నాసాలో భారతీయ శాస్త్రవేత్తకు అవమానం | Indian-Origin NASA Scientist Detained By US Officials, Forced To Unlock Phone | Sakshi
Sakshi News home page

నాసాలో భారతీయ శాస్త్రవేత్తకు అవమానం

Published Wed, Feb 15 2017 10:34 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

నాసాలో భారతీయ శాస్త్రవేత్తకు అవమానం

నాసాలో భారతీయ శాస్త్రవేత్తకు అవమానం

నాసాలో పనిచేస్తున్న భారత సంతతి శాస్త్రవేత్తను అమెరికా కస్టమ్స్ అధికారులు అవమానించారు. ఆయనను అదుపులోకి తీసుకుని, బలవంతంగా ఫోన్ అన్‌లాక్ చేయించారు. సిద్ బిక్కన్నవార్ (35) ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హ్యూస్టన్‌లోని జార్జ్ బుష్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తాను వెళ్లినప్పుడు అక్కడి కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు తన సెల్‌ఫోన్ పాస్‌వర్డ్ అడిగారని, అది చెబితేనే వెళ్లనిస్తామన్నారని అన్నారు. తాను గత వారం అమెరికాకు తిరిగి వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని, ముస్లింలను నిషేధిస్తున్నప్పుడు అందులో భాగంగానే తనను కూడా నిర్బంధించారని ఆయన ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు. తొలుత తాను పాస్‌వర్డ్ ఇవ్వనన్నానని, అది నాసా వాళ్లు ఇచ్చిన ఫోన్ కాబట్టి అందులో ఏమున్నాయో అందరికీ చెప్పడం కుదరదని వివరించానని ఆయన తెలిపారు. 
 
నాసాలో పనిచేస్తున్న బిక్కన్నవార్ అక్కడ భారీ స్పేస్ టెలిస్కోపులకు కావల్సిన టెక్నాలజీని డిజైన్ చేస్తారు. తాను అమెరికాలో పుట్టిన పౌరుడినని, నాసాలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని, తనవద్ద అమెరికా పాస్‌పోర్టు ఉందని చెప్పినా, వాళ్లు మాత్రం తన ఫోన్ లాగేసుకున్నారని, అందులో ఉన్న డేటా మొత్తం కాపీ చేసుకున్న తర్వాతే తనకు ఫోన్ ఇచ్చి వెళ్లనిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సోలార్ కార్ల రేసింగులో పాల్గొనడం తన హాబీ కావడంతో దాని కోసం ఆయన కొన్నాళ్ల పాటు సెలవులో వెళ్లారు. పైగా ఆయన ఇమ్మిగ్రేషన్ బ్యాన్ ఉన్న దేశాలు వేటికీ కూడా ఎప్పుడూ వెళ్లలేదు. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత తన అధికారులు కూడా తన ఫోన్ చెక్ చేస్తున్నారని, అందులో కస్టమ్స్ వాళ్లు ఏవైనా ఇన్‌స్టాల్ చేశారేమో పరీక్షిస్తున్నారని తెలిపారు. దీనిపై నాసా అధికారులు మాత్రం ఇంకా స్పందించలేదు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement