుగా ఉంటుందా?’’ అని ఆశ్చర్యపోయాడు ఇంగ్లండ్ లాయర్.
‘‘అవును. అంత స్ట్రిక్టుగా ఉంటారు. ‘కనీసం హాయ్ చెప్పినా, హాయ్ చెప్పరు. చూసీ చూడనట్లు తలతిప్పేసుకుంటారు’’ అన్నాను.
‘‘బార్బేరియస్. పౌరుల్ని ఇంత అంటరానివారిగా చూసే దేశంలో మీరెందుకుండాలి! ఇక్కడే ఉండిపోండి మిస్టర్ మాల్యా’’ అన్నాడు.. నన్ను దగ్గరికి లాక్కుంటూ!
‘‘ఏంటి లాక్కుంటున్నారు?’’ అన్నాను.
‘‘నీ పక్కన నేనున్నాను. ఇంగ్లండ్ ఉంది’’ అన్నాడు.
అతడివైపు కృతజ్ఞతగా చూశాను.
‘నీ పక్కన నేనున్నాను’.. ఎంత గొప్ప మాట! ఈ మాట రాహుల్ గాంధీ అనలేకపోయాడు. మోదీ అనలేకపోయాడు. జైట్లీ అనలేకపోయాడు. రాజ్యసభలో ఉన్నప్పుడు ఆ కాంపౌండ్‌లో ఓ రోజు జైట్లీ పక్కనే కాసేపు నడిచాను. అయినా ఆయన ఆ మాట అనలేకపోయాడు. నడిచి, నడిచి నేనే అన్నాను.. ‘జైట్లీజీ.. మీ పక్కన నేనున్నాను’ అని. ఆగాడు.
‘‘జైట్లీజీ.. మీ బాల్‌పెన్ ఒకసారి ఇవ్వండి’’ అన్నాను. ఆయన ఇవ్వబోయేలోపే.. ‘‘నా దగ్గరుంది తీస్కోండి’’ అనే మాట వినిపించింది. పక్కకు తిరిగాను.
‘‘వావ్! మీరు మాల్యా కదా. హెయిర్‌స్టెయిల్ మార్చినట్లున్నారు’’ అని బాల్‌పెన్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఏ పార్టీ సభ్యుడో గుర్తుకు రాలేదు.
బాల్‌పెన్‌తో నా అరిచేతిలో పద్నాలుగు వేలు మైనెస్ తొమ్మిది వేలు ఈజ్ ఈక్వల్ టు ఐదు వేలు అని రాసి, జైట్లీజీకి చూపించాను.
‘‘ఏంటది?’’ అన్నాడు.
‘‘నా ఆస్తులన్నీ అమ్మితే పద్నాలుగు వేల కోట్లొస్తాయి జైట్లీజీ. నాకున్న తొమ్మిదివేల కోట్ల బ్యాంకు అప్పులు కట్టేస్తే.. నా దగ్గరే ఇంకా ఐదు వేల కోట్లు మిగిలుంటాయి’’ అని చెప్పాను.
‘‘నీ ఇష్టం నీ కోట్లు. కట్టుకుంటే కట్టుకో. లేదంటే మానుకో. నాకెందుకు చెబుతున్నావ్?’’ అని, చెబుతున్నది వినకుండా వెళ్లిపోయాడు జైట్లీ.
ఆలోచిస్తుంటే.. ఇప్పుడనిపిస్తోంది! ‘నీ పక్కన నేనున్నాను’ అని మా ఇంగ్లండ్ లాయర్ అన్న మాటలాగే.. ‘కట్టుకుంటే కట్టుకో. లేదంటే మానుకో’ అనే మాట.. ఎంత గొప్ప మాటో కదా అనిపిస్తోంది!
విజయ్ మాల్యా (లండన్)
Published Sun, Sep 16 2018 1:55 AM | Last Updated on Sun, Sep 16 2018 1:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment