మద్యం మత్తులో ఇంజినీర్ల వీరంగం
ఎర్రావారిపాళెం, న్యూస్‌లైన్: ప్రసిద్ధ పర్యాటక పుణ్యక్షేత్రమైన తలకోనలో శనివారం రాత్రి మద్యం మత్తులో వీరంగం చేసిన ఇంజినీర్లను స్థానికులు చితకబాదారు. పో లీసుల కథనం మేరకు.. శనివారం రాత్రి బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు భరత్ (28), మోహన్ (29), అలెక్స్ (26), ప్రీతిజిత్ (27), కృష్ణకిషోర్(31) తలకోనలోని టీటీడీ అతిథిగృహంలో గదిని అద్దెకు తీసుకున్నారు. వీరు తమ వెంట తెచ్చుకున్న మద్యం సేవించి మాంసంతో విందు చేసుకున్నారు. మత్తులో ఉన్న వీరు గదికి సైతం మద్యం తీసుకొచ్చి సే వించేందుకు ప్రయత్నించారు.
టీటీడీ అతిథిగృహంలో మద్యం, మాంసం అనుమతించమని సెక్యూరిటీ సిబ్బంది అన్నారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఇంజినీర్లు మేమనుకుంటే ఏమైనా చేస్తాం.. మమ్మల్నే ఎదిరిస్తారా’’ అంటూ సెక్యూరిటీగార్డులు శంకర, బాలకృష్ణపై దాడికి దిగారు. ఈ హఠాత్ పరిణామానికి భయపడిన సెక్యూరిటీగార్డులు పరుగులు తీసి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెరబైలు గ్రామంలోని తమ బంధువులకు విషయాన్ని తెలిపారు.
వారంతా టీటీడీ అతిథిగృహం వద్దకు చేరుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను చితకబాదారు. ఈఘర్షణలో అతిథిగృహంలో ఫర్నిచర్ ధ్వంసం అయింది. గాయపడిన వారినందరినీ చికిత్స నిమిత్తం 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎర్రావారిపాళెం ఇన్‌చార్జ్ ఎస్‌ఐ నెత్తికంఠయ్య ఇరువర్గాల వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.