రాయని డైరీ.. మమతాబెనర్జీ (సీఎం) | Madhav Singaraju Article On Mamata Banerjee | Sakshi
Sakshi News home page

రాయని డైరీ.. మమతాబెనర్జీ (సీఎం)

Published Sun, Jun 16 2019 12:22 AM | Last Updated on Sun, Jun 16 2019 12:22 AM

Madhav Singaraju Article On Mamata Banerjee - Sakshi

ఏ పార్టీ అయినా తను అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని మాత్రమే పరిపాలిస్తుంది. బీజేపీ అలాక్కాదు. తను అధికారంలో లేని రాష్ట్రాలను కూడా పాలిస్తుంటుంది. ఆ రాష్ట్రాలకూ ఒక చీఫ్‌ మినిస్టర్‌ ఉంటారని మొహమాటానికి కూడా అనుకోదు. 

కోల్‌కతాలో వారం రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. రేపట్నుంచి దేశంలోని మిగతా రాష్ట్రాల డాక్టర్లు కూడా వీళ్లకు సపోర్ట్‌గా మెడలో స్టెతస్కోప్‌ వేసుకుని వీధుల్లోకి రాబోతున్నారని చంద్రిమా భట్టాచార్య వచ్చి చెప్పారు. 

‘‘మెడలో స్టెత్‌ ఉన్నవాళ్లు ఆసుపత్రుల్లో ఉండాలి కానీ, ఆసుపత్రుల బయట వాళ్లకేం పని చంద్రిమా! సమ్మెను సపోర్ట్‌ చెయ్యడానికి వస్తున్న బీజేపీ లీడర్‌ల కోసం ఆరుబయట వైద్య శిబిరాలను గానీ ఏర్పాటు చేస్తున్నారా? బీపీ మిషన్‌లను కూడా తీసుకెళ్లమని చెప్పవలసింది’’ అన్నాను.

‘‘వినేలా లేరు దీదీ. అప్పటికీ నేను అడిగాను. ‘చనిపోయిన రోగి బంధువులెవరో డాక్టర్‌ల మీద దాడి చేశారని ఆ కోపంతో వైద్యం కోసం వస్తున్న రోగుల్ని చంపేస్తామా?’ అని. ‘అలా చేస్తే ఇక రోగి బంధువుల కోపానికీ, రోగికి బంధువులుగా ఉండాల్సిన డాక్టర్‌ల కోపానికీ తేడా ఏముంటుంది?’ అని అన్నాను’’ అన్నారు చంద్రిమ. 

‘‘ఏమంటారు ఆ మాటకు?’’ అన్నాను. 

‘‘వాళ్లకు గానీ, నాకు గానీ ఏమాత్రం సంబంధంలేని ఒక మాట అన్నారు దీదీ. అది వాళ్లు అనవలసిన మాట గానీ, అది నేను నా మనసులోనైనా అనుకోవలసిన మాట గానీ కాదు’’ అన్నారు చంద్రిమ!

‘‘చెప్పండి, పర్వాలేదు’’ అన్నాను.

‘‘ఆరోగ్యశాఖకు సహాయ మంత్రిగా కాదు, సంపూర్ణ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చి చెప్పండి. అంతవరకు మీరు మాకేం చెప్పినా, అది మీకు మమతా బెనర్జీ చెప్పి పంపినట్లుగానే మేము భావిస్తాం’ అన్నారు దీదీ’’ అన్నారు చంద్రిమ.

బీజేపీ పాలన చంద్రిమ వరకు వచ్చిందని నాకు అర్థమైంది. ముఖ్యమంత్రికి ఆల్రెడీ ముఖ్యమంత్రి పోస్ట్‌ ఉన్నప్పుడు హెల్త్‌ మినిస్టర్‌ పోస్టు కూడా ఎందుకన్న ఆలోచన చంద్రిమలో కలిగిస్తున్నారంటే బీజేపీవాళ్లు కోల్‌కతా వరకు వచ్చేసినట్లే. హౌరా స్టేషన్‌లో దిగితే అక్కడి నుంచి సెక్రటేరియట్‌కి మూడే నిమిషాలు!

ఇప్పటికే నా మేనల్లుడు వెళ్లి డాక్టర్‌ల మధ్య కూర్చొని ప్లకార్ట్‌ పట్టుకున్నాడు. ‘యు సే వియ్‌ ఆర్‌ గాడ్స్‌. వై ట్రీట్‌ అజ్‌ లైక్‌ డాగ్స్‌’ అని అడుగుతున్నాడు! మోదీకి ఐడియా వచ్చినట్లు లేదు. లేకుంటే ఇవే మాటల్ని నా మేనల్లుడి చేత నాన్‌ బెంగాలీ భాషలో అడిగించేవారు.

మతమార్పిడిలా బెంగాలీలను నాన్‌ బెంగాలీలుగా మార్చే టీమ్‌ ఒకటి ఢిల్లీ నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్‌లో తిరుగుతోంది. 

సమ్మె చేస్తున్నవాళ్లలో బెంగాలీలు ఎంత మంది ఉన్నారని చంద్రిమను అడిగాను. ‘ఒకరిద్దరు ఉన్నట్లున్నారు దీదీ’ అన్నారు. హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కి ఫోన్‌ చేసి అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీని అడిగాను. ‘ఒకరా ఇద్దరా అన్నది లెక్క తేలడం లేదు మేడమ్‌’ అన్నారు. పోలీస్‌ కమిషనర్‌కి ఫోన్‌ చేశాను. ‘ఒకరా ఇద్దరా అన్నది లెక్క తేలుస్తున్నాం మేడమ్‌’ అన్నారు. 

‘‘తేల్చేయండి త్వరగా’’ అన్నాను. 

వెంటనే కేసరినాథ్‌ త్రిపాఠి నుంచి ఫోను! ‘‘నా రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఒక గవర్నరుగా నేను తెలుసుకోవచ్చా మమతాజీ’’ అంటున్నారు! 

ఆ వెంటనే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి! ‘‘మమతాజీ నేను హర్షవర్థన్‌. డాక్టర్‌ల సమ్మెను మేము జోక్యం చేసుకుని ఆపించే అవసరాన్ని మీరు మాకు కలగనివ్వరనే ఆశిస్తున్నాను’’ అన్నారు!

ఫోన్‌ పెట్టేయగానే, హైకోర్టు నుంచి ఆదేశం.. డాక్టర్‌లకు నచ్చజెప్పి, తిరిగి విధుల్లోకి పంపమని! 

బీజేపీని ఇలాగే వదిలేస్తే బెంగాల్‌లో ఒక్క బెంగాలీ మిగలరు. మిగిలినా ఆ ఒక్క బెంగాలీ కూడా బెంగాలీ భాష మాట్లాడరు. 

-మాధవ్‌ శింగరాజు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement