పీడియాట్రీ కౌన్సెలింగ్ | Pediatric Counseling | Sakshi
Sakshi News home page

పీడియాట్రీ కౌన్సెలింగ్

Published Fri, Jun 5 2015 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

Pediatric Counseling

మా అమ్మాయికి ఏడేళ్లు. ఆమె మెడలో ఒక గడ్డ కనిపిస్తోంది. ఇది కనీసం ఐదారు నెలల నుంచి ఉంది. డాక్టర్‌కు చూపించాం. ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. ఇటీవల అది కాస్త పెద్దదైందేమోనని అనుమానంగా ఉంది. ఈ గడ్డ ఏమిటి? మేం చికిత్స కోసం ఎవరిని కలవాలో చెప్పండి.
 - ధనలక్ష్మి, నిజామాబాద్
 

మీరు చెప్పిన సమాచారాన్ని బట్టి మెడ భాగంలో గడ్డలుగా ఉన్నవి లింఫ్‌నోడ్స్ అయి ఉండవచ్చు. ఈ కండిషన్‌ను సర్వైకల్ లింఫెడినోపతి అంటారు. పిల్లల్లో మెడ భాగంలో లింఫ్ గ్రంథులు పెద్దవిగా (వివిధ సైజుల్లో) ఉండటాన్ని చాలా సాధారణంగా చూస్తుంటాం.
 లింఫ్‌నోడ్స్ ఇలా పెద్దవి అవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. సాధారణ ఇన్ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్‌తో మొదలుకొని తీవ్రమైన క్యాన్సరస్ పెరుగుదల వంటి ప్రమాదకరమైన కండిషన్స్‌కు కూడా ఇదో సూచన కావచ్చు.

ఇక సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, టీబీ లేదా టీబీ కాని బ్యాక్టీరియాలు, లింఫోమా (క్యాన్సర్) వంటి పెద్ద కారణాలతో పాటు, కొన్నిసార్లు కనెక్టివ్ టిష్యూ డిసీజ్, చెవికి గాయం కావడం (చెవి కుట్టించినప్పుడు కూడా), రకరకాల గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి అతి మామూలు కారణాల వల్ల కూడా ఈ గ్లాండ్స్ పెద్దవి కావడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్లాండ్స్ ఎంత పరిమాణంలో పెరిగాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ఇలా పెరగడం అన్నది చాలా సందర్భాల్లో చాలా సాధారణమైన వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్లనే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వారం నుంచి రెండు వారాల పాటు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేసి చూస్తాం.

అప్పటికీ ఇవి తగ్గకుండా ఉండటంతో పాటు, వీటి పరిమాణం 2.5 సెం.మీ. కంటే పెద్దవిగా ఉంటే తప్పనిసరిగా కొన్ని రక్తపరీక్షలతో పాటు, బయాప్సీ కూడా  చేయించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒకే నోడ్ పెద్దగా అయి ఇబ్బంది పెడుతుంది. అప్పుడు కూడా బయాప్సీ చేయించాల్సిన అవసరం ఉంటుంది.
 
ఇక మీ పాప సాధారణ ఆరోగ్యం కూడా బాగానే ఉంది కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. అయితే గ్లాండ్ పెరుగుతున్నట్లుగా అనుమానిస్తున్నారు కాబట్టి  తదుపరి అంశాల నిర్ధారణ కోసం ఒకసారి బయాప్సీ చేయించండి. తొలుత మీ దగ్గరలో ఉన్న పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి ఆ తర్వాతి చర్యలు తీసుకోండి.

డాక్టర్ రమేశ్‌బాబు దాసరి,సీనియర్ పీడియాట్రీషియన్
స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement