Pediatric counseling
-
పాప ఒంటి మీద తరచూ రాష్...ఎందుకిలా?
వూ పాప వయసు ఏడేళ్లు. రెండు నెలల కిందట ఓ రోజు బాగా ఆడుకున్న తర్వాత ఆమె ఒంటిపైన ఎర్రగా రాష్లాగా వచ్చింది. ఏదైనా పురుగు కుట్టిందేమో అనుకున్నాం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇంజెక్షన్ చేశారు. అప్పటి నుంచి ఎండలోకి వెళ్లినా, ఇంట్లోనే పరుగెత్తే ఆటలు ఆడినా, వేణ్ణీళ్ల స్నానం చేసినా ఈవిధంగా శరీరవుంతా ఎర్రగా రాష్ వస్తోంది. ఐదు, పది నిమిషాల్లో అదే తగ్గిపోతోంది. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే శరీరంలో ఏదైనా పడని పదార్థాలు ఉంటే అలాగే వస్తుందని వుందులు ఇచ్చారు. వుందులు వాడినంతకాలం రాలేదు. వుందులు వూనేశాక వుళ్లీ వస్తోంది. ఇలా రావడం ఏమైనా హానికరవూ? దయచేసి వూ పాప సవుస్యకు పరిష్కారం చూపగలరు. – ఎమ్. దుర్గాభవాని, విజయవాడ మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఆర్టికేరియా అంటారు. అందులోనూ మీ పాపకు ఉన్న కండిషన్ కోలినర్జిక్ ఆర్టికేరియా అనిపిస్తోంది. ఇది ఒక రకమైన అలర్జిక్ రుగ్మత. కాని విచిత్రం ఏమిటంటే... ఇది శారీరక శ్రమ (ఫిజికల్ యాక్టివిటీ) ఏదైనా చేయడం కలిగే ప్రేరణ (స్టివు్యులస్)తో ఎక్కువగా వస్తుంటుంది. ఫిజికల్ యాక్టివిటీ వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెవుటలు పట్టడం వల్ల ఈ సవుస్య ఉత్పన్నవువ#తుంది. సాధారణంగా దురదలు, చర్మం వేడెక్కడం, ఎర్రబడటం, వుచ్చలు, బొబ్బలు రావడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. శరీరవుంతటా ఈ లక్షణాలు కనిపిస్తాయి. అయితే అరచేతుల్లో, అరికాళ్లలో రావడం వూత్రం కాస్తంత అరుదు. కొద్దివుంది పిల్లల్లో దీంతో పాటు శ్వాసకోశ సవుస్యలు తలెత్తే అవకాశాలూ ఉంటాయి. ఇది అలర్జిక్ టెండెన్సీస్ ఉన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది సాధారణంగా పదేళ్ల పిల్లల నుంచి 30 ఏళ్ల వరకు వ్యక్తుల వరకు చూస్తుంటాం. ఇది ఒకసారి వస్తే కొన్నేళ్లపాటు తరచూ కనిపిస్తుంటుంది. కారణాలు వుుందు చెప్పినట్లుగా ఇది ఫిజికల్ యాక్టివిటీతో కలిగే స్టివు్యులస్ వల్ల వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెవుటలు పట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వేడివేడి ఆహార పదార్థాలు, వుసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం, సోనాబాత్, ఉద్వేగాలతో కూడిన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్) వల్ల కూడా ఇది రావచ్చు. కొందరిలో వేణ్ణిళ్ల స్నానం వల్ల ఆర్టికేరియా అటాక్ రావడం కూడా మామూలే. నిర్ధారణ ఈ పరిస్థితిని ఫిజికల్ యాక్టివిటీ చేయించడం ద్వారా, కొన్ని ప్రత్యేకమైన పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. వుుందుగా చెప్పినట్లు కొందరిలో ఇది సుదీర్ఘకాలం పాటు తరచూ కనిపిస్తూ ఉన్నా... వురికొందరిలో దానంతట అదే అకస్మాత్తుగా తగ్గిపోవచ్చు కూడా. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►ఆర్టికేరియాకు దారితీసే పరిస్థితులు అంటే... చెవుటపట్టే పరిస్థితులను నివారించడం (ఎక్సర్సైజ్ వంటి శారీరక కార్యకలాపాలు / ఫిజికల్ యాక్టివిటీ తగ్గించుకోవడం), వురీ ఎక్కువ ఉష్ణోగ్రతకు, వురీ ఎక్కువ తేవు (హ్యూమిడిటీ) వంటి వాతావరణ పరిస్థితులకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ►ఆహారంలో... వేడివేడి పదార్థాలు, వుసాలాలు, శీతల పానియాల వంటివి అవాయిడ్ చేయడం వుంచిది. చికిత్స ఈ కండిషన్ యాంటీహిస్టమైన్స్ అంటే ఉదాహరణకు సిట్రజైన్, లోరాటిడెన్ వంటి వుందులవల్ల చాలా వుట్టుకు తగ్గుతుంది. వాటితోపాటు ఇవు్యునోథెరపీ వల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుంది. మీ పాపకు ఉన్న కండిషన్‌కు కేవలం ఒక సిట్టింగ్‌లో శాశ్వత పరిష్కారం లభించడం కష్టం. అయితే ఈ ఆర్టికేరియా వల్ల పాపకు మేజర్ సవుస్యలు ఏవీ రావ#. మీరు పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ మీ డర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోండి. -డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
ఇంత చిన్న పాపకు గురకా?
మా పాపకు ఇప్పుడు ఐదో నెల. పుట్టిన రెండో వారం నుంచే గురక వస్తోంది. ఈమధ్య ఈ గురక శబ్దం మరీ పెరిగింది. తరచూ వాంతులు కూడా చేసుకుంటోంది. డాక్టర్‌కు చూపిస్తే ‘పర్లేదు అంతా సర్దుకుంటుంది’ అన్నారు. పాప విషయంలో మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు ‘లారింగో మలేసియా’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... శ్వాస తీసుకునే నాళంలోని ఒక భాగం బలహీనంగా ఉండటం. కొద్దిమంది పిల్లల్లో శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం... మరీ ముఖ్యంగా ఆ శబ్దం... చిన్నారులు మెలకువగా ఉన్నప్పుడు, ఇతరతా ఇన్ఫెక్షన్లు (దగ్గు, జలుబు వంటివి) ఉన్నప్పుడు, ఆహారం తీసుకుంటునప్పుడు ఎక్కువ కావచ్చు. ఇలా ఎక్కువగా శబ్దం రావడాన్ని వైద్యపరిభాషలో స్ట్రయిడర్ అంటారు. పిల్లల్లో 60 శాతం మందిలో స్ట్రయిడర్ రావడానికి కారణం లారింగో మలేసియానే. ఇటువంటి పిల్లల్లో శ్వాససంబంధమైన సమస్యలు పుట్టిన రెండో వారం నుంచే మొదలై... ఆర్నెల్ల వయసప్పటికి తీవ్రతరం కావచ్చు. చాలామందిలో ఇది క్రమేణా తగ్గుముఖం పట్టడం, పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడం జరుగుతుంది. ఈ మెరుగుదల ఎప్పుడైనా మొదలుకావచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో లారింగోమలేసియాతో పాటు దగ్గు, వాంతులు కనిపించే లారింగో ఫ్యారింజియల్ రిఫ్లక్స్ అనే కండిషన్‌తో సమస్య తన తీవ్రతను చూపించవచ్చు. ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు నీలంగా మారడం (సైనోసిస్), దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మరికొన్ని ఇతర రకాల సమస్యలైన... సబ్‌గ్లాటిక్ స్టెనోసిస్, లారింజియల్ వెబ్స్, ట్రాకియో బ్రాంకియో మలేసియా... మొదలైన కండిషన్లలోనూ మీరు చెప్పిన లక్షణాలే కనిపిస్తుంటాయి. పై అంశాలను బట్టి విశ్లేషిస్తే మీ పాపకు లారింగో మలేసియాతో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేయడానికి ఫ్లెక్సిబుల్ లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ, రేడియోగ్రాఫిక్ స్టడీస్ చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స అన్నది పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత, శ్వాసతీసుకునే సమయంలో ఇబ్బందిని ఏ మేరకు భరిస్తున్నారు, పిల్లల్లో ఉన్న ఇతరత్రా వైద్య సమస్యలు, ఇన్వెస్టిగేషన్ డేటా, అన్నిటి కంటే ముఖ్యంగా ఈ జబ్బు కారణంగా కుటుంబంపై పడుతున్న మానసిక ఒత్తిడి తాలూకు తీవ్రత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాపకు ఉన్నది చాలా తీవ్రమైన లారింగోమలేసియా అని నిర్ధారణ అయితే శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కాబట్టి... మీరు మీ పిల్లల వైద్యుడిని, పీడియాట్రిక్ ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి, ఫాలోఅప్‌లో ఉండండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
అమ్మాయి ఒంటిమీద పులిపిర్లు... తగ్గేదెలా?
మా అమ్మాయికి తొమ్మిదేళ్లు. ఆమెకు ముఖం మీదా, ఒంటిపైన అక్కడక్కడా చిన్న చిన్న పులిపిరి కాయల్లాంటివి వతున్నాయి. పైగా అవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆమె మేనిపై వాటిని చూస్తే మాకు ఆందోళనగా ఉంది. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి.– ఆర్. శైలజ, కర్నూలు మీరు చెప్పిన వివరాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ ములస్కమ్ కంటాజియోజమ్ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి. ఇది ముఖ్యంగా రెండు నుంచి 12 ఏళ్ల పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం. వ్యాప్తి జరిగే తీరు... చర్మానికి చర్మం తగలడం వల్ల, వ్యాధి ఉన్నవారి తువ్వాళ్లను మరొకరు ఉపయోగించడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా చాలా సాధారణం. దీన్నే సెల్ఫ్ ఇనాక్యులేషన్ అంటారు. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు. చికిత్స : ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్.... అంటే ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ కలిపి ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, చికిత్సను కొనసాగించండి. బాబుకు తరచూ జలుబు... సలహా ఇవ్వండి మా బాబుకు తొమ్మిదేళ్లు. తరచూ జలుబు చేస్తుంటుంది. చల్లటి పదార్థాలు, పానీయాలు ఇష్టంగా తాగుతాడు. వద్దన్నా మానడు. ఒక్కోసారి ఊపిరి సరిగ్గా ఆడటం లేదని అంటుంటాడు. డాక్టర్‌ను సంప్రదించాం. మందులు ఇచ్చారు. వాటి ప్రభావం సరిగ్గా లేదు. బాబు ఆరోగ్య విషయంలో ఎటువంటి సలహాలు పాటించాలో తెలియజేయండి.– ఎమ్.డి. అన్వర్‌బాషా, గుంటూరు మీ బాబుకు ఉన్న కండిషన్‌ను అలర్జిక్ రైనైటిస్ అంటారు. అందులోనూ మీ బాబుకు ఉన్నది సీజనల్ అలర్జిక్ రైనైటిస్‌గా చెప్పవచ్చు. పిల్లల్లో సీజనల్ అలర్జిక్ రైనైటిస్ లక్షణాలు ఆరేళ్ల వయసు తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న పిల్లల్లో జలుబు, ముక్కు దురద, కళ్ల నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, ఊపిరి తీసుకోవడంలో కష్టం వంటి లక్షణాలు చూస్తుంటాం. ఈ సమస్య చాలా సాధారణం. దీనికి నిర్దిష్టమైన కారణం చెప్పలేకపోయినప్పటికీ వంశపారపర్యంగా కనిపించడంతో పాటు వాతావరణ, పర్యావరణ మార్పులు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. పూల మొక్కలు, దుమ్ము, ధూళి, పుప్పొడి, రంగులు, డిటర్జెంట్స్ వంటివి శరీరానికి సరిపడకపోవడంతో వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణాలు. మీ బాబుకు యాంటీహిస్టమైన్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్, ఇంట్రానేసల్ స్టెరాయిడ్ స్ప్రేస్ వాడటం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. మీ అబ్బాయి విషయంలో ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. చల్లటి పదార్థాలు తగ్గించడం, సరిపడనివాటికి దూరంగా ఉంచడంతో చాలావరకు ప్రయోజనం ఉంటుంది. పాపకు ఒంటిపై తరచూ దద్దుర్లు...! మా పాపకు ఆరేళ్లు. ఇటీవల మూడు నాలుగు సార్లు ఒంటి మీద దద్దుర్లలా వచ్చాయి. ఒక రోజు ఉండి మళ్లీ తగ్గుతున్నాయి. ఈ సమస్యకు మందులు కూడా వాడాం. అయితే తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ వస్తున్నాయి. పాప చాలా ఇబ్బంది పడుతోంది. ఇలా జరగడానికి కారణం ఏమిటి? మాకు తగిన సలహా ఇవ్వండి.– కనకరత్నం, నెల్లూరు మీ పాపకు ఉన్న సమస్యను అర్టికేరియా అంటారు. ఈ సమస్యలో చర్మం పైభాగం (సూపర్ఫీషియల్ డర్మిస్) ఎర్రబడి కాస్త ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఇది చిన్న ఎర్రటి మచ్చలా మొదలై శరీరమంతటా అనేక చోట్ల కనిపించవచ్చు. ఇది అతి సాధారణ సమస్య. ఆర్టికేరియాలో అక్యూట్ అని, క్రానిక్ అని రెండు రకాలు ఉంటాయి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు అక్యూట్ అర్టికేరియా అని చెప్పవచ్చు. ఆర్టికేరియాకు కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆహారం వల్ల (అంటే... గుడ్డు, గోధుమ, వేరుసెనగపల్లీలు, సముద్రపు చేపలు, కొందరిలో స్ట్రాబెర్రీస్); మందులు, ఏదైనా పురుగు కుట్టడం (అంటే... తేనెటీగలు లేదా చీమల వంటివి); ఇన్ఫెక్షన్లు (అంటే బ్యాక్టీరియల్ లేదా వైరల్); కాంటాక్ట్ అలర్జీలు (అంటే లేటెక్స్/రబ్బరు, పుప్పొడి వంటివి); గొంగళిపురుగులు, కొన్ని జంతువుల లాలాజలం తగలడం వల్ల; రక్తం, రక్తానికి సంబంధించిన ఉత్పాదనల వల్ల... మీరు చెబుతున్న అక్యూట్ అర్టికేరియా రావచ్చు. ఇక దీర్ఘకాలికంగా కనిపించే క్రానిక్ అర్టికేరియాలో 80 శాతం కేసుల్లో కారణం ఇదీ అని చెప్పడం కష్టం. కాకపోతే కొన్నిసార్లు చాలా వేడి, చల్లటి, ఒత్తిడితో కూడిన, కంపనాలతో ఉండే పరిసరాల వల్ల, థైరాయిడ్, రక్తానికి సంబంధించిన రుగ్మతల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) అర్టికేరియా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అక్యూట్ అర్టికేరియాకు నట్స్‌తో కూడిన ఆహారం, ఆహారంలో వేసే కృత్రిమ రంగులు, పుప్పొడి, ఏదైనా పురుగు కుట్టడం, కడుపులో నులిపురుగులు, సింథటిక్ దుస్తులు, సీఫుడ్ వంటి వాటిని సాధారణ కారణాలుగా గుర్తించారు. కాబట్టి మీ పాప విషయంలో చికిత్సలో భాగంగా మొదట పైన పేర్కొన్న అంశాలలో మీ పాప అర్టికేరియాకు ఏది కారణం కావచ్చో దాన్ని గుర్తించి, దాని నుంచి కొన్నాళ్లు మీ పాపను దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ఇక మందుల విషయానికి వస్తే యాంటీహిస్టమైన్స్, హెచ్2 బ్లాకర్స్ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇక లక్షణాలు తీవ్రంగా కనిపించే వారిలో ఇమ్యూనో మాడ్యులేషన్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. మీ పాప విషయంలో పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ యాంటీహిస్టమైన్స్‌లో హైడ్రాక్సిజీన్, సిట్రజీన్ వంటి మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య పదే పదే తిరగబెడుతూ, తీవ్రంగా కనిపిస్తుంటే కొన్ని ఇమ్యూనలాజికల్ పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది. కాబట్టి తీవ్రతను బట్టి మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణుణ్ణి లేదా మీ పీడియాట్రీషియన్‌తో చర్చించి, తగిన చికిత్స తీసుకోండి.-డా. రమేశ్‌బాబు దాసరిసీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
చిన్నపిల్లలకు జ్వరం వస్తే... తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాది పెద్ద కుటుంబం. మాకు తొమ్మిది, ఆరేళ్ల వయసున్న చిన్న పిల్లలు ఉన్నారు. అలాగే మా ఉమ్మడి కుటుంబంలోనూ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లలకు జ్వరం రావడం, దాంతో మేం ఆందోళన పడటం అన్నది చాలా సాధారణంగా జరుగుతుండేదే. అందుకే పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పండి. – డి. వసుంధర, వీరులపాడు జ్వరం అనేది పలు కారణాల వల్ల రావచ్చు. కానీ సాధారణంగా ఇది హానికారక క్రిముల వల్ల వస్తుంది. జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు నీరసంగా ఉండవచ్చు. ఒళ్లునొప్పులూ, అజీర్తి వంటి సమస్యలు ఉండవచ్చు. అలాగే జ్వరంతో పాటు జలుబు, దగ్గు, వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, శరీరం మీద ఎర్రమచ్చలు లేదా పొక్కులు రావడం చాలా సాధారణంగా కనిపించే లక్షణాలు. కొంతమంది పిల్లలకు (ఆరేళ్ల లోపు పిల్లలకు) మూర్చ కూడా రావచ్చు. శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్హైట్ లేదా 36.9 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన ఉంటే జ్వరం ఉన్నట్టే లెక్క. జ్వరం మందు ఎప్పుడివ్వాలంటే... చంకలో / నుదురు లేదా చెవిలో ఉష్ణోగ్రత 99 డిగ్రీల ఫారెన్హైట్ లేదా 37.2 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన ఉంటే జ్వరం మందు ఇవ్వాలి. నులివెచ్చని నీళ్లలో బట్ట ముంచి తుడవచ్చు. చల్లటినీళ్లతో తుడవకూడదు. పారాసిటమాల్ అనే జ్వరం మందు ఎప్పుడూ ఇంట్లో పెట్టుకోండి. అయితే దీన్ని పిల్లలకు అందుబాటులో ఉంచవద్దు. ఎంత మోతాదులో ఇవ్వాలన్నది డాక్టర్‌ను అడిగి రాసి పెట్టి ఉంచుకోండి. డాక్టర్ రాసిన మందు, మీ దగ్గర ఉన్న మందు ఒక్కటేనా కాదా అన్నది సరిచూసుకొని, సరైన మోతాదు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల జ్వరం అదుపులోకి వస్తుంది. మోతాదు మోతాదుకు మధ్య ఎంత వ్యవధి ఉండాలో కూడా డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి. జ్వరం బాగా తీవ్రంగా ఉన్నా, ఐదు రోజుల తర్వాత కూడా తగ్గకున్నా, పిల్లలు బాగా అలసటగా ఉన్నా లేదా ఆయాసంగా లేదా పీలగా కనిపిస్తున్నా, వణుకుతున్నా లేదా ఇంకేమైనా సూచనలు కనిపిస్తుంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించండి. ఇతర సూచనలు జ్వరంగా ఉన్నప్పుడు పానీయాలు (అంటే... మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటి ద్రవాహారం) బాగా ఇవ్వాలి. జ్వరం వచ్చినవాళ్లకు అజీర్తిగా ఉంటుంది కాబట్టి ఘనాహారం బలవంతంగా ఇవ్వవద్దు. ఏమీ తినడం లేదని గాభరా పడవద్దు. ద్రవాహారం బాగా తీసుకోకపోయినా లేదా మూత్రం పరిమాణం బాగా తగ్గిపోయినా వెంటనే డాక్టర్‌ను కలవాలి. కొంతమంది పిల్లలకు జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు మూర్ఛ రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మూర్ఛ వచ్చినప్పుడు ఇవ్వాల్సిన ప్రథమ చికిత్స గురించి తెలుసుకొని ఉండాలి. ముఖ్య గమనిక : పారసిటమాల్ అనే మందు ఒక మిల్లీలీటర్లో వంద మిల్లీగ్రాముల పారాసిటమాల్గానూ, ఐదు మిల్లీలీటర్లలో నూటఇరమై లేదా రెండువందలయాభై మిల్లీ గ్రాముల పారాసిటమాల్గానూ లభ్యమవుతుంది. కాబట్టి మీరు తీసుకున్న బాటిల్ బట్టి బిడ్డకు ఇవ్వాల్సిన మిల్లీలీటర్లలో వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి సరైన మోతాదు ఏమిటో డాక్టర్‌ను అడగడం, బాటిల్ మీద రాసి ఉన్న మోతాదు (డోసు)తో పోల్చుకొని జాగ్రత్తగా కరెక్ట్ డోస్ ఇవ్వడం చాలా ముఖ్యం. పొరబాటున మోతాదు ఎక్కువైతే ప్రమాదం. ఒకవేళ ప్రమాదవశాత్తు అలా జరిగితే వెంటనే డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.చుక్కల లెక్క లేదా స్పూనుల లెక్క కాకుండా కరెక్ట్‌గా మిల్లీలీటర్ల లెక్కలో పారాసిటమాల్ మందు ఇవ్వండి. మోతాదుకూ, మోతాదుకూ మధ్య సరైన వ్యవధి ఉంచండి. మరో ముఖ్యగమనిక: పిల్లల్లో జ్వరం తెలుసుకోడానికి ఉపయోగించే థర్మామీటర్లలో పాదరసం ఉండేవి (మెర్క్యురీ థర్మామీటర్), డిజిటల్ థర్మామీటర్లు ఇలా రకరకాలు ఉంటాయి. అయితే చిన్నపిల్లల్లో జ్వరం తెలుసుకోడానికి నోట్లో మెర్క్యురీ థర్మామీటరు ఉంచడం వల్ల పొరబాటున అది విరిగితే మెర్క్యురీ పాయిజనింగ్ జరిగే ముప్పు ఉంటుంది. అది చాలా ప్రమాదం. కాబట్టి పిల్లల్లో డిజిటల్ థర్మామీటరు వాడటం చాలా మేలు. ఒకవేళ మెర్క్యూరీ థర్మామీటర్ వాడాల్సి వస్తే దాన్ని నోట్లో పెట్టకూడదు. జ్వరంతో ముర్ఛ వస్తే... ఎలాంటి ప్రథమచికిత్స ఇవ్వాలి? ఇటీవల మూడేళ్ల వయసున్న మా పిల్లవాడికి జ్వరం వచ్చింది. అదే సమయంలో మూర్ఛ కూడా వచ్చింది. జ్వరం తీవ్రత బాగా పెరిగినప్పుడు ఇలా ఫిట్స్ రావడం సాధారణమేనని డాక్టర్ అన్నారు. అయితే పిల్లలకు ఇలా మూర్ఛ వచ్చినప్పుడు ఆసుపత్రికి వచ్చేలోపు ఎలాంటి ప్రథమచికిత్స ఇవ్వాలో దయచేసి చెప్పండి. – ఉదయశంకర్, ఖమ్మం మూర్ఛ వచ్చినప్పుడు ఆ పేషెంట్‌కు అందుబాటులో పదునైనవి, వేడి వస్తువులు లేకుండా చూసుకోవాలి. పేషెంట్ భద్రత దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఇక మూర్ఛ వచ్చిన వ్యక్తి బట్టలను కొంచెం వదులు చేసి, బాగా గాలి తగిలేటట్లు చూడాలి. గదిలోకి కిటికీలు తెరవాలి. చుట్టూ మెత్తని దిండ్లు పెడితే, పిల్లలకు దెబ్బలు తగలకుండా జాగ్రత్త తీసుకున్నవారవుతారు. నోట్లో స్ఫూన్లు పెట్టడం, చేతిలో తాళంచెవులు పెట్టడం, ముఖం మీద చల్లటినీళ్లు చల్లడం వంటివి చేయకూడదు. అలా చేయడం ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదంగా కూడా మారవచ్చు. స్పూన్లు, తాళంచేతుల వల్ల దెబ్బలు తగిలి రక్తస్రావం కూడా కావచ్చు. స్పూను గొంతుకు అడ్డం పడే ప్రమాదం కూడా ఉంది. అకస్మాత్తుగా ముఖం మీద నీళ్లు చిమ్మడం వల్ల మూర్ఛ ఎక్కువ కావచ్చు. మూర్ఛ ఆగేవరకు పైన చెప్పిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇక మూర్ఛ (ఫిట్స్) ఆగాక, అతడు కోలుకునే వరకు రికవరీ స్థితిలో పెట్టండి. ఇలా రికవరీ స్థితిలో పెట్టడం వల్ల ఉమ్ము, వాంతి వంటివి కిందికి కారిపోతాయి. బాథితుడి శ్వాసకు అడ్డుపడవు. ఆరేళ్ల వయసులోపు పిల్లల్లో ఒక్కోసారి జ్వరం తీవ్రంగా ఉంటే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాంటి సమయంలో చేయాల్సిన ప్రథమ చికిత్స ఇలా ఉండాలి. 1 పిల్లాడి కాళ్లను, చేతులను తిన్నగా (స్ట్రెయిట్‌గా) ఉండేట్లుగా జాగ్రత్త తీసుకోవాలి. చిన్నారికి కళ్లజోడు వంటివి ఉండే వాటిని తీసేయాలి. 2 ఒక చేతిని మోచేతి దగ్గర ఒంచాక... మరో చేతిని ఛాతీమీదికి వచ్చేలా వంచి, అరచేతిని చెంప కిందికి వచ్చేలా చూడాలి. 3 మీ చేతితో తన కాలిని వంచుతూ చిన్నారిని ఒకపక్కకు పూర్తిగా ఒత్తిగిలి ఉండేలా (ఒరిగేలా) చూడాలి. (మీవైపునకు తిప్పుకోవడం వల్ల చిన్నారిని బాగా గమనించవచ్చు). అయితే ఈ క్రమంలో తాను పూర్తిగా బోర్లాపడిపోకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి. తలను కాస్త వెనక్కు వంగేలా చూసుకోవాలి. అలాగే నోరు, ముక్కు గాలి ఆడేలా ఉంచాలి. ఇలా పక్కకు ఒరిగిపోయేలా చేయడం వల్ల వాంతి లేదా లాలాజలం (నురుగు) వంటివి పక్కకు కారిపోతాయి. అదే చిన్నారులు వెల్లకిల ఉంచడం వల్ల లాలాజలం/ నురుగు / వాంతి వంటివి నోట్లోనే ఉండిపోయి ఊపిరితిత్తులకు వెళ్లే గాలిని అడ్డగించవచ్చు. అది చాలా ప్రమాదం కాబట్టి ఇలా పిల్లలను పక్కకు ఒరిగి ఉండేలా చూడటం చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలను తీసుకున్న తర్వాత వెంటనే ఆంబులెన్స్‌ను పిలిపించి, వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. మరీ చిన్న పిల్లలైతే... 4 ఏడాదిల లోపు చిన్నారులను మిగతా శరీరం కంటే తల కిందికి ఉండేలా పిల్లలను ఏటవాలుగా వంచాలి. ఇలా చేయడం వల్ల నోట్లోని లాలాజలం, నురుగు, వాంతి వంటివి కిందికి కారిపోయి, శ్వాస తీసుకోడానికి అవి అడ్డుపడవు. ఇది జరిగిన వెంటనే వీలైనంత త్వరగా ఆంబులెన్స్‌ను పిలిచి, చిన్నారిని ఆసుపత్రికి తరలించాలి. - డా‘‘ శివరంజని సంతోష్ ,సీనియర్ పీడియాట్రీషియన్, రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్,మాదాపూర్, హైదరాబాద్ -
పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్
వర్షాల సీజన్లో పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతుంటే... మా ఇంట్లో స్కూలుకు వెళ్లే చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. దాంతో వారికి ఈ సీజన్లో సాధారణంగా కనిపించే వాంతులు, విరేచనాలు అవుతాయేమోనని భయంగా ఉంది. మా ఊరు పట్టణానికి కాస్తంత దూరంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎలా ప్రథమ చికిత్స చేయాలో చెప్పండి. అలా జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించండి. – డి. వాసంతి, మోతే పిల్లలకు వాంతులు, విరేచనాలు అయినప్పుడు వారు తమ శరీరాల నుంచి నీటితో పాటు ఖనిజలవణాలను కోల్పోతారు. దాంతో వారు నీరసపడటం, స్పృహ కోల్పోవడంతో పాటు ఒక్కోసారి ఫిట్స్ బారిన కూడా పడవచ్చు. అది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే వారు కోల్పోయిన నీటిని వెంటనే భర్తీ చేయడం అవసరం. ఇలాంటి సందర్భాల్లో పిల్లలకు ఓఆర్ఎస్ (ఓరల్ రీ–హైడ్రేషన్ సొల్యూషన్) ఇవ్వడం వల్ల వారు కోల్పోయిన ఖనిజలవణాలు భర్తీ అవుతాయి. ఇవి చిన్న చిన్న పాకెట్ల రూపంలో మందుల షాప్‌లో దొరుకుతాయి. ఎంత పౌడర్, ఎన్ని నీళ్లలో కలపాలన్న సూచనలు పాకెట్ మీద రాసి ఉంటుంది. అయితే ఆ ఓఆర్ఎస్ ద్రవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం ఉందా లేదా చూసుకోవాలి. ఒకసారి కలుపుకున్న ద్రవాన్ని 24 గంటల పాటు వాడవచ్చు. ప్రతి ఒక్కరూ ముందుగానే ఇంట్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంచడం మంచిది. ఈ ద్రవాన్ని ప్రతి విరేచనం తర్వాత 30 ఎమ్ఎల్ నుంచి 50 ఎమ్ఎల్ వరకు తాగించాలి. అయితే పెద్ద విరేచనం అయితే 100 ఎమ్ఎల్ పట్టించాలి. వాంతులు అవుతుంటే వాంతి అయిన 15–30 నిమిషాలు ఆగి 5 నిమిషాలకు ఒక స్పూన్ చొప్పున ఓఆర్ఎస్ను నెమ్మదిగా తాగిస్తూ ఉండాలి. కొబ్బరినీళ్లు కూడా ఇవ్వవచ్చు. అయితే పాలు తాగే పిల్లల విషయంలో వాంతి, లేదా విరేచనం అయ్యింది కదా అని తల్లిపాలు మానవద్దు. కొంతమంది తెలియక విరేచనాలు ఆపడానికి మందుల షాపు నుంచి మందులు కొని పిల్లలకు వేస్తారు. ఇలాంటి చర్యల వల్ల ప్రమాదం. పిల్లల్లో ఇన్ఫెక్షన్ ఉంటే... అది కడుపులోనే ఉండిపోయి విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే డాక్టర్లు సూచించిన మందులనే వాడాలి. వాంతులు, విరేచనాలు ఆగకపోయినా / చిన్నారి విపరీతంగా నీరసపడిపోయినా / విపరీతమైన కడుపునొప్పి ఉన్నా / తీవ్రమైన జ్వరం వచ్చినా / రక్తవిరేచనాలు అవుతున్నా లేదా జిగట విరేచనాలు అవుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వాంతులు అవుతున్నప్పుడు వెంటనే ఆహారం ఇవ్వాలని చూడవద్దు. మందుగా ఓఆర్ఎస్ లేదా కొబ్బరినీళ్ల వంటివి బాగా ఇచ్చాక వాంతులు ఆగి, ఆకలిగా అనిపిస్తున్నప్పుడు మాత్రమే తేలిగ్గా ఉండే ఆహారం ఇవ్వాలి. విరేచనాలు అవుతుండగా చక్కెర / తేనె / గ్లూకోజ్ / చాక్లెట్లు / బిస్కెట్లు / పాలు / జ్యూస్‌లు ఇవ్వవద్దు. పాలుతాగే పిల్లల్లో తల్లిపాలు మానవద్దు. బాగా మెత్తగా ఉడికించిన అన్నం, ఇడ్లీ, గంజి, మజ్జిగ, సగ్గుబియ్యం జావ, సూప్‌లు (ఇంట్లో చేసినవి) ఇవ్వవచ్చు. చిన్న పిల్లలకు దెబ్బలు తగిలినప్పుడు... మా ఇంట్లో ప్రైమరీ స్కూల్‌కు వెళ్లే వయసు చిన్నారులు ఉన్నారు. వారు బాగా అల్లరి పిల్లలు. వీళ్లూ, మా పొరుగువాళ్లూ బాగా ఆడుతూ ఉంటారు. తరచూ చిన్నచిన్న దెబ్బలు తగిలించుకుంటూ ఉండటమూ మామూలే. ఇలాంటి సమయంలో హాస్పిటల్‌కు వెళ్లేలోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – ఎమ్. సురేఖ, కేతేపల్లి దెబ్బ తగిలినప్పుడు బిడ్డను కూర్చోబెట్టి శుభ్రమైన బట్టతోగాని, గాజుగుడ్డతో గాని రక్తం కారడం ఆగేవరకు గాయం మీద తేలిగ్గా అదిమిపట్టి ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీళ్లతో గాయాన్ని కడగండి. శుభ్రమైన గాజుగుడ్డను యాంటీసెప్టిక్ సొల్యూషన్ (డెట్టాల్ / బీటాడిన్)లో ముంచి దెబ్బ చుట్టూ తుడవండి. నేరుగా దెబ్బమీద తుడిస్తే బిడ్డల గాయం బాగా మండుతుంది. వారు తట్టుకోలేకపోవచ్చు. అందుకు ముందుగా దెబ్బకు దగ్గరగా తుడవడం మొదలుపెట్టి దూరంగా వెళ్లాలి. తర్వాత శుభ్రమైన పొడి గాజుగుడ్డతో దెబ్బచుట్టూ పైపైన అద్దండి. గాయానికి గాలి తగలనిస్తే త్వరగా తగ్గుతుంది. పిల్లవాడు బయటికి ఆడుకోవడానికి వెళ్లినప్పుడు మాత్రం బ్యాండ్ఎయిడ్తో కవర్ చేయవచ్చు. ఇలా దెబ్బతగిలినప్పుడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ♦ గాయం నుంచి రక్తస్రావం అవుతుంటే... దెబ్బ తగిలిన అవయవ భాగాన్ని ఎత్తి పట్టుకుంటే రక్తస్రావం తొందరగా ఆగుతుంది. ♦ దెబ్బ మీద చేతులతో కడగవద్దు. ట్యాప్ నీళ్ల కిందగానీ లేదా మగ్గులోంచి నీళ్లు ధారగా పోస్తూ గానీ కడగండి. ♦ యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ పూసి, దానిమీద బ్యాండ్ఎయిడ్ పెట్టవచ్చు. ♦ దెబ్బను తుడవడానికి నూలు వాడకండి. అది గాయానికి అంటుకుపోయే ప్రమాదం ఉంది. ♦ డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైతే టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. అయితే షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయిస్తూ, టీటీ టీకా ఇటీవలే తీసుకొని ఉంటే... చిన్న చిన్న దెబ్బలకు టీటీ ఇంజెక్షన్ అవసరం లేదు. ♦ దెబ్బలో ఏదైనా గట్టిగా ఇరుక్కొని ఉంటే దాన్ని బలవంతంగా లాగవద్దు. అలాంటి సందర్భాల్లో డాక్టర్‌కు చూపించడమే మంచిది. ♦పంచదార, పేస్ట్, టీపొడి లాంటివి దెబ్బమీద అంటించవద్దు. ♦ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నవారు మీ ఫస్ట్‌ఎయిడ్ కిట్‌లో గాజుపీస్లు, యాంటీసెప్టిక్ సొల్యూషన్, బ్యాండ్ఎయిడ్, యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ వంటివి ఎప్పుడూ అందుబాటులోఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. - డాక్టర్ శివరంజని సంతోష్ ,సీనియర్ పీడియాట్రీషియన్, రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్ -
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
పాపకు తలలో పదేపదే ర్యాష్! మా పాపకు పదకొండు నెలల వయస్సు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్గారికి చూపించి చికిత్స చేయిస్తే తగ్గింది గానీ మళ్లీ పదే పదే తిరగబెడుతోంది. మా పాపకు ఉన్న సమస్య ఏమిటి? – ఎమ్. శారద, సామర్లకోట మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. అలాగే కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలిక సమస్యగానే చెప్పవచ్చు. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడుపైన పొరల్లా ఊడటం, కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపించడం జరుగుతుంది. దీనికి కారణం ఫలానా అని నిర్దిష్టంగా చెప్పలేకపోయినా... కొన్నిసార్లు ఎమ్. పర్పూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనక భాగానికి, చెవుల వరకు వ్యాపిస్తుంది. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు. చికిత్స : ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, శాల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న కీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటివి చేయాలి. దాంతో ఈ సమస్య నయమవుతుంది. అలాగే ఈ సమస్యతో ప్రభావితమైన భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం కూడా చాలా ముఖ్యం. బాబుకుతరచూతలనొప్పి..ఏం చేయాలి? మా బాబు వయసు తొమ్మిదేళ్లు. తరచూ తలనొపితో బాధపడుతున్నాడు. ఇంతకుముందు చాలా అరుదుగా వచ్చేది. కాని ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. మధ్యలో కొంతకాలం బాగానే ఉంటోంది. మళ్లీ మళ్లీ తలనొప్పి వస్తోంది. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి. – జి. సుబ్రహ్మణ్యమూర్తి, వరంగల్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో అంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్‌తో పాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్ వల్ల వస్తున్న తలనొప్పి అని భావించవచ్చు. అయితే ఈ మైగ్రేన్‌లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో వెలుతురు చూడటానికి ఇష్టపడకపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది తీవ్రంగా ఉండే కొంతమందిలో దీని వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు బలహీనంగా మారడం కూడా కనిపించవచ్చు. చికిత్స : ∙చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం ∙నుదిటిపై చల్లటి నీటితో అద్దడం ∙నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు ఎన్ఎస్ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం ∙నీళ్లు ఎక్కువగా తాగించడం ∙ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం. పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్‌ను చాలావరకు తగ్గించవచ్చు. అయితే ఇది చాలా తరచూ వస్తుంటే మాత్రం ప్రొఫిలాక్టిక్ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోవడం అవసరం. మా బాబు ఎదుగుదల నార్మల్‌గానే ఉందా? మా బాబుకు 15 నెలలు. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. అయితే వాడు ఇంకా సపోర్ట్ తీసుకోకుండా నడవలేకపోవడం, ముద్దుమాటలాడకపోవడం చూస్తే వాడి ఎదుగుదలలో ఏవైనా లోపాలున్నాయేమోనని అప్పుడప్పుడూ అనిపిస్తోంది. దాంతో తీవ్ర వేదనకు గురవుతున్నాం. పిల్లల వికాసం ఏయే సమయాల్లో ఎలా ఉంటుందో విపులంగా వివరించండి. – సువర్ణకుమారి, కాకినాడ మీ బాబు ఎదుగుదల విషయంలో కాస్త నిదానంగా ఉన్నాడంటూ మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే... మీరలా అనుకోవడానికి కారణలేమీ కనిపించడం లేదు. ప్రతి పిల్లవాడి ఎదుగుదల, వికాసం వేర్వేరుగా ఉంటాయి. పిల్లల డెవలప్మెంట్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఫలానా పిల్లలు ఫలానా సమయంలోనే ఫలానా నైపుణ్యాలను నేర్చుకుంటారని చెప్పడం కుదరదు. కొంతమంది చాలా త్వరగా నడుస్తారు, మాట్లాడతారు. మరికొందరు కాస్త ఆలస్యంగా. అయితే ఎవరు ఎప్పుడు ఆ నైపుణ్యాలు నేర్చుకుంటారన్నది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు... నెలలు నిండకముందే పుట్టడం, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి ఏవైనా సమస్యలు రావడం, పుట్టాక జాండీస్, ఇన్ఫెక్షన్స్ వంటివి రావడం, కొన్ని జన్యుపరమైన కారణాలు, పిల్లలను పెంచే ప్రక్రియలో తల్లిదండ్రులు ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉండటం, కవల పిల్లలు కావడం వంటి అనేక అంశాలు వాళ్ల ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నడక: సాధారణంగా పిల్లలు 11 నుంచి 16 నెలల మధ్య నడవడం ప్రారంభిస్తారు. కొందరు ఆలస్యంగా నడవడం మొదలుపెట్టవచ్చు. 18 నెలల పిల్లలు నడవడంతో పాటు ఏదైనా వస్తువులు పట్టుకుని లాగడం, వస్తువులను దూరంగా నెట్టడం, బుక్ చేతికి ఇచ్చినప్పుడు పేజీలు తిప్పడం, క్రేయాన్స్ వంటివి ఇస్తే వాటితో నేలమీద, గోడల మీద రాయడం, నేల మీదే దృష్టిపెట్టి పరుగెత్తడం వంటివి సులభంగా చేస్తుంటారు. రెండేళ్లు వచ్చే సరికి తలుపులు తెరవడం, సొరుగులు లాగడం, చేతులు కడుక్కోవడం, మెట్లు ఎక్కడం లాంటివి చేస్తుంటారు. అయితే ఈ పనులు చేయడంలోనూ పిల్లవాడికీ, పిల్లవాడికీ మధ్య తేడాలుంటాయి. మాటలు: ఇక మాటల విషయానికి వస్తే 15 నెలలు నిండిన చిన్నారులు ముద్దుమాటలతో పాటు, ఒకటి రెండు శబ్దాలు పలకడం చేస్తుంటారు. 18 నుంచి 24 నెలల వయసుకు వాళ్లు 15–20 పదాలు పలకడంతో పాటు తల్లిదండ్రుల సూచనలకు రెస్పాండ్ అవుతుంటారు. 18–20 నెలల వయసు వచ్చేటప్పటికి కొద్దిగా కూడా మాటలు రాకపోతే, చుట్టుపక్కల శబ్దాలకు ఏమాత్రం రెస్పాండ్ కాకపోతే... అప్పుడు అలాంటి పిల్లలకు డెవలప్మెంట్ డిలే ఉన్నట్లుగా పరిగణిస్తాం. అలాంటి పిల్లల్లో వినికిడి లోపాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక మీ బాబు విషయానికి వస్తే... అతడు కొన్ని శబ్దాలను పలకడం, కొన్ని వస్తువుల ఆసరాతోనైనా నిలబడటం వంటివి చేస్తున్నాడు. ఇతరత్రా సమస్యలేమీ లేవు. డెవలప్మెంట్ డిలేని సూచించే లక్షణాలేమీ కనిపించడం లేదు. అయితే ఇలా డెవలప్మెంట్ డిలే ఉన్నట్లు అనుమానించే పిల్లల విషయంలో క్రమం తప్పకుండా ఫాలో అప్‌లతో పాటు క్లోజ్ అబ్జర్వేషన్ చాలా ప్రధానం. ఒకవేళ నిజంగానే గ్రాస్ డెవలప్మెంట్ డిలే ఉంటే త్వరగా కనుక్కుని అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవడం (అర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్) ద్వారా వాళ్లను సరిచేయడానికి అవకాశం ఉంది. మీరు మీ పీడియాట్రీషియన్‌తో తరచూ ఫాలోఅప్‌లో ఉండండి. మీ పీడియాట్రీషియన్ సూచనలను తప్పక పాటించండి. - డా. రమేశ్‌బాబు దాసరి ,సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
తొందరపడి ఆపరేషన్... ఇప్పుడు బిడ్డ కావాలి!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. ఈ వేసవిలో విహారయాత్రకు వెళ్లొచ్చిన తర్వాత ఆకలి మందగించింది. మలబద్దకంగా అనిపించడంతో పాటు మూత్రం పచ్చగా వస్తోంది. కొందరు కామెర్లు వచ్చాయని అంటున్నారు. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? - రాజ్‌కుమార్, హైదరాబాద్ కామెర్లు అనేది కాలేయ సంబంధిత వ్యాధి. ఒక వ్యక్తి ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు అతని కంటే ముందుగా ఇతరులే దీన్ని గుర్తిస్తారు. రక్తంలో బిలురుబిన్ పాళ్లు పెరిగినప్పుడు చర్మం, కనుగుడ్లు, మ్యూకస్ మెంబ్రేన్స్‌లో పసుపుపచ్చ రంగు తేలడాన్ని పచ్చకామెర్లు అంటారు. శరీరానికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్‌ను రక్తంలోకి ఎర్రరక్తకణాలు సరఫరా చేస్తాయి. ఇందులో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని జీవితకాలం 120 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత హీమోగ్లోబిన్‌లోని హీమ్ అనే పదార్థం ప్లీహం (స్ల్పీన్)లో శిథిలమైపోయి బైలురుబిన్, బైలివర్డిన్ అనే పసుపు రంగు వ్యర్థ పదార్థాలుగా మారిపోతాయి. శరీరంలో పసుపు రంగు పదార్థాలు పేరుకుపోవడాన్ని కామెర్లుగా చెప్పవచ్చు. సాధారణంగా కాలేయం ఈ వ్యర్థ పదార్థాలను సేకరించి, పైత్యరసంతో పాటు కాలేయ వాహిక (బైల్ డక్ట్) ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడి నుంచి మలంతో పాటు ఈ పసుపు రంగు వ్యర్థపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కామెర్లకు కారణాలు: హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనే వైరస్ల కారణంగా కామెర్లు వచ్చే అవకాశం ఉంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు కాలేయం పాడైపోవడం కాలేయం నుంచి పేగుల్లోకి వెళ్లే కాలేయ వాహికలో అంతరాయం ఏర్పడటం వంటివి జరిగితే కామెర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది. లక్షణాలు: వికారం, వాంతులు పొత్తికడుపులో నొప్పి జ్వరం, నీరసం, తలనొప్పి కడుపు ఉబ్బరంగా ఉండటం కామెర్లు సోకినప్పుడు కళ్లు పచ్చబడటం. వ్యాధి నిర్ధారణ: సీబీపీ, ఎల్ఎఫ్టీ, సీటీ స్కాన్, ఎమ్మారై, అల్ట్రా సౌండ్ స్కాన్ చికిత్స: కామెర్లను తగ్గించడానికి హోమియోపతిలో మంచి మందులున్నాయి. రోగి లక్షణాలను, శారీరక, మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకొని డాక్టర్లు మందులు సూచిస్తారు. ప్రారంభదశలోనే వాడితే కామెర్లను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సమస్యకు హోమియోలో చెలిడోనియం, సెలీనియం, లైకోపోడియం, మెర్క్‌సాల్, నాట్‌సల్ఫ్ వంటి మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు 10 నెలలు. గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు పాప ముఖం నీలంగా మారిపోతోంది. ఇది చాలా ఆందోళనగా కలిగిస్తోంది. మా పాప సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - ధరణి, కోదాడ మీ పాప సమస్యను ‘బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. పాప కాసేపు ఊపిరి తీసుకోకుండా ఉండటంతో ఇలా జరుగుతోంది. పిల్లల్లో కోపం / ఫ్రస్టేషన్ / భయం / కొన్ని సందర్భాల్లో గాయపడటం జరిగినప్పుడు ఇలా కావడం చాలా సాధారణం. ఈ సమస్య గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలల నుంచి 24 నెలల లోపు పిల్లల్లో ఇది ఎక్కువ. కుటుంబ చర్రితలో ఈ లక్షణం ఉన్నవారి పిల్లల్లో ఇది ఎక్కువ. ఈ లక్షణం ఉన్న పిల్లలు పెద్దయ్యాక చాలా మొండిగా అవుతారంటూ అపోహలున్నా, వాటికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఇది ఎందుకు వస్తుందనేది చెప్పడం కష్టమైనప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంది. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్‌లో... సింపుల్, సైనోటిక్, పాలిడ్, కాంప్లికేటెడ్ అని నాలుగు రకాలు ఉన్నాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు వస్తోంది సైనోటిక్ అనిపిస్తోంది. ఇక ప్యాలిడ్ అనే రకంలో పిల్లలు పాలిపోయినట్లుగా అయిపోయి, స్పృహతప్పిపోతారు. ఇటువంటి పిల్లల్లో ఒకసారి ఈసీజీ, ఈఈజీ తీయించడం అవసరం. ఎందుకంటే గుండెకు సంబంధించిన తీవ్రమైన కారణాలు ఏవైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే... పాపలో ఈ ధోరణి కనిపించినప్పుడు కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పడమే మొదటి చేయాల్సిన పని. ఇక చాలా కొద్దిమందిలో మాత్రం ఐరన్ ఇవ్వడం ఉపయోగకరం. పిల్లలూ, తల్లిదండ్రుల మధ్య ప్రేమాభిమానాలు బలపడినకొద్దీ ఈ లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఈ సమస్య కనిపించడం చాలా అరుదు. పైన పేర్కొన్న పరీక్షలు కూడా పాపకు ఏవైనా తీవ్రమైన సమస్య ఉన్నాయేమోనని తెలుసుకోడానికి మాత్రమే. ఈ విషయంలో నిర్భయంగా ఉండండి. మరీ అవసరమైనప్పుడు మీ పిల్లల డాక్టర్‌ను ఒకసారి సంప్రదించండి. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. జీవితంలో సెటిల్ అవకముందే పిల్లలు ఎందుకని గతంలో 3 సార్లు మందుల ద్వారా, 2 సార్లు ఆపరేషన్ ద్వారా గర్భధారణ కాకుండా అడ్డుకున్నాం. ఈ మధ్యే ఒక పాప పుట్టింది. ఏదో కంగారులో మా వారు డెలివరీ సమయంలోనే నాకు కు.ని. ఆపరేషన్ చేయించడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడేమో ‘తొందర పడ్డాను, మళ్లీ పిల్లలు కావాలంటే ఎలా’ అని బాధపడుతున్నారు. ఐవీఎఫ్, సర్రోగసీ లాంటి ఖర్చుతో కూడిన పద్ధతులు కాకుండా ఆపరేషన్ జరిగాక కూడా వేరే ఏదైనా పద్ధతి ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందా? ఒకవేళ వీలైనా భవిష్యత్‌లో నాకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా తెలియజేయగలరు? - ఓ సోదరి, విజయవాడ గర్భధారణ ప్రక్రియ నార్మల్‌గానే జరిగేందుకు వీర్యం, అండం, ఫెలోపియన్ ట్యూబ్స్ అవసరం. ట్యూబెక్టమీ ఆపరేషన్‌లో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ రెండింటినీ బ్లాక్ చేస్తారు. ఫలితంగా వీర్యం, అండం ఈ ట్యూబ్లలో కలవడానికి వీలుండదు. తద్వారా గర్భాన్ని నివారించడం జరుగుతుంది. ట్యూబెక్టమీ జరిగితే మీకు నార్మల్‌గా గర్భధారణ సాధ్యం కాదు. ఇక ఉన్న మార్గాల్లో ఒకటి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్). ఇందులో మీ నుంచి అండాన్ని, మీ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి, ల్యాబ్‌లో ఫలదీకరణం చేసి, ఇలా రూపొందిన పిండాన్ని మీ గర్భసంచి (యుటెరస్)లోకి ప్రవేశపెడతారు. కానీ మీరు ఈ ప్రక్రియ పట్ల ఆసక్తిగా లేరు. ఇక రెండో మార్గం... మీ ట్యూబ్స్ మార్గాన్ని పునరుద్ధరించడం. దీన్ని ట్యూబల్ రీ-కెనలైజేషన్ అని అంటారు. ఈ ప్రక్రియలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లో మూసిన మీ ట్యూబ్స్‌ను మళ్లీ తెరుస్తారు. అయితే దీన్ని తెరిచే ముందర కొంత ప్లానింగ్ అవసరం. ఇందులో మీ ఫెలోపియన్ ట్యూబ్‌ల పొడవు, అక్కడ మిగిలి ఉన్న ట్యూబ్‌ల సైజును బట్టి, ఈ ప్రక్రియ ఎంత వరకు విజయవంతమవుతుందో చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో మీకు మత్తు (అనస్థీషియా) ఇచ్చి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే దానికి ముందర మీ దంపతులతో కొన్ని చర్చలు, కొంత కౌన్సెలింగ్ అవసరం. ఇక సరోగసీ లాంటి ప్రక్రియలు మీ కేసులో అవసరం లేదు. గతంలో మీరు మూడు సార్లు మందుల ద్వారా, రెండు సార్లు ఆపరేషన్‌తో రెండు సార్లు గర్భధారణను అడ్డుకున్నారు. అలాంటి ప్రక్రియలతో కొన్నిసార్లు ఫెలోపియన్ ట్యూబ్స్‌లో అడ్డంకులు ఏర్పడటం, మూసుకుపోవడం, గర్భసంచి లోపలి పొర అతుక్కుపోవడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. అలాంటి ప్రమాదాలు నివారించేందుకు తాత్కాలిక గర్భనివారణ మార్గాలు ఎన్నో ఉన్నాయి. మీరు వాటిని అనుసరించి ఉండాల్సింది. అది జరిగిపోయిన విషయం కాబట్టి ఇప్పుడు మీరు తదుపరి బిడ్డ కోసం గట్టిగా నిశ్చయించుకుంటే, ఒకసారి మీకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి మీ డాక్టర్‌తో ఒకసారి నేరుగా చర్చించండి. మీకు ఉపయుక్తమైన మార్గాన్ని అవలంబించండి. -
వాల్వులోప్లాస్టీ అంటే ఏమిటి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఏడేళ్లు. ఎప్పుడూ దాహం అంటూ ఉంటే తరచూ నీళ్లు తాగించేవాళ్లం. చర్మంపై కూడా ర్యాష్ వచ్చింది. పాప కంప్లెయింట్‌ను మా డాక్టర్ గారికి చెబితే ఆయనకు అనుమానం వచ్చి షుగర్ టెస్ట్ చేయించారు. పాపకు డయాబెటిస్ అని చెప్పారు. ఇంత చిన్నపిల్లల్లోనూ డయాబెటిస్ వస్తుందా? దయచేసి మా పాప విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - సువర్చల, విజయవాడ మీ పాప కండిషన్‌ను జ్యూవెనైల్ డయాబెటీస్ అంటారు. దీన్నే టైప్ వన్ డయాబెటీస్ అని కూడా అంటారు. ఇది నెలల పిల్లలకూ రావచ్చు. డయాబెటిస్ రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో జన్యుపరంగా సంక్రమించడం ఒక కారణం. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అంతవూత్రాన ఆందోళనపడాల్సిందేమీ లేదు. వీళ్లలో చక్కెర నియుంత్రణ చేస్తూ ఉంటే మిగతా అందరు సాధారణమైన పిల్లల్లాగానే వీళ్లూ పెరిగి తవు ప్రతిభాపాటవాలు చూపుతారు. ఇలాంటి పిల్లల్లో మందుల ద్వారా, ఆహారం ద్వారా డయూబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. పిల్లల్లోనే ఇలా డయూబెటిస్ రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు... కొన్ని రసాయునాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు కారణం అవుతాయి. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్ వాడటం తప్పనిసరి. ఈ పిల్లల చేత క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్లు చేయించడం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయుడం కూడా అవసరం. డయాబెటీస్ ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయూలు నేర్చుకొని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. డయూబెటిక్స్ ఉన్న పిల్లలయితే వాళ్లలో సాధారణంగా బరువు పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచూ వాంతులు కావడం, డీ-హైడ్రేషన్, చర్మంపై రాషెస్ వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల్లో చక్కెర నియుంత్రణ లేకపోతే పోను పోనూ రక్తపోటు పెరగడం, మూత్రపిండాల సమస్యలు. కంటికి సంబంధించిన రుగ్మతలు, కరోనరీ గుండె సవుస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా అవేవీ రాకుండా జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా కాకుండా నోటి ద్వారా లేదా ఇన్హెలేషన్ (పీల్చడం) ద్వారా ఇచ్చే ప్రక్రియులు అందుబాటులోకి రాబోతున్నాయి. పాంక్రియాటిక్ సెల్స్ (ఇన్సులిన్ తయారు చేసే కణాల) మార్పిడి శస్త్రచికిత్స కూడా పరిశోధన దశలో ఉంది. అలాంటి చికిత్స వూర్గాలు అందుబాటులోకి వస్తే ఈ పిల్లలకు చికిత్స ప్రక్రియులు వురింత సులువవుతాయి. మీరు పీడియూట్రిషియున్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం తప్పనిసరి. - డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 68. ఇప్పటివరకూఎలాంటి ఆరోగ్య సమస్యా లేదు. ఇటీవలే అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో డాక్టర్‌ను కలిశాను. ఆయన పరీక్షలు చేయించి, నాకు వాల్వులోప్లాస్టీ చికిత్స అవసరమని అన్నారు. వాల్వులోప్లాస్టీ అంటే ఏమిటో దయచేసి వివరించండి. - నాగేంద్రరావు, వినుకొండ గుండె కవాటాలను సరిచేయడానికి చేసే చికిత్సను వాల్వులోప్లాస్టీ అంటారు. ఎడమపక్కన ఉన్న మైట్రల్ వాల్వ్ మూసుకుపోయినప్పుడు, దాన్ని బెలూన్ సహాయంతో వెడల్పు చేస్తారు. దీన్ని పీబీఎంఏ అంటారు. ఇక పల్మునరీ వాల్వులోప్లాస్టీలో గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనికి ఉన్న కవాటం అయిన పల్మునరీ వాల్వు మూసుకుపోతే... దాన్ని బెలూన్ ద్వారా తెరుస్తారు. దీన్ని పీబీపీఏ అంటారు. ఈలోపం సాధారణంగా చిన్న వయసులో వచ్చేది కాబట్టి చిన్న వయసులోనే సరిచేయవచ్చు. గుండె నుంచి రక్తాన్ని శరీరానికి తీసుకెళ్లే ధమని కవాటాన్ని అయోర్టిక్ కవాటం అంటారు. ఇది మూసుకుపోయినప్పుడు పీబీఏవీ ప్రక్రియ ద్వారా సరిచేయవచ్చు. ఇక ట్రైకస్పిడ్ అనే కవాటం మూసుకుపోయినప్పుడు బెలూన్ సహాయంతో తెరవడాన్ని పీబీటీఏ అంటారు. ఇలా ఈ ప్రక్రియలతో కవాటాలను తెరుస్తూ చేసే చికిత్సతో మీలాంటి రోగుల ఇబ్బందులను దూరం చేయవచ్చు. మా బాబు వయసు ఏడేళ్లు. పుట్టినప్పుడు అంతా మామూలుగానే ఉన్నాడు. కానీ... ఈమధ్య తరచుగా దగ్గు, జలుబు వస్తోంది. రెండువారాల క్రితం మాకు దగ్గరలోని ఒక డాక్టర్ పరీక్షించి గుండెజబ్బు ఉండవచ్చని చెప్పారు. అప్పటినుంచి మాకు ఆందోళనగా ఉంది. మా అబ్బాయి విషయంలో ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి. - దీపక్, విజయనగరం మీరు చెప్పినదాన్ని బట్టి మీ బాబుకు పుట్టుకతో వచ్చే గుండెజబ్బు... అంటే గుండెలో రంధ్రం (ఏఎస్డీ లేదా వీఎస్డీ) ఏర్పడి ఉండవచ్చునని అనిపిస్తోంది. కానీ మీ బాబు విషయంలో మంచిని సూచించే విషయం ఏమిటంటే... ఇప్పటికవరకు మీ బాబు మామూలుగానే ఉన్నాడు. కాబట్టి ఆ రంధ్రం చాలా చిన్నదై ఉండే అవకాశం ఉంది. ఇటువంటి వారికి ఈమధ్య వచ్చిన ఆధునిక టెక్నాలజీ సహకారంతో ఏ ఆపరేషన్ లేకుండానే ‘డివైజ్ క్లోజర్’ అనే ప్రక్రియ ద్వారా పూర్తిగా నార్మల్‌గా అయ్యేలా చేయవచ్చు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు ఆందోళన వీడి, ఇంకా కాలయాపన చేయకుండా వెంటనే మీకు దగ్గరలో గుండె వ్యాధులకు అడ్వాన్స్డ్ చికిత్సలు లభ్యమయ్యే సెంటర్లో మీ బాబును చూపించండి. - డాక్టర్ అనూజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 62 ఏళ్లు. గృహిణిని. నా కాళ్లు ఎప్పుడూ తడిలోనే ఉంటుంటాయి. శాండల్స్ కూడా వేసుకోను. ఈమధ్య నా కాలి వేళ్ల మధ్యన చర్మం చెడినట్లుగా అవుతోంది. చూడటానికి ఎర్రగా, ముట్టుకుంటే మంటగా అనిపిస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - అనసూయ, నెల్లూరు మీరు చెబుతున్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. నీళ్లలో ఎక్కువగా ఉండేవారు, నిత్యం నీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండేవారికి ఇది ఎక్కువగా వస్తుంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘క్యాండిడియాసిస్’ అంటారు. మీ సమస్యను దూరం చేసుకోవడం కోసం మీరు ‘టెర్బినఫైన్’ అనే మందు ఉన్న క్రీమును ప్రతిరోజూ ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి చొప్పున నాలుగు వారాల పాటు రాసుకోవాలి. అలాగే ఇట్రకొనజోల్ 100 ఎంజీ అనే ట్లాబ్లెట్ను పొద్దునే టిఫిన్ అయ్యాక వేసుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది కొన్నాళ్ల పాటు మీరు తడిలో, తేమ ఉన్న చోట కాలు పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదా అలాంటిచోట్ల తిరగాల్సి వస్తే కాలికి తడి అంటకుండా స్లిప్పర్లు వేసుకొని తిరగండి. నా వయసు 27 ఏళ్లు. ఇంత చిన్న వయసులోనే నా తలవెంట్రుకలు రాలిపోవడం గమనించాను. ఇది ఇలాగే కొనసాగితే ఇప్పుడే బట్టతల వస్తుంది. నేను ఆత్మన్యూనతకు గురవుతున్నాను. నా బట్టతలకు చికిత్స విషయంలో చేయాలో - కిరణ్, కొత్తపేట మీ జట్టు రాలిపోతుందంటే బహుశా మీ జన్యువుల ప్రభావమే కారణం కావచ్చు. ఇటీవల పురుషుల్లో వచ్చే బట్టతలకు ఫెనస్టెరైడ్ మినాక్సిడిల్, పీఆర్పీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ పూర్తి మెడికల్ హిస్టరీని అధ్యయనం చేసి, మీ బట్టతలకు ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఆ తర్వాతనే పైన పేర్కొన్న మందులను తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. మీరు దగ్గరలోని అనుభవజ్ఞులైన డర్మటాలజిస్టును కలవండి. - డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
పీడియాట్రీ కౌన్సెలింగ్
మా అమ్మాయికి ఏడేళ్లు. ఆమె మెడలో ఒక గడ్డ కనిపిస్తోంది. ఇది కనీసం ఐదారు నెలల నుంచి ఉంది. డాక్టర్‌కు చూపించాం. ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. ఇటీవల అది కాస్త పెద్దదైందేమోనని అనుమానంగా ఉంది. ఈ గడ్డ ఏమిటి? మేం చికిత్స కోసం ఎవరిని కలవాలో చెప్పండి. - ధనలక్ష్మి, నిజామాబాద్ మీరు చెప్పిన సమాచారాన్ని బట్టి మెడ భాగంలో గడ్డలుగా ఉన్నవి లింఫ్‌నోడ్స్ అయి ఉండవచ్చు. ఈ కండిషన్‌ను సర్వైకల్ లింఫెడినోపతి అంటారు. పిల్లల్లో మెడ భాగంలో లింఫ్ గ్రంథులు పెద్దవిగా (వివిధ సైజుల్లో) ఉండటాన్ని చాలా సాధారణంగా చూస్తుంటాం. లింఫ్‌నోడ్స్ ఇలా పెద్దవి అవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. సాధారణ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్తో మొదలుకొని తీవ్రమైన క్యాన్సరస్ పెరుగుదల వంటి ప్రమాదకరమైన కండిషన్స్‌కు కూడా ఇదో సూచన కావచ్చు. ఇక సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, టీబీ లేదా టీబీ కాని బ్యాక్టీరియాలు, లింఫోమా (క్యాన్సర్) వంటి పెద్ద కారణాలతో పాటు, కొన్నిసార్లు కనెక్టివ్ టిష్యూ డిసీజ్, చెవికి గాయం కావడం (చెవి కుట్టించినప్పుడు కూడా), రకరకాల గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి అతి మామూలు కారణాల వల్ల కూడా ఈ గ్లాండ్స్ పెద్దవి కావడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్లాండ్స్ ఎంత పరిమాణంలో పెరిగాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ఇలా పెరగడం అన్నది చాలా సందర్భాల్లో చాలా సాధారణమైన వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్లనే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వారం నుంచి రెండు వారాల పాటు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేసి చూస్తాం. అప్పటికీ ఇవి తగ్గకుండా ఉండటంతో పాటు, వీటి పరిమాణం 2.5 సెం.మీ. కంటే పెద్దవిగా ఉంటే తప్పనిసరిగా కొన్ని రక్తపరీక్షలతో పాటు, బయాప్సీ కూడా చేయించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒకే నోడ్ పెద్దగా అయి ఇబ్బంది పెడుతుంది. అప్పుడు కూడా బయాప్సీ చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీ పాప సాధారణ ఆరోగ్యం కూడా బాగానే ఉంది కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. అయితే గ్లాండ్ పెరుగుతున్నట్లుగా అనుమానిస్తున్నారు కాబట్టి తదుపరి అంశాల నిర్ధారణ కోసం ఒకసారి బయాప్సీ చేయించండి. తొలుత మీ దగ్గరలో ఉన్న పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి ఆ తర్వాతి చర్యలు తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి,సీనియర్ పీడియాట్రీషియన్ స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పీడియాట్రీ కౌన్సెలింగ్
మా బాబు వయసు పదేళ్లు. వాడు ఇప్పటికీ పక్కతడుపుతూనే ఉంటాడు. రాత్రిళ్లు ప్రతి రెండు గంటలకోసారి యూరిన్‌కు వెళ్తుంటాడు. పగలు కూడా ఎక్కువగానే వెళ్తుంటాడు. ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటాడు. మావాడి సమస్యకు తగిన సలహా ఇవ్వండి. - ధరణి, భీమవరం మీ బాబుకు ఉన్న కండిషన్‌ను ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అని చెప్పవచ్చు. యూరిన్ పరిమాణం ఎక్కువ వస్తోంది కాబట్టి పాలీయూరియా అన్న కండిషన్ కూడా ఉందేమోనని కూడా అనుమానించాలి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్, మానసిక సమస్యలు, ఎండోక్రైన్ సమస్యలు, యూరినరీ బ్లాడర్ డిజ్‌ఫంక్షన్, దీర్ఘకాలికమైన కిడ్నీ సమస్యలు, మలబద్దకం వంటివి ముఖ్యమైనవి. మీ బాబు సమస్యకు కారణాన్ని తెలుసుకోడానికి కంప్లీట్ యూరిన్ అనాలిసిస్, 24 గంటల్లో అతడు విసర్జించే మూత్రపరిమాణం పరీక్షలతో పాటు యూరిన్ ఆస్మనాలిటీ, అల్ట్రాసౌండ్ ఆఫ్ కేయూబీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రివరకు ఈ పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగకుండా చూడటం, తియ్యటి పదార్థాలను ఎక్కువగా తినకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. యూరిన్ పాస్ చేసేటప్పుడు విసర్జన పూర్తిగా చేసేలా చూడటం ప్రధానం. ఇలాంటి మంచి విసర్జక అలవాట్లతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. అయితే పైన పేర్కొన్న కారణాలలో ఏవైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించండి. మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. - డాక్టర్ రమేశ్‌బాబు దాసరి,సీనియర్ పీడియాట్రీషియన్ స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్