ఎల్లుండి స్పేస్ కేప్సూల్ తొలి మానవసహిత యాత్ర
మూడోసారి అంతరిక్ష కేంద్రానికి సునీతా విలియమ్స్
అమెరికన్ స్పేస్ షటిల్స్... ముప్పై ఏళ్లు కొనసాగిన వీటి శకం 2011లో ముగిసింది. 1960ల నాటి సోవియట్ ‘సోయజ్’ కేప్సూల్... పాతపడిన, ఇరుకైన ఓ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి ఆధునిక మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో కాలం నెట్టుకొస్తున్నా అది కూడా నిష్క్రమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేశాక... రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లు అమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడపడాన్ని చూశాక... చెప్పేదేముంది? అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, రోదసి పరిశోధన, భావి చంద్ర-అంగారక యాత్రలు... అన్నీ ప్రైవేటైజేషనే!
కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తోకూస్తో నిధులు... వీటికే ప్రభుత్వరంగ పాత్ర పరిమితమవుతోంది. పెట్టుబడి, పరిశోధన, లాంచింగ్స్ పరంగా రోదసిని ఇకపై ప్రైవేటు రంగమే ఏలబోతోంది. అంతరిక్షాన్ని అందుకోవడానికి రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు సిద్ధమయ్యాయి. ఇవి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లే అంతరిక్ష నౌకలు (స్పేస్ కేప్సూల్స్).
‘ఎక్స్’ (ట్విట్టర్) బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ వ్యోమగాములు, సరుకుల్ని చేరవేస్తోంది. ప్రపంచ అతిపెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ వ్యోమనౌకతో ఈ నెల 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో ప్రధాన విశేషం.
మన సునీత హ్యాట్రిక్!
ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్... ముద్దుపేరు సునీ... 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతోంది. అమెరికన్ నేవీ కెప్టెన్ (రిటైర్డ్) అయిన సునీతకు అనుభవమే మనోబలం. నాసా ఆమెను 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్య (ముంబాయి) కాగా, తల్లి స్లోవేన్-అమెరికన్ అర్సలిన్ బోనీ. అమెరికాలో 1965లో సునీత జన్మించారు.
యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్-5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ కంపెనీ వ్యోమనౌక ‘స్టార్ లైనర్’లో ఈ నెల 6న రాత్రి 10:34 గంటలకు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04 గంటలకు) ఫ్లోరిడాలోని కేప్ కెవెవరాల్ నుంచి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలో వారం రోజులు గడిపి భూమికి తిరిగొస్తారు.
2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత 2007 జూన్ 22 వరకు రోదసిలో గడిపారు. ఆ సందర్భంగా మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. 2008లో మరో మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఐదు సార్లు స్పేస్ వాక్ చేసి సునీత రికార్డును బద్దలుకొట్టారు. తర్వాత సునీత రెండోసారి 2012 జులై 14 నుంచి 2012 నవంబరు 18 వరకు 127 రోజులపాటు ఐఎస్ఎస్‌లో ఉండి ప్రయోగాలు నిర్వహించారు.
జపాన్ వ్యోమగామి అకిహికో హోషిడేతో కలసి ఆమె మూడు స్పేస్ వాక్స్ చేశారు. అంతరిక్ష కేంద్రం సౌర ఫలకాల నుంచి ఐఎస్ఎస్ వ్యవస్థలకు పవర్ సరఫరా చేసే ఓ విడిభాగం పాడైపోగా దాన్ని తొలగించి కొత్తదాన్ని అమర్చారు. అలాగే ఐఎస్ఎస్ రేడియటర్ అమ్మోనియా లీకేజిని సరిచేశారు. ఈ రెండు మిషన్లలో సునీత 322 రోజులు రోదసిలో గడిపారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ 10 సార్లు స్పేస్ వాక్స్ చేసి మరోమారు సునీత రికార్డును అధిగమించారు.
ఎట్టకేలకు బోయింగ్... గోయింగ్!
రాకెట్లు అనేవి వాహకనౌకలు. అవి వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళ్లి వదిలివేస్తాయి. అక్కడి నుంచి వారు గమ్యం చేరుకోవడానికి వ్యోమనౌక (స్పేస్ షిప్/ స్పేస్ కేప్సూల్)లో ప్రయాణించాల్సిందే. అమెరికన్ స్పేస్ షటిల్స్ నేరుగా ఐఎస్ఎస్ కు వెళ్లి వచ్చేవి. ఆ ఫ్లీట్ కనుమరుగైంది. ఐఎస్ఎస్ యాత్రల కోసం నాసా మార్గాంతరం లేక తమ సోయజ్ రాకెట్-వ్యోమనౌకల శ్రేణిపై ఆధారపడటంతో రష్యా గట్టిగా డబ్బులు పిండటం మొదలెట్టింది. ఒక్కో సీటుకు రేటు పెంచేసింది. అమెరికన్ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పట్టుకెళ్లి తిరిగి తీసుకురావడానికి ఒక్కొక్కరికి రూ.700 కోట్లు చొప్పున రష్యా వసూలు చేస్తోంది.
దీంతో నాసా తమ ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’లో భాగంగా వ్యోమనౌకలను అభివృద్ధి చేసే కాంట్రాక్టుల్ని 2014లో రెండు సంస్థలకు కట్టబెట్టింది. ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ స్పేస్ కేప్సూల్ డిజైనింగ్, అభివృద్ధి కోసం బోయింగ్ సంస్థ 4.2 బిలియన్ డాలర్ల (రూ.35 వేల కోట్లు) కాంట్రాక్టు, ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్ ఆవిష్కరణ కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టు పొందాయి. 2020 నుంచే స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’లో వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళుతోంది. బోయింగ్ తన ‘సీఎస్టీ-100 (క్రూ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్-100) స్టార్ లైనర్’ పరీక్షల్లో వెనుకబడింది. 2
019లో మానవరహిత ఆర్బిటాల్ ఫ్లైట్ టెస్టు (ఓఎఫ్టీ-1) సందర్భంగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాఫ్టువేర్ సమస్య తలెత్తింది. దాంతో అంతరిక్ష కేంద్రానికి నౌక అనుసంధానం కాకుండానే వెనుదిరిగి అతి కష్టంమీద భూమికి తిరిగొచ్చింది. 2022లో అది మానవరహిత ఓఎఫ్టీ-2లో విజయవంతమైంది.
తాజాగా ఈ నెల 6న ‘స్టార్ లైనర్’ తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, ‘స్టార్ లైనర్’ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదం కాగానే... అంతరిక్ష మానవసహిత యాత్రలకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను నాసా ఆరంభిస్తుంది. అలా ‘స్టార్ లైనర్’కు లైసెన్స్ లభిస్తుంది.
ఏడుగురు వెళ్లి రావచ్చు!
‘స్టార్ లైనర్’లో ఏడుగురు వ్యోమగాములు రోదసికి వెళ్ళి రావచ్చు. వీరి సంఖ్యను తగ్గించుకునే పక్షంలో సరకులను తరలించవచ్చు. ‘స్టార్ లైనర్’ లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఉంటాయి. గత అమెరికన్ స్పేస్ కేప్సూల్స్ మాదిరిగా ఇది సముద్రంలో దిగదు. పైన పారాచూట్లు, కింద ఎయిర్ బ్యాగుల సాయంతో నేల మీదనే దిగుతుంది.
అపోలో కమాండ్ మాడ్యూల్, స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’ కంటే సైజులో ‘స్టార్ లైనర్’ పెద్దది. ఇది ఐఎస్ఎస్ కు అనుసంధానమై ఏడు నెలల పాటు కక్ష్యలో ఉండగలదు. ‘స్టార్ లైనర్’ పునర్వినియోగ స్పేస్ కేప్సూల్. ఒక కేప్సూల్ పది మిషన్ల దాకా పనికొస్తుంది. నాసా తమ వ్యోమగాముల యాత్రల కోసం ఒక్కో సీటుకు స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’లో అయితే రూ.450 కోట్లు, బోయింగ్ ‘స్టార్ లైనర్’లో అయితే రూ.700 కోట్లు కుమ్మరించి కొనుక్కోవాల్సిందే!
- జమ్ముల శ్రీకాంత్
(Courtesy: The Boeing Company, NASA, The New York Times, The Washington Post, BBC, Reuters, Space.com, SciTechDaily, ars TECHNICA, PHYS.ORG, Forbes, Popular Science, Scientific American, Hindustan Times, The Indian Express, ND TV, India TV News, Business Today, The Economic Times, News 18, mint, Business Standard, First Post, Times Now)
Comments
Please login to add a commentAdd a comment