
అండాశయాల్లో నీటితిత్తులు కనిపించే పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్న కొందరు మహిళల్లో రాత్రివేళల్లో నిద్ర సంబంధిత సమస్యలు కనిపించే అవకాశాలుంటాయి. అంటే... కొందరిలో రాత్రి నిద్రపట్టకపోవడం (ఇన్‌సామ్నియా), గురకవస్తూ... దాంతో మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం (స్లీప్ ఆప్నియా)తో నిద్రాభంగం అవుతుండటం, కాళ్లు విపరీతంగా కదిలించే ‘రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్’తో నిద్రనుంచి లేచి, ఆపై ఎంతకూ నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. పీసీఓఎస్ ఉండి, ఇలాంటి నిద్ర సంబంధిత సమస్యలు కనిపించే మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది.
అండాశయాల్లో నీటితిత్తులకు హార్మోన్ల అసమతౌల్యతే ప్రధాన కారణం. అంటే కొన్ని హార్మోన్ల స్రావాల్లో హెచ్చు తగ్గులు, ప్రధానంగా పురుషుల్లో ఎక్కువగా ఉండే యాండ్రోజెన్ వంటి హార్మోన్ల మోతాదులు పెరగడం వంటి అంశాలు అసమతౌల్యతకు దారితీస్తాయి. ఈ అసమతౌల్యతే నిద్రా సమస్యలకూ కారణమవుతుంది.
ఆహార అలవాట్లతో అధిగమించడం ఇలా...
- కొన్ని రకాల ఆహారాలను దూరంగా ఉంచడం వల్ల స్లీప్ సమస్యలను దూరంగా ఉంచవచ్చు. అవి... ఎక్కువగా చక్కెరలను వెలువరించే ఆహారాలను చాలా పరిమితంగా తీసుకుంటూ... అదే సమయంలో అతి తక్కువగా చక్కెరను వెలువరించే (లో–గ్లైసీమిక్ ఇండెక్స్) ఆహారాలను తీసుకోవడం. (అంటే ఉదాహరణకు వరిలాంటి ఎక్కువ చక్కెరలను వెలువరించే ఆహారాలు కాకుండా కొర్రలు, రాగుల వంటి చిరుధాన్యాలను తీసుకోవడం, అతిగా పాలిష్ చేయనివీ, పొట్టుతో ఉండే ధాన్యాలనే తీసుకోవడం.
- పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలతో పాటు కొవ్వులు తక్కువగా ఉండి, ప్రోటీన్ మోతాదులు ఎక్కువగా ఉండే చిక్కుళ్ల వంటి ఆహారాలను తీసుకోవడం.
- అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే పానియాలకు దూరంగా ఉండటం.
- కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే బాదం వంటి నట్స్, ఎండుఫలాలను ఎక్కువగా తీసుకోవడం.
- వేట మాంసాన్ని చాలా పరిమితంగా తీసుకుంటూ, వైట్ మీట్ (చేపలను) ఎక్కువగా తీసుకోవడంతో పీసీఓఎస్‌ను చాలావరకు నివారించవచ్చు. ఆరోగ్యకరమైన
జీవన శైలితో...
- క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడిని తగ్గించే (ధ్యానం, యోగా వంటి)టెక్నిక్స్‌తో, బరువును నియంత్రిస్తూ స్థూలకాయం రాకుండా చూసుకోవడం, రోజుకు కనీసం 8 గంటల పాటు కంటినిండా నిద్రపోవడం వంటి చర్యలతో పీసీఓఎస్‌ను చాలావరకు నివారించవచ్చు. దాంతో నిద్రసమస్యలతో పాటు, ఇతరత్రా అనేక సమస్యలూ నివారితమై, మహిళల ఆరోగ్యం అన్ని విధాలా మెరుగుపడుతుంది.
డాక్టర్ ఎమ్ రజనీ
సీనియర్ గైనకాలజిస్ట్
(చదవండి: అవుట్‌డోర్ కుక్‌వేర్..ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు)