water sources
-
SOFIA telescope: గ్రహశకలాలపై నీటి జాడలు
గ్రహశకలాలు పూర్తిగా పొడి శిలలతో కూడుకుని ఉంటాయని ఇప్పటిదాకా సైంటిస్టులు భావించేవారు. కానీ అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా వాటిపై నీటి అణువుల జాడలను గుర్తించారు! సోఫియా (స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రా రెడ్ ఆ్రస్టానమీ ఎయిర్‌బోర్న్ టెలిస్కోప్) టెలిస్కోప్ అందించిన డేటాను అధ్యయనం చేసిన మీదట వారు ఈ మేరకు ధ్రువీకరణకు వచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో సోమవారం ప్రచురితమయ్యాయి. ఇలా చేశారు... గ్రహశకలాలపై నీటిజాడను కనిపెట్టేందుకు సైంటిస్టులు పెద్ద ప్రయాసే పడాల్సి వచి్చంది... ► ముందుగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలను దాదాపుగా పూర్తిగా అడ్డుకునే భూ వాతావరణానికి ఎగువన ఉండే స్ట్రాటోస్పియర్ను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ► అవసరమైన మార్పుచేర్పులు చేసిన బోయింట్ 747ఎస్పీ విమానంలో స్ట్రాటోస్పియర్ గుండా సోఫియా టెలిస్కోప్‌ను సుదీర్ఘకాలం ప్రాటు పయణింపజేశారు. ► ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. ఐరిస్, మస్సాలియా అనే గ్రహశకలాలపై నీటి అణువుల జాడను సోఫియా తాలూకు ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా (ఫోర్కాస్ట్) స్పష్టంగా పట్టిచ్చింది! ► సోఫియా కెమెరా కంటికి చిక్కిన నీటి పరిమాణం కనీసం 350 మిల్లీలీటర్ల దాకా ఉంటుందని అధ్యయన బృందం నిర్ధారించింది. ► ఈ గ్రహశకలాలు సూర్యుడి నుంచి ఏకంగా 22.3 కోట్ల మైళ్ల దూరంలో గురు, బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్‌లో ఉన్నాయి. ► ఈ ఉత్సాహంతో సోఫియా కంటే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మరో 30 గ్రహశకలాలపై నీటి జాడలను మరింత స్పష్టంగా కనిపెట్టే పనిలో నాసా సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. జాబిలిపై నీటి జాడలే స్ఫూర్తి... గతంలో చంద్రునిపై నీటి జాడలను కనిపెట్టింది కూడా సోఫియానే! ఆ స్ఫూర్తితోనే అదే టెలిస్కోప్ సాయంతో గ్రహశకలాలపైనా నీటి జాడల అన్వేషణకు పూనుకున్నారు. నిజానికి ఈ అధ్యయనానికి సహ సారథ్యం వహించిన నాసా సైంటిస్టు డాక్టర్ మాగీ మెక్ ఆడమ్ ఈ గ్రహశకలాలపై గతంలోనే ఆర్ర్దీకరణ(హైడ్రేషన్) జాడలను కనిపెట్టారు. కానీ దానికి కారణం నీరేనా, లేక హైడ్రోక్సిల్ వంటి ఇతర అణువులా అన్నదానిపై మాత్రం స్పష్టతకు రాలేకపోయారు. ఆ అనుమానాలకు తాజా అధ్యయనం తెర దించిందని దానికి సారథిగా వ్యవహరించిన రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ అనీసియా అరెడొండో తెలిపారు. ‘‘నిజానికి డాక్టర్ మెక్ ఆడమ్ తన పరిశోధనకు ఎంచుకున్న ఈ రెండు గ్రహశకలాలు పూర్తిగా సిలికేట్మయం. కనుక అవి పూర్తిగా పొడిబారినవే అయ్యుంటాయని తొలుత అనుకున్నాం. కానీ వాటిపై కనిపించింది నీరేనని మా పరిశోధనల్లో స్పష్టంగా తేలింది’’ అని వివరించారు. 2020లో చంద్రుని దక్షిణార్ధ గోళంలో నీటి జాడలను సోఫియా నిర్ధారించింది. ఏమిటీ గ్రహశకలాలు... ఒక్కమాటలో చెప్పాలంటే మన సౌర వ్యవస్థ రూపొందే క్రమంలో మిగిలిపోయిన అవశేషాలు. ఒకరకంగా సూర్యుడు, తన నుంచి నిర్ధారిత దూరాల్లో గ్రహాలు ఒక్కొక్కటిగా రూపొందే క్రమంలో మిగిలి విడిపోయిన వ్యర్థాల బాపతువన్నమాట. సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో సూర్యుడికి కాస్త దూరంలో ఉన్న భూమి వంటి గ్రహాలు రాళ్లు తదితరాలకు ఆలవాలంగా మారితే సుదూరంలో ఉన్న యురేనస్, నెప్ట్యూన్ వంటివి నింపాదిగా చల్లబడి మంచు, వాయుమయ గ్రహాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చాయట. గ్రహశకలాలు కోట్లాది ఏళ్ల క్రితం భూమిని విపరీతమైన వేగంతో ఢీకొన్న ఫలితంగానే మన గ్రహంపై నీరు ఇతర కీలక మూలకాలు పుట్టుకొచ్చాయని సైంటిస్టులు చాలాకాలం క్రితమే సిద్ధాంతీకరించారు. గ్రహశకలాలపై నీటి అణువుల ఉనికి దానికి బలం చేకూర్చేదేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రహశకలాల పరమాణు కూర్పును మరింత లోతుగా పరిశోధిస్తే అంతరిక్షంలో వీటి జన్మస్థానంపై ఇంకాస్త కచి్చతమైన నిర్ధారణకు రావచ్చన్నది సైంటిస్టుల భావన. అది అంతరిక్షంలో ఇతర చోట్ల నీరు తదితర కీలక మూలకాలతో పాటు జీవం ఉనికి కోసం చిరకాలంగా చేస్తున్న పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడగలదని వారంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవిగవిగో నీటి జాడలు.. చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్ తయారీ
జీవుల మనుగడకు కావాల్సింది జలం. భూమిపై జలం ఉంది కాబట్టి మానవులతో సహా లక్షల సంఖ్యలో జీవులు ఆవిర్భవించాయి. నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడిపైనా నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే పరిశోధకులు గుర్తించారు. ఈ నీటి ఆనవాళ్లకు సంబంధించిన సవివరమైన పటాన్ని(మ్యాప్)ను తాజాగా రూపొందించారు. దీనివల్ల చందమామ ఉపరితలం, అక్కడ మానవుల జీవనానికి అందుబాటులో ఉన్న పరిస్థితుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘ఆర్టిమిస్’పేరిట కీలకమైన ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో చందమామపైకి మనుషులను పంపించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై నీటి మ్యాప్‌ను తయారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు చంద్రునిపై.. అటు అంగారకుడిపై.. ► అమెరికా, జర్మనీ సంయుక్తంగా ప్రయోగించిన స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ అస్ట్రానమీ(సోఫియా) అనే అంతరిక్ష నౌక పంపించిన డేటా ఆధారంగా చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్‌ను రూపొందించారు. ► చంద్రుడిలో మన కంటికి కనిపించే భాగంలో నాలుగింట ఒక వంతు భాగాన్ని ఈ మ్యాప్ కవర్ చేస్తోంది. చంద్రుడిపై 60 డిగ్రీల అక్షాంశాల దిగువ భాగం నుంచి దక్షిణ ధ్రువం వరకూ ఉన్న ప్రాంతమంతా ఈ మ్యాప్‌లో ఉంది. ► చంద్రుడిపై నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా కదులుతుంది? అనేది ఈ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాకుండా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని భౌగోళిక పరిస్థితులను స్పష్టంగా గమనించవచ్చని చెబుతున్నారు. ► చంద్రుడి ఉపరితలంపై చాలా ప్రాంతాల్లో సూర్యకాంతి పడదు. అతిశీతల వాతావరణం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చందమామ ఉపరితల లక్షణాలతో అక్కడి నీటికి ఎలాంటి సంబంధం ఉంది? అనేది మ్యాప్ సులభంగా ద్వారా తేల్చవచ్చని నాసా వెల్లడించింది. ► చంద్రుడి ఉపరితలంలో పాటు అంతర్భాగంలోనూ నీటి ఉనికిని గతంలో గుర్తించారు. ఇది మంచు స్ఫటికాల రూపంలో నిక్షిప్తమై ఉన్నట్లు అంచనాకొచ్చారు. మరి కొంత నీరు రసాయన సమ్మేళనాలుగా ఉన్నట్లు కనిపెట్టారు. ► చంద్రుడిపై అసలు నీరు ఎలా పుట్టిందన్న సంగతి నిగ్గు తేల్చడానికి సైంటిస్టులు ఆసక్తి చూపుతున్నారు. ఆర్టిమిస్ ప్రయోగం ► వ్యోమగాములను పంపించడానికి నాసా చంద్రుడిపై 13 ల్యాండింగ్ సైట్లను గుర్తించింది. ► విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో చందమామపై నీరు ఎలాంటి మార్పులు చెందుతున్న సంగతి తెలుసుకోవడానికి జల పటం ఉపకరిస్తుందని నాసా వెల్లడించింది. ► ఆర్టిమిస్ ప్రయోగం ద్వారా తొలిసారిగా ఒక మహిళను, ఒక నల్ల జాతీయుడిని చంద్రుడిపైకి పంపించాలని నాసా సంకల్పించింది. చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలం నివసించేందుకు అనువైన పరిస్థితులను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తోంది. ► ఇందులో భాగంగా అక్కడున్న నీటిని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. ► చంద్రుడి నీటి మ్యాప్ ఆర్టిమిస్ ప్రోగ్రామ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ‘వైపర్’సైన్స్ టీమ్ సభ్యుడు కాసీ హానీబాల్ చెప్పారు. అరుణ గ్రహంపై జల సవ్వడి! అంగారక గ్రహం (మార్స్)పై వాతావరణం శూన్యం. గాలి, నీరు ఉండే అవకాశమే లేదని, మానవ మనుగడపై అనువైన పరిస్థితులు లేవని పరిశోధకులు ఇన్నాళ్లూ భావించారు. కానీ, అక్కడ నీటి ఉనికి ఉందన్న నిజం వెలుగులోకి వచ్చింది. మార్స్ మధ్యరేఖ వద్ద పురాతన హిమానీనదం(గ్లేసియర్) అవశేషాలను గుర్తించామని అమెరికా సైంటిస్టులు ప్రకటించారు. ఈ అవశేషం 6 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు ఉందని వివరించారు. ఇదే ప్రాంతంలో వేలాది సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. అగ్నిపర్వతం పేలుడు వల్ల ఇక్కడున్న నీరు ఉప్పురూపంలో ఘనీభవించినట్లు భావిస్తున్నామని వివరించారు. ఈ వివరాలను ఇటీవల జరిగిన 54వ లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేశారు. భూమికి 5.46 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణ గ్రహంపై అమెరికాతో పాటు వివిధ దేశాలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాలు రోవర్లను సైతం పంపించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలుగు రాష్ట్రాలపై కేంద్రం ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: ‘చిన్నారులకు సురక్షిత తాగునీరు’ నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నూటికి నూరు శాతం ప్రగతి కనబర్చడంపై జల వనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. పాఠశా లలు, అంగన్వాడీలు, గిరిజన వసతి గృహాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై 2020, అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని నిర్దేశించింది. స్థాయీ సంఘం తన 11వ నివేదికను సోమవారం పార్లమెంటుకు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో 42,655 అంగన్వాడీ కేంద్రాలకు, 41,619 పాఠశాలలకు నూటికి నూరు శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు గుర్తించింది. 27,310 అంగన్వాడీలు, 22,882 పాఠశాలల్లో కనెక్షన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణ నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించింది. ఈ రెండు విభాగాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే లక్ష్యాన్ని సాధించాయి. గ్రామ పంచాయతీల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు తగిన మౌలిక వసతులను సమకూర్చుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు చక్కటి పనితీరు కనబరిచాయని గుర్తించింది. అయితే ఏపీలో 2018-19, 2019-20లో స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) పథకం ద్వారా కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో వరసగా రూ. 987.39 కోట్లు, రూ. 1,034 కోట్లు ఖర్చు కాలేదని, అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. తెలంగాణ, గోవాలకు ప్రశంసలు జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయడంలో తెలంగాణ, గోవా నూటికి నూరుశాతం లక్ష్యాన్ని సాధించడాన్ని స్థాయీ సంఘం ప్రశంసించింది. అయితే కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణంలో తెలంగాణ సహా పంజాబ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు వెనుకబడ్డాయని వ్యాఖ్యానించింది. -
జూన్‌లో వర్షాలకు బోర్లు పూర్తిగా రీచార్జ్!
కందకాలు తవ్వించడం వల్ల ఈ ఏడాది జూన్‌లో కురిసిన 4, 5 వర్షాలకు భూగర్భ నీటి మట్టం బాగా పెరిగిందని, మూడు బోర్లూ పుష్కలంగా జలకళను సంతరించుకున్నాయని చింతా నరసింహరాజు చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అర్మాయిపేట గ్రామ పరిధిలో ఆయనకున్న 27 ఎకరాల నల్లరేగడి భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2017 నవంబర్‌లో తీవ్ర సాగునీటి కొరత ఏర్పడింది. మూడు బోర్లుంటే.. ఒక బోరే ఒక మోస్తరుగా పోసేది. మిగతా రెండు దాదాపు ఎండిపోయాయి. నాలుగు రోజులకోసారి పది నిమిషాలు నీరొచ్చే దుస్థితిలో ఉండేవి. అటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో కందకాల ద్వారా ‘చేనుకిందే చెరువు’ సాధించుకోవచ్చంటూ నిర్వహిస్తున్న ప్రచారోద్యమం గురించి మిత్రుడు క్రాంతి ద్వారా రాజు తెలుసుకున్నారు. పొలం అంతటా 50 మీటర్లకు వాలుకు అడ్డంగా ఒక వరుసలో.. మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తీసుకుంటే.. ఎంతటి కరువు ప్రాంత మెట్ట పొలాల్లో అయినా సాగు నీటి కొరత ఉండదని తెలుసుకున్నారు. కందకాలు తవ్వడానికి ఖర్చు అవుతుంది కదా అని తొలుత సందేహించినా.. నీరు లేకపోతే భూములుండీ ఉపయోగం లేదన్న గ్రహింపుతో కందకాలు తవ్వించారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ (ఇరిగేషన్) సంగెం చంద్రమౌళి (98495 66009), సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్‌రెడ్డి (94407 02029)లను తమ పొలానికి ఆహ్వానించి, వారి ఉచిత సాంకేతిక సహకారంతో కందకాలు తవ్వించామని రాజు తెలిపారు. నల్లరేగడి నేల కావడంతో కందకాలలో అంత త్వరగా నీరు ఇంకదు. కందకాలు నిండగా పొంగిపొర్లి వెళ్లిపోయే నీటిని కూడా ఒడిసిపట్టుకోవడానికి మట్టికట్టతో కూడిన ఫాం పాండ్‌ను కూడా తవ్వించారు. కందకాలు, ఫాం పాండ్ తవ్వడానికి రూ. 2 లక్షల వరకు ఖర్చయిందన్నారు. గత ఏడాది నవంబర్ తర్వాత కురిసిన వర్షాలతోపాటు ఈ ఏడాది జూన్‌లో కురిసిన వర్షాలకు 4, 5 సార్లు కందకాలు పూర్తిగా నిండాయి. జూలైలో వర్షం పడలేదు. ఆగస్టులో వర్షాలకు రెండు, మూడు సార్లు కందకాలు నిండాయి. దీంతో భూగర్భ నీటి మట్టం బాగా పెరిగి, మూడు బోర్లూ పుష్కలంగా నీటిని అందిస్తున్నాయి. ఫాం పాండ్ దగ్గరలో ఉన్న బోరు పూర్తి సామర్థ్యంతో నీటిని అందిస్తున్నదని రాజు ‘సాగుబడి’కి వివరించారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో కందులు (అంతరపంటలుగా మినుము, పెసలు, కొర్రలు), 5 ఎకరాల్లో తెలంగాణ సన్నాలు వరి పంట వేసినట్లు తెలిపారు. కొంత ఖర్చు అయినప్పటికీ, కందకాల ప్రభావం అద్భుతంగా ఉందని నరసింహరాజు (90084 12947) ఆనందంగా తెలిపారు. నీటి భద్రత రావటంతో పంటలకు ఇబ్బంది లేకుండా ఉందన్నారు. నీటికి ఇబ్బంది లేకుండా ఉండాలనుకునే రైతులు కందకాల ఆవశ్యకతను గుర్తించాలని సూచించారు. -
మాఫియాకు అడ్డుకట్ట
రాష్ట్రంలో ఎంత కావాలంటే అంత ఇసుక ఎప్పు డైనా సరే సరఫరా చేసే పద్ధతి గతంలో ఉండేది. అయితే గత ప్రభుత్వ సీనరేజి పాటలు నిర్వ హించకపోవటంతో ఇసుక మాఫియా తెరమీద కొచ్చింది. అప్పట్లో రెండు యూనిట్ల లారీ పది హేను వందల రూపాయలకు సరఫరా చేయగా ప్రస్తుతం పది, పదిహేను వేలు వెచ్చించాల్సివ స్తుంది. జలవనరులు, రెవెన్యూ, గనులు, పంచాయతీరాజ్, పోలీ సు శాఖల నిరంతర పర్యవేక్షణలో నిఘా నేత్రాలు, లారీలను జి.పి. ఎస్. పరికరాల అమరికల వంటి పటిష్ట బందోబస్తు విధించినా మాఫియా ఆగడా లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గతంలో మాదిరిగా సీనరేజి పాటలు నిర్వహించినట్లయితే ప్రభుత్వ ఆదాయంతో పాటు వినియోగదారు లకు సక్రమమైన ధరకు ఇసుక లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా దీనిపై దృష్టి పెట్టకపోతే మాఫియా ఆగడాలు విజృంభించక తప్పదు. - ఎర్రమోతు ధర్మరాజు ధవళేశ్వరం