మా పాపకు ఇప్పుడు ఐదో నెల. పుట్టిన రెండో వారం నుంచే గురక వస్తోంది. ఈమధ్య ఈ గురక శబ్దం మరీ పెరిగింది. తరచూ వాంతులు కూడా చేసుకుంటోంది. డాక్టర్‌కు చూపిస్తే ‘పర్లేదు అంతా సర్దుకుంటుంది’ అన్నారు. పాప విషయంలో మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి.
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు ‘లారింగో మలేసియా’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... శ్వాస తీసుకునే నాళంలోని ఒక భాగం బలహీనంగా ఉండటం. కొద్దిమంది పిల్లల్లో శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం... మరీ ముఖ్యంగా ఆ శబ్దం... చిన్నారులు మెలకువగా ఉన్నప్పుడు, ఇతరతా ఇన్ఫెక్షన్లు (దగ్గు, జలుబు వంటివి) ఉన్నప్పుడు, ఆహారం తీసుకుంటునప్పుడు ఎక్కువ కావచ్చు. ఇలా ఎక్కువగా శబ్దం రావడాన్ని వైద్యపరిభాషలో స్ట్రయిడర్ అంటారు. పిల్లల్లో 60 శాతం మందిలో స్ట్రయిడర్ రావడానికి కారణం లారింగో మలేసియానే. ఇటువంటి పిల్లల్లో శ్వాససంబంధమైన సమస్యలు పుట్టిన రెండో వారం నుంచే మొదలై... ఆర్నెల్ల వయసప్పటికి తీవ్రతరం కావచ్చు.
చాలామందిలో ఇది క్రమేణా తగ్గుముఖం పట్టడం, పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడం జరుగుతుంది. ఈ మెరుగుదల ఎప్పుడైనా మొదలుకావచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో లారింగోమలేసియాతో పాటు దగ్గు, వాంతులు కనిపించే లారింగో ఫ్యారింజియల్ రిఫ్లక్స్ అనే కండిషన్‌తో సమస్య తన తీవ్రతను చూపించవచ్చు. ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు నీలంగా మారడం (సైనోసిస్), దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మరికొన్ని ఇతర రకాల సమస్యలైన... సబ్‌గ్లాటిక్ స్టెనోసిస్, లారింజియల్ వెబ్స్, ట్రాకియో బ్రాంకియో మలేసియా... మొదలైన కండిషన్‌లలోనూ మీరు చెప్పిన లక్షణాలే కనిపిస్తుంటాయి.
పై అంశాలను బట్టి విశ్లేషిస్తే మీ పాపకు లారింగో మలేసియాతో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేయడానికి ఫ్లెక్సిబుల్ లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ, రేడియోగ్రాఫిక్ స్టడీస్ చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స అన్నది పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత, శ్వాసతీసుకునే సమయంలో ఇబ్బందిని ఏ మేరకు భరిస్తున్నారు, పిల్లల్లో ఉన్న ఇతరత్రా వైద్య సమస్యలు, ఇన్వెస్టిగేషన్ డేటా, అన్నిటి కంటే ముఖ్యంగా ఈ జబ్బు కారణంగా కుటుంబంపై పడుతున్న మానసిక ఒత్తిడి తాలూకు తీవ్రత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాపకు ఉన్నది చాలా తీవ్రమైన లారింగోమలేసియా అని నిర్ధారణ అయితే శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కాబట్టి... మీరు మీ పిల్లల వైద్యుడిని, పీడియాట్రిక్ ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించి, ఫాలోఅప్‌లో ఉండండి.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్,
రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment