బొద్దింక స్ఫూర్తితో రోబో తయారీ!
బొద్దింకలు.. ఎంత చిన్న సందు దొరికినా ఇట్టే దూరిపోతాయి. వాటి స్ఫూర్తితో అమెరికా శాస్త్రవేత్తలు కొత్త రకం రోబోలను తయారుచేశారు. భూకంపాలు, టోర్నడోలు లేదా పేలుళ్ల సమయంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు అత్యంత చిన్న పరిమాణంలో ఉండే ఈ రోబోలు ఉపయోగపడతాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కిలీ వాళ్లు కనుగొన్న ఈ కొత్త టెక్నాలజీని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ఆవిష్కరించారు.
0.6 సెంటీమీటర్ల స్థలం మాత్రమే ఉన్నా అందులోంచి కూడా బొద్దింకలు శరవేగంగా వెళ్లగలవని, అంఉదకోసం తమ కాళ్లను పూర్తిగా లోపలకు, బయటకు అవి మార్చుకోగలవని పరిశోధనకు నేతృత్వం వహించిన హార్వర్డ్ యూనివర్సిటీ పోస్ట్ డాక్టరల్ ఫెలో కౌశిక్ జయరామ్ చెప్పారు. అవి మామూలుగా కదిలినప్పుడు అర అంగుళం పొడవు ఉంటాయని, కానీ అవసరాన్ని బట్టి అవి అంగుళంలో పదోవంతుకు తమ శరీరాలను కుదించుకోగలవని తెలిపారు.
వీటి స్ఫూర్తితో రూపొందించిన 'క్రామ్' అనే రోబోకు ప్లాస్టిక్ షీల్డు ఒకటి ఉంటుంది. అది అచ్చం బొద్దింక వీపుమీద ఉండే రెక్కల్లా కనిపిస్తుంది. భూకంపాలు వస్తే అక్కడ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమోననే ఆందోళన ఎక్కువగా ఉంటుందని, ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ తరహా రోబోలు ఉపయోగపడతాయని రాబర్ట్ ఫల్ అనే ప్రొఫెసర్ చెప్పారు. అమెరికా ఆర్మీ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఈ పరిశోధనకు నిధులు సమకూర్చింది.