NASA mission
-
అర్ధ శతాబ్ది తర్వాత చంద్రుడిపై అమెరికా కన్ను
కేప్ కనావరెల్(యూఎస్): యాభై సంవత్సరాల తర్వాత అమెరికా చంద్రుడిపై పరిశోధనలకు నడుం బిగించింది. ఆర్టెమిస్ మిషన్ సన్నాహకాల్లో భాగంగా నాసా.. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ వారు తయారుచేసిన పెరీగ్రీన్ ల్యాండర్‌ను యూనైటెడ్ లాంఛ్ అలయన్స్ వల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. సోమవారం ఫ్లోరిడాలోని కేప్ కనావరెల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. పలుమార్లు కక్ష్యలను మార్చుకుంటూ ఫిబ్రవరి 23వ తేదీన అది చంద్రుడిపై దిగనుంది. దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో ఈ ల్యాండర్‌ను తయారుచేశారు. ల్యాండర్ తయారీలో ఆస్ట్రోబోటిక్కు అవకాశం ఇవ్వడం ద్వారా నాసా.. అంతరిక్ష ‘డెలివరీ’ సేవల రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహా్వనించినట్లయింది. చంద్రుడిపై దిగాక పెరీగ్రీన్ పలు పరిశోధనలు చేయనుంది. ఈ పరిశోధనలు ఈ ఏడాది చివర్లో నాసా నలుగురు వ్యోమగాములతో చేపట్టే ప్రయోగానికి సాయపడనున్నాయి. ఆస్ట్రోబోటిక్తోపాటు నోవా–సీ ల్యాండర్‌ను తయారుచేసేందుకు హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్తోనూ నాసా ఒప్పందం కుదుర్చుకుంది. నోవా–సీను ల్యాండర్‌ను వచ్చే నెలలో స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా చంద్రుడి మీదకు పంపనున్నారు. నేరుగా ప్రయాణం కారణంగా పెరిగ్రీన్ కంటే ముందుగా వారం రోజుల్లోనే ఇది చంద్రుడిపై దిగనుంది. 1960, 70 దశకాల్లో చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్లతో అమెరికా, సోవియట్ యూనియన్లు పోటాపోటీగా ప్రయోగాలు చేపట్టడం తెల్సిందే. చంద్రుడిపై శోధనాపర్వంలో 2013లో చైనా, 2023లో భారత్ చేరాయి. గతేడాది రష్యా, జపాన్ ల్యాండర్లు విఫలమయ్యాయి. -
భారతీయుడి నమ్మకమే ‘పార్కర్‌కు’ పునాది
న్యూఢిల్లీ: 60 ఏళ్ల క్రితం సౌర గాలులు ఉన్నాయంటూ పార్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని భారత సంతతి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ గుర్తించకుం టే తాజా ప్రయోగం సాకారమయ్యేదే కాదు. సూర్యుడి నుంచి ఆవేశపూరిత కణాలు నిరంతరం అంతరిక్షంలోకి ప్రసారమవుతూ.. అక్కడి ప్రాంతాన్ని నింపుతున్నాయని 1958లో పార్కర్ గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విశ్లేషణలతో కూడిన థియరీ పేపర్‌ను ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌కు సమర్పించారు. అయితే, ఇద్దరు పరిశోధకులు దీనిని తిరస్కరించారు. దీనికి కారణం అంతరిక్షాన్ని కేవలం శూన్య ప్రదేశంగా భావించే రోజులవి. అయితే ఆ సమయంలో జర్నల్‌కు సీనియర్ ఎడిటర్‌గా ఉన్న చంద్రశేఖర్.. పార్కర్ సిద్ధాంతాన్ని పబ్లిష్ చేయాలని నిర్ణయించారు. చంద్రశేఖర్ ఆ నిర్ణయం తీసుకోకుంటే ఈ ప్రయోగం జరిగేది కాదని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ సోలార్ స్టెల్లార్ ఎన్విరాన్మెంట్కు చైర్మన్‌గా పనిచేస్తున్న నంది వెల్లడించారు. నక్షత్రాల నిర్మాణ, పరిమాణ క్రమంలో భౌతిక ప్రక్రియల ప్రాముఖ్యతపై చేసిన పరిశోధనలకు గాను 1983లో ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతిని విలియమ్ ఏ ఫోలర్తో కలసి సంయుక్తంగా ఆయన అందుకున్నారు. అలాగే చంద్రశేఖర్ సేవలకు గుర్తుగా 1999లో చంద్రశేఖర్ పేరుతోనే ‘చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ’అనే అంతరిక్ష ప్రయోగాన్ని నాసా చేపట్టింది. -
మరో చరిత్ర సృష్టించిన నాసా..
న్యూయార్క్: అంతర్జాతీయ ఖగోళ సంస్థ నాసా మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన జూనో అంతరిక్ష నౌక సుదీర్ఘ ప్రయాణం చేసి జూపిటర్(బృహస్పతి) కక్ష్యలోకి చేరుకుంది. ఇందుకుగాను దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. సౌర వ్యవస్థలో ప్రాణి జీవించేందుకు అనుకూలంగా ఉన్న ఏకైక గ్రహం జూపీటర్ ఒక్కటే అని ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆ మేరకే పలు దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. అందులో భాగంగా 2011 ఆగస్టు 5న నాసా జూనో అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు 260కోట్ల కిలో మీటర్లు ప్రయాణించిన జూనో చివరకు జూపిటర్ కక్షలోకి చేరింది. జూపిటర్ చుట్టూ ఇది 37సార్లు తిరగనుంది. దాదాపు 20 నెలలపాటు ఈ గ్రహాన్ని పరిశీలిస్తుంది. సూర్యుడికి 74.1కోట్ల కిలోమీటర్ల దూరంలో జూపిటర్ ఉండగా.. భూమికి 58.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి కన్నా ఇది 11.2రెట్లు పెద్దది. ఇక సౌరమండలంలో ఈ గ్రహమే అన్నింటికన్నా పెద్దదని ఇప్పటికే తెలిసిందే. దాదాపు 1.1 బిలియన్ డాలర్ల వ్యయంతో నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది.