పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా పాపకు ఆర్నెల్లు. పుట్టిన రెండో వారం నుంచి గురక వస్తోంది. ఇటీవలి కాలంలో శబ్దం మరీ ఎక్కువగా ఉంది. తరచూ వాంతులు కూడా చేసుకుంటోంది. డాక్టర్‌కు చూపిస్తే ‘పర్లేదు అంతా సర్దుకుంటుంది’ అన్నారు. మాకు ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి.
– నివేదిత, రాజమండ్రి
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు ‘లారింగో మలేసియా’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... శ్వాస తీసుకునే నాళంలోని ఒక భాగం బలహీనంగా ఉండటం. కొద్దిమంది పిల్లల్లో శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం... మరీ ముఖ్యంగా ఆ శబ్దం... చిన్నారులు మెలకువగా ఉన్నప్పుడు, ఇతరతా ఇన్ఫెక్షన్లు (దగ్గు, జలుబు వంటివి) ఉన్నప్పుడు, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎక్కువ కావచ్చు. ఇలా ఎక్కువగా శబ్దం రావడాన్ని వైద్యపరిభాషలో స్ట్రయిడర్ అంటారు. పిల్లల్లో 60 శాతం మందిలో స్ట్రయిడర్ రావడానికి కారణం లారింగో మలేసియానే. ఇటువంటి పిల్లల్లో శ్వాససంబంధమైన సమస్యలు పుట్టిన రెండో వారం నుంచే మొదలై... ఆర్నెల్ల వయసప్పటికి తీవ్రతరం కావచ్చు. చాలామందిలో ఇది క్రమేణా తగ్గుముఖం పట్టడం, పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడం జరుగుతుంది. ఈ మెరుగుదల ఎప్పుడైనా మొదలుకావచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో లారింగోమలేసియాతో పాటు దగ్గు, వాంతులు కనిపించే లారింగో ఫ్యారింజియల్ రిఫ్లక్స్ అనే కండిషన్‌తో సమస్య తన తీవ్రతను చూపించవచ్చు. ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు నీలంగా మారడం (సైనోసిస్), దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మరికొన్ని ఇతర రకాల సమస్యలైన... సబ్‌గ్లాటిక్ స్టెనోసిస్, లారింజియల్ వెబ్స్, ట్రాకియో బ్రాంకియో మలేసియా... మొదలైన కండిషన్‌లలోనూ మీరు చెప్పిన లక్షణాలే కనిపిస్తుంటాయి. పై అంశాలను బట్టి విశ్లేషిస్తే మీ పాపకు లారింగో మలేసియాతో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేయడానికి ఫ్లెక్సిబుల్ లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ, రేడియోగ్రాఫిక్ స్టడీస్ చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స అన్నది పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత, శ్వాసతీసుకునే సమయంలో ఇబ్బందిని ఏ మేరకు భరిస్తున్నారు, పిల్లల్లో ఉన్న ఇతరత్రా వైద్య సమస్యలు, ఇన్వెస్టిగేషన్ డేటా, అన్నిటి కంటే ముఖ్యంగా ఈ జబ్బు కారణంగా కుటుంబంపై పడుతున్న మానసిక ఒత్తిడి తాలూకు తీవ్రత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాపకు ఉన్నది చాలా తీవ్రమైన లారింగోమలేసియా అని నిర్ధారణ అయితే శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కాబట్టి... మీరు మీ పిల్లల వైద్యుడిని, పీడియాట్రిక్ ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించి, ఫాలోఅప్‌లో ఉండండి.
గవదబిళ్లలు తిరగబెడుతున్నాయి..
మా బాబుకి ఎనిమిదేళ్లు. గత ఏడాది వాడికి గవదబిళ్లలు వచ్చాయి. అప్పుడు విపరీతమైన దగ్గు కూడా వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరోసారి జ్వరం, గవదబిళ్లలు వచ్చాయి. అసలు ఈ గవదబిళ్లలు అంటే ఏమిటి? దీనివల్ల ముమ్ముందు ఏవైనా సమస్యలు వస్తాయా? ఇవి మళ్లీ తిరగబెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
– సుకన్య, అనంతపురం
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ అబ్బాయికి మాటిమాటికీ పెరోటిడ్ గ్లాండ్స్‌లో వాపు వస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లల్లో, పెద్దల్లో ఈ పెరోటిడ్ గ్రంథి వాపు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మంప్స్ అనే వైరల్ వ్యాధి ఈ కారణాల్లో ప్రధానమైనది. ఇది ఒక సిస్టమిక్ జబ్బు (అంటే శరీరంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేయగలది అన్నమాట). ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 30 శాతం మంప్స్ రోగుల్లో అది శ్వాససంబంధిత లక్షణాలతో బయటపడుతుంది. మరో 30–40 శాతం రోగుల్లో మెదడులోని ద్రవం (సెరిబ్రోస్పినల్ ఫ్లూయిడ్)లో మార్పులు కూడా ఉండవచ్చు. ఇక ఇది సిస్టమిక్ వ్యాధి కావడంతో మగపిల్లల్లో ఆర్కయిటిస్ (వృషణాల వాపు), ఆడపిల్లల్లో ఊఫోరైటిస్ (ఓవరీస్ వాపు), మయోకార్డయిటిస్ (గుండెకు ఇన్ఫెక్షన్), మెదడు జ్వరం లక్షణాలు, వినికిడి శక్తిలోపం, కంటి ఇన్ఫెక్షన్లు వంటి ఇతర ఎలాంటి కాంప్లికేషన్లకూ దారితీయవచ్చు. అంతేగాక ఇతర వైరల్ ఇన్ఫెక్షన్‌లు, హెచ్‌ఐవీలోనూ, ఫైటోమెగోలోవైరస్, పారా ఇన్‌ఫ్లుయెంజా, టీబీ, ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలోనూ ఈ పెరోటిడ్ గ్రంథుల వాపు వస్తుంటుంది. అలాగే కొన్ని మందులు వాడినప్పుడు, కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్‌లోనూ ఈ గ్రంథుల వాపు కనిపించవచ్చు.
ఇక మీ అబ్బాయి విషయంలో అతడి పెరోటిడ్ గ్లాండ్స్ వాపునకు ఇదీ కారణం అని చెప్పలేకపోయినప్పటికీ అది మంప్స్ వైరస్ వల్ల వచ్చి ఉండవచ్చు. రెండోసారి రావడానికి ఇతర వైరస్‌లు కూడా కారణం కావచ్చు. పిల్లల్లో ఇలా పదేపదే పెరోటిడ్ గ్రంథుల వాపు వస్తున్నప్పుడు ఇతర కారణాలను విశ్లేషించడం చాలా ముఖ్యం. వాటిని కొన్ని ఇమ్యూనలాజికల్ పరీక్షల ద్వారా తప్పకుండా తెలుసుకోవచ్చు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్‌లు సాధారణంగా డే–కేర్ సెంటర్స్ లేదా స్కూళ్లలో పిల్లలకు వచ్చే దగ్గు, జలుబు ద్వారా ఇతర పిల్లలకు వ్యాపించే అవకాశం ఎక్కువ. మంప్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి నిర్దిష్టమైన చికిత్స లేదు. కేవలం లక్షణాల ఆధారంగా చేసే సపోర్టివ్ ట్రీట్‌మెంట్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ పైన పేర్కొన్న కాంప్లికేషన్లు వచ్చినప్పుడు మాత్రం ఇతరత్రా కొన్ని మందులు (స్టెరాయిడ్స్ వంటివి) వాడాల్సి ఉంటుంది. ఇక ఇంత తీవ్రమైన ఈ జబ్బుకు పిల్లలు పుట్టాక 15వ నెలలో, నాలుగు నుంచి ఆరేళ్ల వయసులో, కొందరిలో కొద్దిగా పెద్దయ్యాక కూడా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా జబ్బును నివారించడంతో పాటు, ఒకవేళ వస్తే దాని తీవ్రతనూ తగ్గించవచ్చు. మీరు మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదించి ఒకవేళ మీరు ముందుగా తీసుకుని ఉండకపోతే మీ అబ్బాయికి ఎమ్‌ఎమ్‌ఆర్ వ్యాక్సిన్‌ను ఇప్పించండి.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్,
విజయనగర్ కాలనీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment