Britan Journalist
-
ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామం ఎలా ?
లండన్: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, సంజయ్ భండారీ.. భారత్ బ్యాంకులకు కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టి బ్రిటన్‌కు పరారైన ఆర్థిక నేరగాళ్లలో వీరు కొందరు. మన దేశంలో నేరం చేసిన వారందరూ బ్రిటన్‌కే ఎందుకు ఉడాయిస్తున్నారు ? ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామంగా ఎలా మారింది ? ఈ ప్రశ్నలకు జవాబుల్ని లండన్‌కు చెందిన జర్నలిస్టు దంపతులు డేనిష్ ఖాన్, రుహి ఖాన్లు ఒక పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఎస్కేప్డ్ @ ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్ ఇన్ లండన్’ అన్న పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో 12 కేసుల్ని విస్తృతంగా అధ్యయనం చేసి భారత్ నేరగాళ్లకి లండన్ ఎలా సురక్షితంగా మారిందో వివరించారు. రుణాల ఎగవేత దగ్గర్నుంచి హంతకుల వరకు అన్ని రకాల కేసుల్ని రచయితలు అధ్యయనం చేశారు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, భారత్ నావికాదళ మాజీ అధికారి రవి శంకరన్, మ్యుజీషియన్ నదీమ్ సైఫీ వంటి వారి గురించి ఈ పుస్తకంలో రాశారు. ఈ కేసులకు సంబంధించి కోర్టులో జరిగిన వాదోపవాదాలు, భారత్, బ్రిటన్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాలు, బ్రిటన్‌లో తలదాచుకోవడానికి వచ్చిన వారు ఇచ్చిన వివిధ ఇంటర్వ్యూలు, కొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులు అన్నింటిని విస్తృతంగా పరిశీలించి, అన్నింటినీ క్రోడీకరించి లండన్ ఏ విధంగా భారత్ నేరగాళ్లకు సురక్షితమో పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశామని డేనిష్ ఖాన్ తెలిపారు. ప్రధానంగా నేరస్తుల అప్పగింతకు సంబంధించిన కేసుల విచారణ బ్రిటన్ కోర్టుల్లో నత్తనడకన సాగుతుంది. ఆ ధీమాతోనే నేరస్తులందరూ లండన్‌కి పారిపోతూ ఉంటారన్న అభిప్రాయాలున్నాయి. భారత్, బ్రిటన్ మధ్య 1992లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరితే ఇప్పటివరకు ఆ దేశం ఇద్దరిని మాత్రమే అప్పగించింది. మిగిలిన కేసులన్నీ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. -
ఆస్కార్ నటి చేదు జ్ఞాపకాలు
పేరొస్తే పేరుతో పాటు కొన్ని నెత్తి మీదకు వస్తాయి. నువ్వెలా ఉండాలో అందరూ చెప్పేవాళ్లే అవుతారు. ‘నువ్వలా ఎందుకు ఉండవు?’ అని అందరూ అడిగేవాళ్లే అవుతారు. ముఖ్యంగా సినిమాల్లో పేరొచ్చిన వాళ్లకు ఈ ‘పేరు బరువు’ మోయలేనంతగా, వదిలించుకోవాలన్నంతగా ఉంటుంది. కేట్ విన్స్లెట్ కూడా కొన్నాళ్లు ఆ బరువును మోశారు. మీడియా ఆమెపై మోపిన బరువు అది! ‘‘మీడియా నా జీవితాన్ని నరకప్రాయం చేసింది. అస్సలు దయలేకుండా ప్రవర్తించింది. ఆఖరికి నా నీడను కూడా వెంటాడి, దాక్కోడానికి నాకొక చోటు లేకుండా చేసింది. నా నుంచి నేను పారిపోవాలన్నంతగా నన్ను వెంటాడింది’’ అని గురువారం ‘డబ్ల్యూ.టి.ఎఫ్.’ అనే అమెరికన్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన వాయిస్ ఇంటర్వ్యూలో చెప్పారు కేట్. టైటానిక్ చిత్రం తెచ్చిన పేరుతో మీడియా ధోరణి వల్ల తను దాదాపుగా ఒక దుర్భరమైన బతుకునే బతికినట్లు కేట్ చెప్పారు. సినిమాకు బ్రేక్ వస్తే ఎవరైనా సంతోషిస్తారు. కేట్ విన్స్లెట్ మాత్రం సినిమాకు సినిమాకు మధ్య వచ్చిన బ్రేక్‌లో మీడియా కంటపడకుండా సంతోషమైన జీవితాన్ని వెతుక్కున్నారు. ఈ బ్రిటిష్ నటిని చెత్త చెత్త ప్రశ్నలు అడిగి, కల్పించిన ఆరోపణలు, విమర్శలతో వేధించింది బ్రిటన్ మీడియానే! బ్లాక్ బస్టర్ మూవీ ‘టైటానిక్’ 1997లో విడుదలైంది. అందులో హీరోయిన్ కేట్ విన్స్లెట్. ఫస్ట్ డే ఫస్ట్ షోతో ఆమెకు ఉత్తర అట్లాంటిక్ సముద్రమంత ఫాలోయింగ్ వచ్చేసింది. టైటానిక్‌లో ఉత్తమ నటిగా ఆస్కార్‌కు కూడా ఆమె నామినేట్ అయ్యారు. టైటానిక్‌కి ముందు ఐదు చిత్రాల్లో నటించారు కేట్. టైటానిక్ తర్వాత దాదాపు నలభై చిత్రాల్లో నటించారు. అయితే నేటికీ టైటానిక్కే ఆమె ఐడెంటిటీ. తన 21 ఏట జేమ్స్ కామెరూన్ చిత్రం టైటానిక్‌లో నటించిన కేట్ ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో జేమ్ కామెరూన్దే అయిన ‘అవతార్ 2’ లో నటిస్తున్నారు. చిత్రం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. విడుదలకు ఇంకో రెండేళ్లు పట్టొచ్చు. కరోనా బ్రేక్ రాకపోయుంటే ఈ ఏడాది (2021) డిసెంబర్లో విడుదలకు రెడీ అవుతూ ఉండేది. అవతార్ 2 లో అండర్ వాటర్ సీన్ కోసం కేట్ ఏడున్నర నిముషాల పాటు నీటి అడుగున ఊపిరి బిగబట్టి ఉన్నారని 2019లో కామెరూన్ మెచ్చుకోలుగా చెప్పారు. అయితే మీడియా విసిగింపులతో తను చాలాసార్లు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం ఊపిరిని బిగబట్టి ఉన్నానని అంటారు కేట్! ∙∙ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఫలానా టార్చర్ అని మీడియా ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కేట్. తనకు వ్యక్తిగత జీవితం లేకుండా చేశారని మాత్రం పలుమార్లు చెప్పారు. ఒక ఆస్కార్‌ను (‘ది రీడర్’ చిత్రంలో ఉత్తమ నటిగా), ఆరు ఆస్కార్ నామినేషన్లను గెలుచుకున్న కేట్.. టైటానిక్ చివరి సన్నివేశంలో హీరో డికాప్రియో ఇచ్చిన సపోర్ట్‌తో రాత్రంతా నీళ్లపై తేలుతూ ఎలాగైతే ప్రాణాలు కాపాడుకుంటుందో, మీడియా నుంచీ తనను తను అలాగే కాపాడుకుంటూ వచ్చింది. అయితే నిజ జీవితంలో తనే తన హీరో. ప్రస్తుతం భర్త, ముగ్గురు పిల్లలతో సంతోషంగా ఉన్న కేట్కు టైటానిక్‌తో ఆమె సంపాదించిన పేరు ప్రతిష్టలు ఏమంత సంతోషాన్నివ్వలేదు. ‘‘ఆ సినిమా రిలీజ్ తర్వాత నేను ‘పర్సనల్ ఫిజికల్ స్క్రూటినీ’కి గురయ్యాను’’ అని పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు కేట్. ఆ ఫిజికల్ స్క్రూటినీకి కారణం టైటానిక్‌లో కొన్ని క్షణాల పాటు కేట్ కళాత్మకంగానే అయినా, ‘న్యూడ్’గా కనిపించడం. కేట్ ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా చివరికి ఆ సీన్ దగ్గరికే వచ్చే ఆగేవి వాళ్ల ఆరాలు. కథలో భాగమైన ఆ ఇరవై ఏళ్ల అనాచ్ఛాదిత దేహాన్ని ప్రశ్నలతో ఆస్వాదించడం మొదలుపెట్టేవారు. ‘ఏంటమ్మాయ్.. బొత్తిగా సిగ్గు లేకుండా..’ అని విమర్శించిన ప్రేక్షకులూ ఉన్నారు. ‘సిగ్గు లేకుండా’ అనే మాట కేట్‌ని బాధించలేదు కానీ, నిర్భయంగా మీద చెయ్యి వేయడానికి చొరవ చూపిన వారిని దూరంగా ఉంచినందుకు అహం దెబ్బతిని తనపై వారు రాసిన సిగ్గు లేని రాతలు ఆమెను క్రుంగదీశాయి. ‘‘పేరు రావడానికి ప్రతిఫలం ఇదే కనుకైతే అసలు పేరు గురించి ఆలోచించి ఉండేదాన్నే కాదు’’అని కేట్ ఆవేదనగా అన్నారు. ఎప్పుడో పదిహేనేళ్ల వయసులో, తనకన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన నటుడు స్టీఫెన్ ట్రైడర్తో ఆమెకున్న రిలేషన్‌ని కూడా తవ్వి తీసేవారు. నివ్వెరపోయేవారు కేట్. స్టీఫెన్ ఆమె గురువు. ఆమె జీవితంపై అతడి ప్రభావం ఎంతగానో ఉంది. 1997లో స్టీఫెన్ బోన్ క్యాన్సర్‌తో మరణించారు. అతడి అంత్యక్రియలకు వెళ్లేందుకు ఆస్కార్ ఆహ్వానాన్ని కూడా పక్కన పెట్టేశారు కేట్. సరే, ఈ గతమంతా ఎలా ఉన్నా.. ‘అమోనైట్’ కేట్ తాజా చిత్రం. అందులో నాయిక పాత్ర. ఆ పాత్ర ఆస్కార్‌కు నామినేట్ అవొచ్చని, అయితే బాగుండునని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. -
మొసలి దాడిలో విలేకరి మృతి
కొలంబో: శ్రీలంకలో ఓ బ్రిటన్ జర్నలిస్ట్ పాల్ మెక్‌క్లీన్(24) మొసలిదాడిలో మృతి చెందాడు. దేశ రాజధాని కొలంబోకు 360 కిలో మీటర్ల దూరంలోని పనామా గ్రామ శివారులో ఉన్న ఓ బూరదగుంటలో పడి ఉన్నాడు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఆ ప్రాంతంలో ఎక్కువగా మొసళ్లు తిరుగుతుంటాయని అవే దాడి చేసి హతమార్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. యూకేకు చెందిన పాల్ మెక్‌క్లీన్ బ్రిటీష్ మీడియా సంస్థ ఫైనాన్షియల్ టైమ్స్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. అతను తన మిత్రులలతో కలిసి శ్రీలంకలో పర్యటిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.