డొనాల్డ్ ట్రంప్ రాయని డైరీ
నేను ప్రెసిడెంట్ అయ్యాక, వైట్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ లేడీ.. థెరిసా మే! (డైరీలో ఇలా రాసుకున్నానని తెలిస్తే డెమోక్రాట్లు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుపుతారేమో.. బ్రిటన్ ప్రధానిని అమెరికాకు ఫస్ట్ ఉమన్‌ని చేసేస్తాడా అని!).
ఈస్ట్ రూమ్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో థెరిసా నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. ‘స్టన్నింగ్ ఎలక్షన్ విక్టరీ’ అట నాది. "ఓవ్!" అన్నాను తన హ్యాండ్‌ని గట్టిగా షేక్ చేసి. కానీ ఈ ఆడవాళ్ల మాటల్ని.. వాళ్లు అన్నవి అన్నట్లుగా అర్థం చేసుకోవడం.. నా జీవితంలో తరచూ జరుగుతుండే ఒక పొరపాటు. స్టన్నింగ్ విక్టరీ అంటే తను నమ్మలేకపోతున్న విక్టరీ అని కాదు కదా!
కాన్ఫరెన్స్‌కి ముందు థెరిసాను నేను నా ఆఫీస్ రూమ్‌కి తీసుకెళ్లాను. "ఇన్‌క్రెడిబుల్" అంది థెరిసా.. అక్కడ విన్‌స్టన్ చర్చిల్‌ని చూసి! "స్టాచ్యూ ఆఫ్ సావరినిటీ. నా రూమ్‌ని డెకరేట్ చేసుకోడానికి తెప్పించుకున్నాను మీ చర్చిల్‌ని" అన్నాను. థెరిసా నవ్వింది.
కొలొనేడ్ గుండా నడుచుకుంటూ డైనింగ్ రూమ్‌కి వచ్చాం. దారిలో ఆన్ అండ్ ఆఫ్‌గా చేతులు పట్టుకుని నడిచాం. థాంక్ గాడ్ బ్రిటన్ ప్రధానిగా ఒక మగవాడు ఎలక్ట్ కాలేదు. నా రాజనీతిజ్ఞత థెరిసా స్పర్శలోని మృదుత్వాన్ని అనుభూతి చెందుతోంది. దేవుడికి మరోసారి ధన్యవాదాలు. అమెరికా ప్రెసిడెంట్లు ఆడవాళ్ల గురించి ఇలా ఆలోచించకూడదనే రాజ్యాంగ నిబంధన ఏమీ లేకపోవడం మంచిదైంది.
లంచ్‌కి కూర్చున్నాం. థెరిసాకు ఇష్టమైన ఐస్‌బర్గ్ వెడ్జ్ సలాడ్, థెరిసాకు ఇష్టమైన బ్రెయిజ్‌డ్ బీఫ్ షార్ట్ రిబ్స్, థెరిసాకు ఇష్టమైన పొటాటో ప్యూరీ, థెరిసాకు ఇష్టమైన క్రెమ్ క్యారామెల్ బ్రూలీ! "అన్నీ మీ కోసమే యువర్ మెజెస్టీ" అని చెప్పాను. థెరిసా నవ్వింది. "నేను బ్రిటన్ మహారాణిని కాదు" అంది.
"ఐ లవ్ యువర్ స్మైల్ అన్నాను".
"బ్రిటన్‌లో అంతా ఇలాగే నవ్వుతారు" అంది థెరిసా.
"ఐ లవ్ బ్రిటన్" అన్నాను.
"వై?" అన్నట్లు చూసింది.
"మా అమ్మ స్టోర్నవేలో పుట్టింది. స్టోర్నవే ఈజ్ ఎ సీరియస్ స్కాట్లాండ్. స్కాట్లాండ్ మీ గ్రేట్ బ్రిటన్ లోనిదే కదా! అందుకే బ్రిటన్ అంటే నాకు ఇష్టం" అన్నాను. "ఐ యామ్ ఇంప్రెస్డ్" అంది థెరిసా.
"మీరింకా ఎవరెవర్ని ప్రేమిస్తారో చెప్పండి మిస్టర్ ట్రంప్" అని "మీరు అడుగుతారని ఆశించాను రెస్పెక్టెడ్ ఉమన్ ప్రైమ్ మినిస్టర్" అన్నాను.
"కమ్మాన్ ట్రంప్.. మీ నుంచి ఇక నేనేమీ వినదలచుకోలేదు" అంది థెరిసా, పెదవులకు అంటిన క్యారామెల్ క్రెమ్‌ని తుడుచుకుంటూ.
థెరిసా పెదవుల నుండి మిస్టర్ ట్రంప్ అని కాకుండా, ట్రంప్ అని వినడం బాగుంది. గౌరవాలు తగిలించని సంబోధనలంటే నాకు గౌరవం. ఐ లవ్ టు బి డిస్‌రెస్పెక్టెడ్ బై ఉమెన్.
-మాధవ్ శింగరాజు