
తప్పు మాట్లాడితే మాట్లాడాను. ఆ తప్పులోని తప్పేమిటో లోకంలో అందరికీ అర్థమై, మీడియా వాళ్లకు మరికాస్త ఎక్కువగా అర్థమై, నాకొక్కడికే అర్థం కాకపోవడం తలనొప్పిగా ఉంది. ‘మీకిది తగునా మిస్టర్ గావస్కర్, మీ అంతటి క్రికెట్ దిగ్గజానికి!!’’ అని కోహ్లీ భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్నపాటి పెద్ద పోస్టు పెట్టింది.
‘నా భర్త సరిగా ఆడకపోతే నన్ను లాగడం ఏంటి?!’ అని ఆమె ప్రశ్న.
నా ఉద్దేశం ఎవరికైతే అర్థం కాకుండా ఉండకూడదో వారికే అర్థం కాకుండా అయింది. ఏ విధంగా అర్థం కాకుండా ఉండకూడదో సరిగ్గా అదే విధంగా అర్థం కాకుండా అయింది.
‘ఆరోజు నేను ఐపీఎల్ కామెంటరీ బాక్సులో ఉన్నాను..’ అనే ప్రారంభ వాక్యంతో నేనివాళ నా తప్పేమిటన్న దానిని తవ్వుకుంటూ పేరాల కొద్దీ ఆలోచనల్లోకి వెళుతున్నాను.
పంజాబ్, బెంగళూరు ఆడుతున్నాయి. కోహ్లీ సింగిల్ రన్ తీసి ఔట్ అయ్యాడు. రెండు క్యాచ్‌లు మిస్ చేశాడు. ఊహు.. వెనకా ముందూ అవుతోంది! రెండు క్యాచ్‌లు మిస్ చేశాడు. సింగిల్ రన్ తీసి ఔట్ అయ్యాడు. నేను కామెంటరీ చెబుతున్నాను. ప్లేయర్స్ ఏం చేశారో అదే చెప్పడానికి కామెంటరీ అక్కర్లేదు. టీవీల్లో అంతా చూస్తూనే ఉంటారు.
ప్లేయర్స్ ఎందుకలా చేసి ఉంటారో కామెంటేటర్స్ ఊహించగలగాలి. నేను ఊహించగలిగాను. ఊహించాక దానిని వినిపించకపోతే ఒకే రన్ తీసిన ప్లేయర్‌కీ నాకూ, రెండు క్యాచ్‌లు మిస్ చేసిన ప్లేయర్‌కీ నాకూ వ్యత్యాసం ఏమిటి!
బాక్సులో నా పక్కన ఆకాశ్ చోప్రా ఉన్నాడు. కో–కామెంటేటర్. ప్లేయర్‌లు ఎవరి ఆట వాళ్లు ఆడే అవకాశం ఉంటుంది. కామెంటేటర్‌లు ఎవరి మాటలు వాళ్లే మాట్లాడుకోడానికి ఉండదు. టీవీ చూస్తున్న వారిని ఉద్దేశించైనా మాట్లాడాలి. లేదంటే పక్కన ఉన్న కో–కామెంటేటర్‌ను ఉద్దేశించైనా మాట్లాడాలి.
‘‘ఏం ఆకాశ్.. కోహ్లీ ఈ లాక్‌డౌన్‌లో భార్య వేసిన బంతులతో మాత్రమే ప్రాక్టీస్ చేసినట్లుగా ఉన్నాడు కదా..’’అన్నాను. ఆకాశ్ అవునన్లేదు. కాదనలేదు. ‘యా..’ అంటూ మా కామెంటేటర్‌లకు మాటను పట్టుకుని కొనసాగే అలవాటు ఉంటుంది. ఆకాశ్ అలా కూడా పట్టుకోలేదు. నా మాటలో నేను ఊహించనిదేదో అతడు ఊహించబట్టే అలా ‘యా..’ అనకుండా ఉండిపోయాడని అర్థం చేసుకుంటుంటే ఇప్పుడు అర్థమౌతోంది!
‘గావస్కర్ డబుల్ మీనింగ్‌లో మాట్లాడాడు’ అని అంతా అంటున్నారు! స్ట్రేంజ్! హిందీలోనూ మాట్లాడగలిగిన గావస్కర్ అనే మరాఠీ కామెంటేటర్ రెండు భాషల్లోనూ మాట్లాడాలని ఒకవేళ ఉత్సాహపడితే పడొచ్చు. రెండు భావాలుగా మాట్లాడాలని తన డైబ్భై ఒక్కేళ్ల వయసులో ఎందుకు ఉబలాటపడతాడు!
‘‘కానీ మీ మాట డబుల్ మీనింగ్‌తోనే ఉంది మిస్టర్ గావస్కర్’’ అంటాడు.. సదుద్దేశాలను మాత్రమే సంగ్రహించేందుకు వచ్చినట్లు వస్తుండే మీడియా మిత్రుడొకరు. మా మధ్య కొంత సంభాషణైనా జరగక ముందే అతడీ డబుల్ మీనింగ్ అనే మాటను అనేక సార్లు నా ముందుకు తెచ్చి, ‘ఏమిటా డబుల్ మీనింగ్?! అని నా చేత అడిగించుకునేందుకు నన్ను సంసిద్ధం చేయబోతున్నట్లుగా నేను గ్రహించాను. నాకు లేని ఉద్దేశాన్ని తెలుసు కునేందుకు నాకెందుకు ఆసక్తి ఉంటుంది?! ఎక్కువసేపు కూర్చోలేక అతడు వెళ్లిపోయాడు.
లాక్‌డౌన్‌లో భార్య బౌలింగ్ చేస్తుంటే తను బ్యాటింగ్ చేస్తున్న వీడియో క్లిప్‌ను ‘ప్రాక్టీస్’ అంటూ కోహ్లీ నెట్‌లో పోస్ట్ చేసినప్పుడు ఎందరో లైక్ చేశారు. ఆ ప్రాక్టీస్ సరిపోయినట్లు లేదని అన్నందుకు నన్ను అందరూ డిస్‌లైక్ చేస్తున్నారు!
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment