ఆర్థిక నేరగాళ్లకు లండన్‌ స్వర్గధామం ఎలా ? | True stories of Indian fugitives in London Book Release Today | Sakshi
Sakshi News home page

ఆర్థిక నేరగాళ్లకు లండన్‌ స్వర్గధామం ఎలా ?

Published Mon, Mar 22 2021 4:23 AM | Last Updated on Mon, Mar 22 2021 8:43 AM

True stories of Indian fugitives in London Book Release Today  - Sakshi

విజయ్‌ మాల్యా నీరవ్‌ మోదీ లలిత్‌ మోదీ సంజయ్‌ భండారీ

లండన్‌: విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, సంజయ్‌ భండారీ..  

భారత్‌ బ్యాంకులకు కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టి బ్రిటన్‌కు పరారైన ఆర్థిక నేరగాళ్లలో వీరు కొందరు.   మన దేశంలో నేరం చేసిన వారందరూ బ్రిటన్‌కే ఎందుకు ఉడాయిస్తున్నారు ?

ఆర్థిక నేరగాళ్లకు లండన్‌ స్వర్గధామంగా ఎలా మారింది ?  

ఈ ప్రశ్నలకు జవాబుల్ని  లండన్‌కు చెందిన జర్నలిస్టు దంపతులు డేనిష్‌ ఖాన్, రుహి ఖాన్‌లు ఒక పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఎస్కేప్డ్‌ @ ట్రూ స్టోరీస్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫ్యుజిటివ్స్‌ ఇన్‌ లండన్‌’ అన్న పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో 12 కేసుల్ని విస్తృతంగా అధ్యయనం చేసి భారత్‌ నేరగాళ్లకి లండన్‌ ఎలా సురక్షితంగా మారిందో వివరించారు. రుణాల ఎగవేత దగ్గర్నుంచి హంతకుల వరకు అన్ని రకాల కేసుల్ని రచయితలు అధ్యయనం చేశారు. కింగ్‌ ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, భారత్‌ నావికాదళ మాజీ అధికారి రవి శంకరన్, మ్యుజీషియన్‌ నదీమ్‌ సైఫీ వంటి వారి గురించి ఈ పుస్తకంలో రాశారు.

ఈ కేసులకు సంబంధించి కోర్టులో జరిగిన వాదోపవాదాలు, భారత్, బ్రిటన్‌ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాలు, బ్రిటన్‌లో తలదాచుకోవడానికి వచ్చిన వారు ఇచ్చిన వివిధ ఇంటర్వ్యూలు, కొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులు అన్నింటిని విస్తృతంగా పరిశీలించి, అన్నింటినీ క్రోడీకరించి లండన్‌ ఏ విధంగా భారత్‌ నేరగాళ్లకు సురక్షితమో పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశామని డేనిష్‌ ఖాన్‌ తెలిపారు. ప్రధానంగా నేరస్తుల అప్పగింతకు సంబంధించిన కేసుల విచారణ బ్రిటన్‌ కోర్టుల్లో నత్తనడకన సాగుతుంది. ఆ ధీమాతోనే నేరస్తులందరూ లండన్‌కి పారిపోతూ ఉంటారన్న అభిప్రాయాలున్నాయి. భారత్, బ్రిటన్‌ మధ్య 1992లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరితే ఇప్పటివరకు ఆ దేశం ఇద్దరిని మాత్రమే అప్పగించింది. మిగిలిన కేసులన్నీ ఇంకా పెండింగ్‌ లోనే ఉన్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement