గురక వస్తోంది... పరిష్కారం చెప్పండి!
ఆయుర్వేద కౌన్సెలింగ్
నా వయసు 57 సంవత్సరాలు. నాకు రెండు సంవత్సరాల నుండి శీతాకాలంలో కఫంతో కూడిన దగ్గు. కొంచెం ఆయాసం వస్తోంది. ప్రస్తుతం పది రోజుల నుండి ఇబ్బందిగా ఉంటోంది. ఊపిరితిత్తుల వైద్య నిపుణుల సలహా మేరకు రక్త పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే చేయించాను. వారు పరీక్షించి ‘‘ఇస్నోఫిలియా’’ అని చెప్పారు. దీనికి ఆయుర్వేద మందులు సూచింప ప్రార్థన.
- వి. సరవన్న , విశాఖపట్నం
మీరు చెప్పిన దాన్ని బట్టి, ఆయుర్వేదంలో దీనిని ‘కఫజకాస’గా చెప్పుకోవచ్చు. మీరు తేలికగా జీర్ణమయ్యే ఆహారం, వేడివేడిగా తినండి. చల్లగాలి, మంచుకు గురి కాకుండా, ఛాతీని, చెవులను కప్పి ఉంచే దళసరి దుస్తులు ధరించండి. ఈ దిగువ సూచించిన మందుల్ని ఒక మూడు వారాల పాటు వాడి, రక్త పరీక్ష చేయించుకుని, ‘ఎబ్సల్యూట్ ఇస్నోఫిల్స్ కౌంటు’ను గమనించండి. మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.
1. త్రికటుచూర్ణం (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు): 3 గ్రా॥తేనెతో రెండు పూటలా నాకాలి. లేదా - వ్యోషాది వటి (మాత్రలు): పూటకు రెండు చొప్పున, మూడు పూటలా.
2. ‘మల్లసిందూరం’ (భస్మం), ‘ప్రవాళభస్మ’: ఒక్కొక్కటి రెండేసి చిటికెలు, తేనెతో కలిపి రెండుపూటలా.
3. తులసి ఆకుల రసం (‘నల్ల తులసి’ శ్రేష్ఠం): ఒక చెంచా తేనెతో రోజూ మూడు పూటలా సేవించాలి.
గమనిక: మీ వ్యాధి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా, తులసి రసాన్ని రోజూ ఒక చెంచా తేనెతో ఓ ఆరునెలలపాటు సేవించండి. ఇది దగ్గు, ఆయాసాన్ని తగ్గించటమే కాకుండా అజీర్ణం, మధుమేహం, చర్మరోగాలను నియత్రించడానికి కూడా దోహదపడుతుంది.
నా వయసు 37 సంవత్సరాలు. అప్పుడప్పుడు మలవిసర్జనతో బాటు కొంచెం నెత్తురు పడుతోంది. ఇంటర్నల్ పైల్ మాస్ (లోపల ఉండే మూలశంక)గా డాక్టర్లు నిర్ధారణ చేశారు. పూర్తిగా నయమవ్వడానికి మంచి ఆయుర్వేద మందులు తెలియజేయగలరు.
- కె. ప్రత్యూష, కరీంనగర్
ఆయుర్వేదంలో దీనిని ‘రక్తజ అర్మో రోగం’గా చెప్పవచ్చు. ఆహారంలో ఉప్పు, పులుపు, కారాలు గణనీయంగా తగ్గించి, పీచు, నీరు అధికంగా ఉండే శాకాహారం తినండి. తాజాఫలాలలో ‘జామిపండు’ చాలా ఉపయోగకారి. కంద, బచ్చలి కూర ప్రతి రోజూ తినండి. వ్యాయామం, ప్రాణాయామం ప్రతీరోజూ చెయ్యండి. ఈ క్రింది మందులు ఒక నెలరోజులు వాడండి.
1. కాంకాయనవటి (మాత్రలు): ఉదయం-1, రాత్రి-1.
2. బోలబద్ధరస (మాత్రలు): ఉదయం-1, రాత్రి-1.
గృహవైద్యం: ఒక చెంచా ఉల్లిపాయ రసం, ఒక చెంచా తేనెతో కలిపి రోజూ రెండు పూటలా సేవిస్తే రక్తస్రావం వెంటనే తగ్గుతుంది రోజూ ఒక ఉసిరికాయ, ఆరు నెలలపాటు తింటే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు,
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 33 ఏళ్లు. గృహిణిని. ఒక ఏడాదిగా నాకు కీళ్లు, వెన్ను, భుజాలు, చేతుల్లో తీవ్రమైన నొప్పి వస్తోంది. ఇంటి పనిచేస్తున్న సమయంలో ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంటోంది. ఉదయం లేవగానే ఈ నొప్పులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పనిచేస్తున్న కొద్దీ నొప్పులు కాస్త తగ్గుతున్నాయి. కానీ సాయంత్రానికల్లా చేతులు విపరీతంగా లాగుతుంటాయి. డాక్టర్‌ను సంప్రదించాను. రక్త పరీక్షలు చేశారు. రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ అని వచ్చింది. దాని ఆధారంగా నాకు ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’ ఉన్నట్లు చెప్పారు. మందులు మొదలుపెట్టారు. రోజూ చాలా మందులు వాడాల్సి వస్తోంది. అది నాకు చాలా సమస్యగా ఉంది. ఇన్నేసి మందులు మింగకుండా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా?
- సులక్షణ, నిజామాబాద్
మీరు రాసిన లేఖను విశ్లేషించాక మీకు రెండు అంశాలను స్పష్టంగా చెప్పాలి. మొదటిది... జనాభాలో ఆరు శాతం మందికి రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష పాజిటివ్ రావచ్చు. కానీ వాళ్లందరికీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోవడం సరికాదు. ఇక రెండో అంశం... మీ నొప్పులూ, శరీరంలో నొప్పులు వస్తున్న అవయవాలు, మీలో కనిపించే ఇతర లక్షణాలూ, అవి ఎంతకాలంగా కనిపిస్తున్నాయి, మీ రక్తపరీక్షలూ వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను నిర్ధారణ చేయాలి. సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ నిర్దిష్టమైన కొన్ని లక్షణాలను నిశితంగా పరిశీలన చేయడంతో పాటు వివిధ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందని నిర్ణయం జరగాలి. మీకు రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిందని చెబుతున్నప్పటికీ మీరు చెబుతున్న లక్షణాల ప్రకారమైతే మీకు ఆ వ్యాధి ఉన్నట్లుగా చెప్పలేం. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ నిపుణులను కలవండి. మళ్లీ కూలంకషంగా అన్ని పరీక్షలూ చేయించుకోండి. అప్పుడు వ్యాధి నిర్ధారణ అయితే... దాని ఆధారంగానే చికిత్స నిర్ణయించవచ్చు. అంతేగానీ ఇన్నిన్ని మందులను ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు.
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్
హైదరాబాద్
స్లీప్ కౌన్సెలింగ్
నా వయసు 48 ఏళ్లు. ఎత్తు ఐదడుగుల నాలుగు అంగుళాలు. బరువు 84 కేజీలు. నేను గురకతో బాధపడుతున్నాను. ఇటీవల ఫ్రెండ్స్‌తో టూర్‌కు వెళ్లాను. గదిలో, కారులో పడుకున్న వెంటనే గురకపెట్టేవాణ్ణి. ఆరోజు నుంచి తీవ్ర మానసిక వేదనతో సతమతమవుతున్నాను. న్యూనతకు గురవుతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- డి. రవి, సూర్యాపేట
వయసు పెరుగుతున్న కొద్దీ గురక సమస్య తీవ్రమవుతుంది. మనం నిద్రపోగానే అన్ని అవయవాలూ రిలాక్స్ అయినట్లే శ్వాసనాళమూ మెత్తబడుతుంది. శ్వాసనాళంతో పాటు, నాలుక చివర, అంగిలిలోన, గొంతు ముందు భాగం వద్ద గాలి ప్రకంపనలు సంభవిస్తాయి. ఆ కంపన వల్ల నోటి నుంచి, ముక్కు నుంచి ఒక రకమైన శబ్దం వస్తుంది. అదే గురక.
గురక వస్తుందంటే ఈ సమస్యలకు అది సూచన కావచ్చు:
శ్వాసకు సంబంధించిన కండరాల బలహీనత. ఇక ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆ కండరాలు మరింతంగా రిలాక్స్ అయిపోవడం వల్ల గురక మరింత ఎక్కువగా రావచ్చు. కొందరిలో గొంతులోని కండరాలు మందంగా మారడం వల్ల గాలి ప్రవహించే నాళం సన్నబడవచ్చు. కొన్నిసార్లు అంగిలి వెనక మృదువుగా ఉండే భాగం పొడవు పెరగవచ్చు కొన్నిసార్లు ముక్కులో ఏవైనా అడ్డంకులు వచ్చినందువల్ల శ్వాస తీసుకోవడానికి మరింత గట్టిగా గాలి పీల్చాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలోనూ శబ్దం వస్తుంది. కొన్నిసార్లు జలుబు చేయడం, సైనస్‌లలో ఇన్ఫెక్షన్లు, ఆ కారణంగా వచ్చే జ్వరం వల్ల గాలిని మరింత బలంగా పీల్చడంతోనూ గురక రావచ్చు గురకలో శ్వాస అందని పరిస్థితిని అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటారు. దాంతో రక్తంలో ఆక్సిజన్ తగ్గి, గుండెపై చాలా భారం పడుతుంది. గుండె రక్తసరఫరా కోసం ఆక్సిజన్ కోసం మరింత ఎక్కువ శ్రమిస్తుంది.
చికిత్స : కొందరిలో ముక్కుకు ఒక ప్రత్యేకమైన మాస్క్‌ను తొడుగుతారు. దీన్ని సీపాప్ చికిత్స అంటారు. మరికొందరిలో ‘ఉవాలోపాలటోఫ్యారింజియల్ ప్లాస్టీ’ అనే సర్జరీ చేస్తారు. ఇంకొందరిలో థెర్మల్ అబ్లేషన్ చికిత్స ద్వారా ముక్కులో, గొంతులో, అంగిలిలో అడ్డంకులను తొలగిస్తారు.
గురక నివారణ: బరువును అదుపులో పెట్టుకోడానికి వాకింగ్ వంటి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి నిద్రకు ముందు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్ పిల్స్, అలర్జీని అదుపులో ఉంచే మందులను తీసుకోకండి ఆల్కహాల్ మానేయండి. అలా చేయలేకపోతే కనీసం నిద్రవేళకూ, మద్యం తీసుకోడానికీ మధ్య 4 గంటలూ, నిద్రకూ, హెవీ మీల్‌కూ మధ్య 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి నిద్రవేళలు క్రమబద్ధంగా ఉండాలి ఒకవైపునకు ఒరిగి పడుకోండి మీ తలను మీ పడకకంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోండి.
డాక్టర్ రమణ ప్రసాద్
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్
అండ్ స్లీప్ స్పెషలిస్ట్
కిమ్స్ హాస్పిటల్
సికింద్రాబాద్