అంగారకుడిపై నీటికి కొత్త ఆధారాలు..
వాషింగ్టన్: అరుణగ్రహంపై గేల్ క్రేటర్‌లో 300 కోట్ల ఏళ్ల క్రితం ఇలా ఓ భారీ సరస్సు ఉండేదట. కాలక్రమంలో సరస్సులోకి నీరు పదేపదే ప్రవహించడం, బలమైన గాలుల వల్ల ఇసుక, మట్టి, బురద పొరలుపొరలుగా పేరుకుంటూ పోయి చివరకు శిలలు, గుట్టలుగా రూపాంతరం చెందాయని, 154 కి.మీ. వైశాల్యంలో ఉన్న గేల్ క్రేటర్‌లోని 5 కి.మీ. ఎత్తయిన మౌంట్ షార్ప్ పర్వతం అలాగే ఏర్పడి ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.
మౌం ట్‌షార్ప్ పర్వతంపైకి ప్రయాణిస్తూ.. ఆ పర్వత పాదం వద్ద శిలలను పరిశీలిస్తున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ తీసిన ఫొటోల ఆధారంగా తాము అధ్యయనం చేయగా.. ఈ విషయం వెల్లడైందని భారతీయ అమెరికన్, క్యూరియాసిటీ ప్రాజెక్టు డిప్యూటీ శాస్త్రవేత్త అశ్విన్ వాసవదా వెల్లడించారు. మార్స్‌పై ఒకప్పుడు సూక్ష్మజీవులకు అనుకూల వాతావరణం, సరస్సులు ఉండేవనడానికి ఇవి మరిన్ని రుజువులు అని పేర్కొన్నారు. మౌంట్ షార్ప్ వద్ద ఇసుకరాతి పొరలను చూస్తే.. పురాతన కాలంలో అక్కడ నీటి ప్రవాహాల వల్ల ఒకదానిపై ఒకటి డెల్టా పొరలు ఏర్పడినట్లు తెలుస్తోందన్నారు. ఈ పరిశోధనలో లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త సంజీవ్ గుప్తా కూడా పాల్గొన్నారు.