కేప్ కనావరెల్(యూఎస్): యాభై సంవత్సరాల తర్వాత అమెరికా చంద్రుడిపై పరిశోధనలకు నడుం బిగించింది. ఆర్టెమిస్ మిషన్ సన్నాహకాల్లో భాగంగా నాసా.. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ వారు తయారుచేసిన పెరీగ్రీన్ ల్యాండర్‌ను యూనైటెడ్ లాంఛ్ అలయన్స్ వల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. సోమవారం ఫ్లోరిడాలోని కేప్ కనావరెల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి రాకెట్‌ను ప్రయోగించారు.
పలుమార్లు కక్ష్యలను మార్చుకుంటూ ఫిబ్రవరి 23వ తేదీన అది చంద్రుడిపై దిగనుంది. దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో ఈ ల్యాండర్‌ను తయారుచేశారు. ల్యాండర్ తయారీలో ఆస్ట్రోబోటిక్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా నాసా.. అంతరిక్ష ‘డెలివరీ’ సేవల రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహా్వనించినట్లయింది. చంద్రుడిపై దిగాక పెరీగ్రీన్ పలు పరిశోధనలు చేయనుంది. ఈ పరిశోధనలు ఈ ఏడాది చివర్లో నాసా నలుగురు వ్యోమగాములతో చేపట్టే ప్రయోగానికి సాయపడనున్నాయి.
ఆస్ట్రోబోటిక్‌తోపాటు నోవా–సీ ల్యాండర్‌ను తయారుచేసేందుకు హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్‌తోనూ నాసా ఒప్పందం కుదుర్చుకుంది. నోవా–సీను ల్యాండర్‌ను వచ్చే నెలలో స్పేస్‌ఎక్స్ రాకెట్ ద్వారా చంద్రుడి మీదకు పంపనున్నారు. నేరుగా ప్రయాణం కారణంగా పెరిగ్రీన్ కంటే ముందుగా వారం రోజుల్లోనే ఇది చంద్రుడిపై దిగనుంది. 1960, 70 దశకాల్లో చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్‌లతో అమెరికా, సోవియట్ యూనియన్‌లు పోటాపోటీగా ప్రయోగాలు చేపట్టడం తెల్సిందే. చంద్రుడిపై శోధనాపర్వంలో 2013లో చైనా, 2023లో భారత్ చేరాయి. గతేడాది రష్యా, జపాన్ ల్యాండర్లు విఫలమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment