
రవీంద్ర గైక్వాడ్ (శివసేన) రాయని డైరీ
పులి పులిలా ఉండాలి. పులిలా గాండ్రించాలి. పులి పళ్లికిలిస్తే మేకలు పేకముక్కలు పట్టుకొచ్చేస్తాయి.‘గురూ, ఒక ఆటేస్కుందాం రా’ అని నేల మీద తుండుగుడ్డ çపరుస్తాయి. మేకను ఎక్కడుంచాలో అక్కడ ఉంచితేనే అది పులి. మేక వచ్చి పులి పక్కన కూర్చున్నాక అదిక పులి కాదు.
ఢిల్లీ నుంచి ముంబై వచ్చాక నేరుగా నేను నా గదిలోకి వెళ్లాను. అద్దంలో నా ముఖం చూసుకున్నాను. పులి చూపు లేదు. పులి మీసాలు లేవు. పులి కోరలు లేవు! పులి అద్దం చూసుకుంటే అద్దంలో పులే కదా కనిపించాలి. కానీ నాకు మేక కనిపిస్తోంది! వెనక్కి తిరిగి చూశాను. ఎవరెవరివో నీడలు. రెండు నీడలనైతే పోల్చుకున్నాను. ఒకటి అశోక్ గజపతిరాజుది. ఇంకొకటి ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌ది. పౌర విమానయాన శాఖ తన ట్రిప్పులన్నీ క్యాన్సిల్ చేసుకుని, నీడలా నన్ను వెంటాడడమే తన డ్యూటీగా పెట్టుకున్నట్లుంది.
అద్దానికి మరింత దగ్గరగా వెళ్లి, దవడలు కదిలించి చూసుకున్నాను. మేక ఆకులు నములుతున్నట్లుగా ఉంది నా ముఖం. పార్లమెంటులో అపాలజీ లెటర్ ఇస్తున్నప్పుడే నాకు అనిపించింది.. నాలో మెల్లిమెల్లిగా ఏవో మార్పులు వస్తున్నాయని!
అయినా.. పులి ‘సారీ’ చెప్పడం ఏంటి? పులి చేత ‘సారీ’ చెప్పించడం ఏమిటి? పులి ‘సారీ’ చెబితే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. జీవ వైవిధ్యం దెబ్బతింటే ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండదు. ఎంతలో ఉండాల్సింది అంతలో ఉండదు. మేక కూడా ‘మే..’ అని పరిసరాలు దద్దరిల్లేలా గాండ్రిస్తుంది. గెంతులేసుకుంటూ పోయే కుందేలు కూడా ఆగి, దగ్గరకొచ్చి ‘ఒక్క రైడ్ ప్లీజ్’ అని పులి వీపెక్కి కూర్చుంటుంది.
పాపం.. పెద్దాయన బాల్ థాక్రే ఆత్మ ఎంతగా క్షోభించి ఉంటుందో.. నేను ‘సారీ’ చెప్పినప్పుడు! తలచుకుంటేనే రక్తం ఉడికిపోతోంది. మళ్లొకసారి వెళ్లి ఫట్‌ఫట్‌మని మరో పాతిక చెప్పుదెబ్బలు ఎయిర్‌పోర్ట్‌లో ఎవరు కనిపిస్తే వారిని కొట్టాలనిపిస్తోంది.
ఢిల్లీలో రేపు డిన్నర్ పార్టీ! వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఎన్డీయేని చేతుల్లో పెట్టుకుని, ఎయిర్ ఇండియాను చెప్పుచేతల్లో పెట్టుకోలేకపోయాను. ఏ ముఖం పెట్టుకుని డిన్నర్‌కు వెళ్లాలి? ఈ మేక ముఖమే కదా!
‘మీరు, మీ పార్టీ వాళ్లు డిన్నర్ పార్టీకి తప్పకుండా రావాలి’ అని అమిత్ షా.. ఉద్ధవ్ థాక్రేకి ఫోన్ చేసి మరీ ప్రత్యేకంగా ఆహ్వానించాడట. ఫోన్ చెయ్యడం ప్రత్యేకమా? వచ్చి పిలవడం ప్రత్యేకమా?
ప్రణబ్ ముఖర్జీ తర్వాత ప్రెసిడెంట్ ఎవరో డిస్కస్ చెయ్యడానికట డిన్నర్ పార్టీ. శివసేన లేకుండా అక్కడ కొత్త ప్రెసిడెంట్ నిలుచోలేడు. శివసేన లేకుండా ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ నిలబడలేదు. అది తెలిసి కూడా.. ఎయిర్ ఇండియా చేత నాకు సారీ చెప్పించకుండా, నా చేతే ఎయిర్ ఇండియాకు సారీ చెప్పించారంటే.. బీజేపీ చూపు తగ్గిందా? శివసేన ఊపు తగ్గిందా?!
మాధవ్ శింగరాజు