పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌ | Pediatric Counseling | Sakshi
Sakshi News home page

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

Published Mon, Aug 27 2018 12:22 AM | Last Updated on Mon, Aug 27 2018 12:22 AM

Pediatric Counseling - Sakshi

చిన్నపిల్లలకు జ్వరం వస్తే... తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మాది పెద్ద కుటుంబం. మాకు తొమ్మిది, ఆరేళ్ల వయసున్న చిన్న పిల్లలు ఉన్నారు. అలాగే మా ఉమ్మడి కుటుంబంలోనూ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లలకు జ్వరం రావడం, దాంతో మేం ఆందోళన పడటం అన్నది చాలా సాధారణంగా జరుగుతుండేదే. అందుకే పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పండి.
– డి. వసుంధర, వీరులపాడు

జ్వరం అనేది పలు కారణాల వల్ల రావచ్చు. కానీ సాధారణంగా ఇది హానికారక క్రిముల వల్ల వస్తుంది. జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు నీరసంగా ఉండవచ్చు. ఒళ్లునొప్పులూ, అజీర్తి వంటి సమస్యలు ఉండవచ్చు. అలాగే జ్వరంతో పాటు జలుబు, దగ్గు, వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, శరీరం మీద ఎర్రమచ్చలు లేదా పొక్కులు రావడం చాలా సాధారణంగా కనిపించే లక్షణాలు. కొంతమంది పిల్లలకు (ఆరేళ్ల లోపు పిల్లలకు) మూర్చ కూడా రావచ్చు. శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌హైట్‌ లేదా 36.9 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పైన ఉంటే జ్వరం ఉన్నట్టే లెక్క.

జ్వరం మందు ఎప్పుడివ్వాలంటే...
చంకలో / నుదురు లేదా చెవిలో ఉష్ణోగ్రత 99 డిగ్రీల ఫారెన్‌హైట్‌ లేదా 37.2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పైన ఉంటే జ్వరం మందు ఇవ్వాలి. నులివెచ్చని నీళ్లలో బట్ట ముంచి తుడవచ్చు. చల్లటినీళ్లతో తుడవకూడదు. పారాసిటమాల్‌ అనే జ్వరం మందు ఎప్పుడూ ఇంట్లో పెట్టుకోండి. అయితే దీన్ని పిల్లలకు అందుబాటులో ఉంచవద్దు. ఎంత మోతాదులో ఇవ్వాలన్నది డాక్టర్‌ను అడిగి రాసి పెట్టి ఉంచుకోండి.

డాక్టర్‌ రాసిన మందు, మీ దగ్గర ఉన్న మందు ఒక్కటేనా కాదా అన్నది సరిచూసుకొని, సరైన మోతాదు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల జ్వరం అదుపులోకి వస్తుంది. మోతాదు మోతాదుకు మధ్య ఎంత వ్యవధి ఉండాలో కూడా డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి. జ్వరం బాగా తీవ్రంగా ఉన్నా, ఐదు రోజుల తర్వాత కూడా తగ్గకున్నా, పిల్లలు బాగా అలసటగా ఉన్నా లేదా ఆయాసంగా లేదా పీలగా కనిపిస్తున్నా, వణుకుతున్నా లేదా ఇంకేమైనా సూచనలు కనిపిస్తుంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించండి.

ఇతర సూచనలు
జ్వరంగా ఉన్నప్పుడు పానీయాలు (అంటే... మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటి ద్రవాహారం) బాగా ఇవ్వాలి. జ్వరం వచ్చినవాళ్లకు అజీర్తిగా ఉంటుంది కాబట్టి ఘనాహారం బలవంతంగా ఇవ్వవద్దు. ఏమీ తినడం లేదని గాభరా పడవద్దు. ద్రవాహారం బాగా తీసుకోకపోయినా లేదా మూత్రం పరిమాణం బాగా తగ్గిపోయినా వెంటనే డాక్టర్‌ను కలవాలి.
కొంతమంది పిల్లలకు జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు మూర్ఛ రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మూర్ఛ వచ్చినప్పుడు ఇవ్వాల్సిన ప్రథమ చికిత్స గురించి తెలుసుకొని ఉండాలి.

ముఖ్య గమనిక : పారసిటమాల్‌ అనే మందు ఒక మిల్లీలీటర్‌లో వంద మిల్లీగ్రాముల పారాసిటమాల్‌గానూ, ఐదు మిల్లీలీటర్లలో నూటఇరమై లేదా రెండువందలయాభై మిల్లీ గ్రాముల పారాసిటమాల్‌గానూ లభ్యమవుతుంది. కాబట్టి మీరు తీసుకున్న బాటిల్‌ బట్టి బిడ్డకు ఇవ్వాల్సిన మిల్లీలీటర్లలో వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి సరైన మోతాదు ఏమిటో డాక్టర్‌ను అడగడం, బాటిల్‌ మీద రాసి ఉన్న మోతాదు (డోసు)తో పోల్చుకొని జాగ్రత్తగా కరెక్ట్‌ డోస్‌ ఇవ్వడం చాలా ముఖ్యం. పొరబాటున మోతాదు ఎక్కువైతే ప్రమాదం. ఒకవేళ ప్రమాదవశాత్తు అలా జరిగితే వెంటనే డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.చుక్కల లెక్క లేదా స్పూనుల లెక్క కాకుండా కరెక్ట్‌గా మిల్లీలీటర్ల లెక్కలో పారాసిటమాల్‌ మందు ఇవ్వండి. మోతాదుకూ, మోతాదుకూ మధ్య సరైన వ్యవధి ఉంచండి.

మరో ముఖ్యగమనిక:  పిల్లల్లో జ్వరం తెలుసుకోడానికి ఉపయోగించే థర్మామీటర్లలో పాదరసం ఉండేవి (మెర్క్యురీ థర్మామీటర్‌), డిజిటల్‌ థర్మామీటర్లు ఇలా రకరకాలు ఉంటాయి. అయితే చిన్నపిల్లల్లో జ్వరం తెలుసుకోడానికి నోట్లో మెర్క్యురీ థర్మామీటరు ఉంచడం వల్ల పొరబాటున అది విరిగితే మెర్క్యురీ పాయిజనింగ్‌ జరిగే ముప్పు ఉంటుంది. అది చాలా ప్రమాదం. కాబట్టి పిల్లల్లో డిజిటల్‌ థర్మామీటరు వాడటం చాలా మేలు. ఒకవేళ మెర్క్యూరీ థర్మామీటర్‌ వాడాల్సి వస్తే దాన్ని నోట్లో పెట్టకూడదు.


జ్వరంతో ముర్ఛ వస్తే... ఎలాంటి ప్రథమచికిత్స ఇవ్వాలి?
ఇటీవల మూడేళ్ల వయసున్న మా పిల్లవాడికి జ్వరం వచ్చింది. అదే సమయంలో మూర్ఛ కూడా వచ్చింది. జ్వరం తీవ్రత బాగా పెరిగినప్పుడు ఇలా ఫిట్స్‌ రావడం సాధారణమేనని డాక్టర్‌ అన్నారు. అయితే పిల్లలకు ఇలా మూర్ఛ వచ్చినప్పుడు ఆసుపత్రికి వచ్చేలోపు ఎలాంటి ప్రథమచికిత్స ఇవ్వాలో దయచేసి చెప్పండి. – ఉదయశంకర్, ఖమ్మం
మూర్ఛ వచ్చినప్పుడు ఆ పేషెంట్‌కు అందుబాటులో పదునైనవి, వేడి వస్తువులు లేకుండా చూసుకోవాలి. పేషెంట్‌ భద్రత దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఇక మూర్ఛ వచ్చిన వ్యక్తి బట్టలను కొంచెం వదులు చేసి, బాగా గాలి తగిలేటట్లు చూడాలి. గదిలోకి కిటికీలు తెరవాలి. చుట్టూ మెత్తని దిండ్లు పెడితే, పిల్లలకు దెబ్బలు తగలకుండా జాగ్రత్త తీసుకున్నవారవుతారు.
నోట్లో స్ఫూన్లు పెట్టడం, చేతిలో తాళంచెవులు పెట్టడం, ముఖం మీద చల్లటినీళ్లు చల్లడం వంటివి చేయకూడదు. అలా చేయడం ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదంగా కూడా మారవచ్చు. స్పూన్లు, తాళంచేతుల వల్ల దెబ్బలు తగిలి రక్తస్రావం కూడా కావచ్చు. స్పూను గొంతుకు అడ్డం పడే ప్రమాదం కూడా ఉంది. అకస్మాత్తుగా ముఖం మీద నీళ్లు చిమ్మడం వల్ల మూర్ఛ ఎక్కువ కావచ్చు.
మూర్ఛ ఆగేవరకు పైన చెప్పిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇక మూర్ఛ (ఫిట్స్‌) ఆగాక, అతడు కోలుకునే వరకు రికవరీ స్థితిలో పెట్టండి. ఇలా రికవరీ స్థితిలో పెట్టడం వల్ల ఉమ్ము, వాంతి వంటివి కిందికి కారిపోతాయి. బాథితుడి శ్వాసకు అడ్డుపడవు.
ఆరేళ్ల వయసులోపు పిల్లల్లో ఒక్కోసారి జ్వరం తీవ్రంగా ఉంటే ఫిట్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాంటి సమయంలో చేయాల్సిన ప్రథమ చికిత్స ఇలా ఉండాలి.

1    పిల్లాడి కాళ్లను, చేతులను తిన్నగా (స్ట్రెయిట్‌గా) ఉండేట్లుగా జాగ్రత్త తీసుకోవాలి. చిన్నారికి కళ్లజోడు వంటివి ఉండే వాటిని తీసేయాలి.
2    ఒక చేతిని మోచేతి దగ్గర ఒంచాక... మరో చేతిని ఛాతీమీదికి వచ్చేలా వంచి, అరచేతిని చెంప కిందికి వచ్చేలా చూడాలి.
3    మీ చేతితో తన కాలిని వంచుతూ చిన్నారిని ఒకపక్కకు పూర్తిగా ఒత్తిగిలి ఉండేలా (ఒరిగేలా) చూడాలి. (మీవైపునకు తిప్పుకోవడం వల్ల చిన్నారిని బాగా గమనించవచ్చు). అయితే ఈ క్రమంలో తాను పూర్తిగా బోర్లాపడిపోకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి.
తలను కాస్త వెనక్కు వంగేలా చూసుకోవాలి. అలాగే నోరు, ముక్కు గాలి ఆడేలా ఉంచాలి. ఇలా పక్కకు ఒరిగిపోయేలా చేయడం వల్ల వాంతి లేదా లాలాజలం (నురుగు) వంటివి పక్కకు కారిపోతాయి. అదే చిన్నారులు వెల్లకిల ఉంచడం వల్ల లాలాజలం/ నురుగు / వాంతి వంటివి నోట్లోనే ఉండిపోయి ఊపిరితిత్తులకు వెళ్లే గాలిని అడ్డగించవచ్చు. అది చాలా ప్రమాదం కాబట్టి ఇలా పిల్లలను పక్కకు ఒరిగి ఉండేలా చూడటం చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలను తీసుకున్న తర్వాత వెంటనే ఆంబులెన్స్‌ను పిలిపించి, వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి.

మరీ చిన్న పిల్లలైతే...
4    ఏడాదిల లోపు చిన్నారులను మిగతా శరీరం కంటే తల కిందికి ఉండేలా పిల్లలను ఏటవాలుగా వంచాలి. ఇలా చేయడం వల్ల నోట్లోని లాలాజలం, నురుగు, వాంతి వంటివి కిందికి కారిపోయి, శ్వాస తీసుకోడానికి అవి అడ్డుపడవు. ఇది జరిగిన వెంటనే వీలైనంత త్వరగా ఆంబులెన్స్‌ను పిలిచి, చిన్నారిని ఆసుపత్రికి తరలించాలి.


- డా‘‘ శివరంజని సంతోష్‌ ,సీనియర్‌ పీడియాట్రీషియన్, రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్,మాదాపూర్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement