నేరస్తుల గమ్యం.. లండన్‌ | Financial Criminals Destination is London | Sakshi
Sakshi News home page

నేరస్తుల గమ్యం.. లండన్‌.. 

Published Sun, Jun 17 2018 2:22 AM | Last Updated on Sat, Apr 6 2019 9:07 PM

Financial Criminals Destination is London - Sakshi

ఐపీఎల్‌ క్రికెట్‌ మాజీ సారథి లలిత్‌ మోదీ.. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధిపతి విజయ్‌ మాల్యా.. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ.. వేలకోట్ల రూపాయల కుంభకోణాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు వీరంతా. వీరందరి గమ్యం మాత్రం బ్రిటన్‌ దేశమే. వీరే కాకుండా వివిధ దేశాలకు చెందిన రాజకీయ వేత్తలు, అసమ్మతి నాయకులు, ప్రవాసంలో ఉన్న వారికి, సొంత దేశాల్లో ప్రాణ భయాన్ని ఎదుర్కొంటున్న వారికి బ్రిటన్‌ భద్రంగా తలదాచుకునే గమ్యస్థానంగా నిలుస్తోంది. ఒక్క 2013లో 5,500 మందికి పైగా భారతీయులు బ్రిటన్‌లో రాజకీయ ఆశ్రయం కోరుకున్నారు. వారికి శరణార్థి హోదా లభించడమే కాకుండా అక్కడ ఐదేళ్ల పాటు ఉండేందుకు అనుమతి లభిస్తుంది. 

మానవ హక్కులకు ప్రాధాన్యమెక్కువ 
పటిష్టమైన మానవ హక్కుల పరిరక్షణ చట్టాల కారణంగానే అనేక మంది ఇంగ్లండ్‌లో ఆశ్రయం పొందేందుకు తహతహలాడుతున్నారు. ప్రపంచంలోనే కట్టుదిట్టమైనదిగా బ్రిటన్‌ మానవ హక్కుల సంఘం పేరు గడించింది. మానవ హక్కులకు సంబంధించి ఐరోపా దేశాల ఒప్పందంలో బ్రిటన్‌ భాగస్వామిగా ఉంది. వివిధ దేశాలకు చెందిన రాజకీయవేత్తలు లేదా ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బ్రిటన్‌ నుంచి సొంత దేశానికి తిప్పి పంపిస్తే.. వారికి మరణశిక్ష పడడమో లేదా వారికి చిత్రహింసలు తప్పవనో భావిస్తే అక్కడి కోర్టులు స్వదేశాలకు పంపేందుకు అంగీకరించవు. రాజకీయ కారణాల వల్ల ఎవరినైనా వెనక్కి పంపించాలని ఆయా దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చినా.. తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. 

ఓ పట్టాన తేలదు... 
తీవ్రవాద కార్యకలాపాల్లో పాత్ర కారణంగా 2004లో టైగర్‌ హనీఫ్‌ను.. అదే ఏడాది కుట్ర, చౌర్యం కేసుల్లో షేక్‌ సాదిక్‌ను.. ఫోర్జరీ కేసులో 2009లో రాజ్‌కుమార్‌ పటేల్‌ను.. ఫోర్జరీ, మోసానికి సంబంధించిన కేసుల్లో 2011లో రాజేశ్‌కుమార్‌ను.. లైంగికపరమైన నేరాల విషయంలో 2012లో అతుల్‌సింగ్‌ను.. బ్యాంకింగ్‌ రంగ మోసాలపై 2014లో జతీందర్‌ కుమార్, ఆశారాణి అంగురాల దంపతులను భారత్‌కు తిప్పి పంపాలని మన కేంద్ర ప్రభుత్వం బ్రిటన్‌ను కోరింది. ఈ విజ్ఞప్తులన్నీ కూడా అక్కడి కోర్టుల్లో ఇంకా పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. మోసాలు, అక్రమాలతో దేశానికి ఆర్థికంగా నష్టం కలిగించిన లలిత్‌మోదీ, విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీలను తిప్పి పంపించాలన్న విజ్ఞప్తులపై ఇంకా విచారణ సాగుతూనే ఉంది. 

వెనక్కొచ్చింది ఒక్కరే.. 
వివిధ కేసుల్లోని నిందితులు, దోషులను పరస్పరం అప్పగించుకునేలా 1992లో బ్రిటన్‌–భారత్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు కేవలం సమీర్‌భాయ్‌ వినూభాయ్‌ పటేల్‌ను మాత్రమే బ్రిటన్‌ భారత్‌కు తిప్పి పంపింది. గుజరాత్‌ గోధ్రా ఘటన అనంతరం చోటుచేసుకున్న అల్లర్లలో ప్రమేయముందన్న ఆరోపణలున్న సమీర్‌భాయ్‌ను 2016లో అప్పగించింది. భారత అధికారులు జారీ చేసిన రెడ్‌కార్నర్‌ నోటీసులపై స్పందించి.. లండన్‌లో స్కాట్‌లాండ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక వివిధ కేసుల్లో బ్రిటన్‌ నుంచి పారిపోయి భారత్‌లో తలదాచుకుంటున్న నలుగురిని భారత్‌ తిప్పి పంపించింది. పలు కేసుల్లో నిందితులైన 57 మందిని భారత్‌కు అప్పగించాలంటూ చేసిన విజ్ఞప్తులను (ఒకటి మినహా) బ్రిటన్‌ తోసిపుచ్చింది.

అప్పగింత ప్రక్రియ,ఇబ్బందులివీ.. 
వివిధ కేసుల్లో నిందితులైన వారిని భారత్‌కు తిప్పి పంపించే విషయంలో బ్రిటన్‌ న్యాయవ్యవస్థలోని పలు అంశాలు అడ్డంకిగా మారుతున్నాయి. అక్కడి సంక్లిష్టమైన ప్రక్రియ వల్లనే నిందితులను భారత్‌కు రప్పించడంలో జాప్యం జరుగుతోంది. ఆ అంశాలివీ.. 
- ఫలానా కేసులో ఫలానా వ్యక్తిని తిప్పిపంపాలంటూ భారత్‌ పంపించిన విజ్ఞప్తిని ఆమోదించాలా లేదా అన్నది బ్రిటన్‌ విదేశాంగశాఖ మంత్రి నిర్ణయించాలి. 
- ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆ వ్యక్తి అరెస్ట్‌కు వారంట్‌ జారీ చేయాలా వద్దా అన్న దానిపై అక్కడి కోర్టు నిర్ణయిస్తుంది. తర్వాత సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి అక్కడి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. 
- ముందుగా ప్రాథమిక విచారణ జరుగుతుంది. అనంత రం స్వదేశానికి తిప్పిపంపే అంశంపై విచారణ ఉంటుంది. నిందితుడిని వెనక్కు పంపేందుకు న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే.. దానిపై ఆదేశాలు ఇవ్వాలా వద్దా అన్న దానిపై విదేశాంగ మంత్రి నిర్ణయించాలి. 
- ఫలానా వ్యక్తిని తిప్పి పంపాలంటూ భారత్‌ పంపించిన వారంట్‌లో పేర్కొన్న అంశాలు, చేసిన నేరం స్వదేశానికి పంపించేంత తీవ్రమైనదా కాదా అన్న దానిపై కేసు విచారణ సందర్భంగా జడ్జి సంతృప్తి చెందాలి. 
- నిందితుడిని వెనక్కి పంపించడం సరైనదా కాదా అన్న అంశంపై జడ్జి నిర్ణయం తీసుకోవాలి. 
- తిప్పి పంపించడం వల్ల నిందితుడి మానవ హక్కులకు  భంగం వాటిల్లుతుందా అన్నది జడ్జి పరిశీలిస్తారు 
ఉదాహరణకు ఏదైనా కేసులో ఓ వ్యక్తిని భారత్‌కు పంపించేందుకు విదేశాంగ మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి హైకోర్టులో సవాల్‌ చేయవచ్చు. దానిపై హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించొచ్చు. స్వదేశానికి పంపించే వ్యక్తి మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉందంటే మాత్రం వెనక్కి పంపించేందుకు అంగీకరించరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement